త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ షేర్ చేయడం మరింత సులభం..

WhatsApp | వాట్సాప్‌ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మెటా సంస్థ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన రీల్స్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా పంచుకునేందుకు వాట్సాప్‌ చాట్‌ అటాచ్‌మెంట్‌ మెనూలో ప్రత్యేకంగా రీల్స్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

S

Technology | Published On Oct 26, 2026, 1.09 pm IST

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ షేర్ చేయడం మరింత సులభం..
Advertisement

WhatsApp | వాట్సాప్‌ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మెటా సంస్థ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన రీల్స్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా పంచుకునేందుకు వాట్సాప్‌ చాట్‌ అటాచ్‌మెంట్‌ మెనూలో ప్రత్యేకంగా రీల్స్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల చూసిన, లైక్‌ చేసిన లేదా సేవ్‌ చేసిన వీడియోలను వెతకకుండానే నేరుగా వాట్సాప్‌ చాట్‌లో షేర్ చేయ‌వచ్చు. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.26.42.9లో ఈ ఫీచర్‌ను గుర్తించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు దశలవారీగా అందిస్తున్నారు. అయితే, ఈ ఫీచర్‌ను వినియోగదారులందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తారనే విషయాన్ని వాట్సాప్‌ అధికారికంగా ప్రకటించలేదు.

వాట్సాప్‌లో ప్రత్యేక రీల్స్‌ ఆప్షన్‌..

కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌ చాట్‌ అటాచ్‌మెంట్‌ మెనూలో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. గతంలో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను వాట్సాప్‌తో అనుసంధానించిన వినియోగదారులు మీడియా పికర్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్‌ను యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, తమకు కావాల్సిన రీల్‌ను గుర్తించడానికి అందుబాటులో ఉన్న వివిధ మీడియా విభాగాలను పరిశీలించాల్సి వచ్చేది. కొత్త షార్ట్‌కట్‌ ద్వారా చాట్‌ నుంచే ప్రత్యేక స్క్రీన్‌ను తెరిచి ఇన్‌స్టాగ్రామ్‌ కార్యకలాపాలను పరిశీలించవచ్చు. ఇందులో ఇటీవల చూసిన వీడియోల కోసం రీసెంట్స్‌, భవిష్యత్తులో చూడడానికి భద్రపరిచిన వీడియోల కోసం సేవ్డ్‌, లైక్‌ చేసిన వీడియోల కోసం లైక్డ్‌ అనే విభాగాలు ఉంటాయి. దీంతో వినియోగదారులు తమకు కావాల్సిన రీల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు.

కావాల్సిన రీల్‌ను గుర్తించిన తర్వాత దాన్ని ఎంపిక చేసుకుని వ్యక్తిగత చాట్‌లో లేదా గ్రూప్‌ చాట్‌లో నేరుగా షేర్‌ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న షేరింగ్‌ సదుపాయాన్ని మరింత సులభంగా ఉపయోగించుకునేలా చేయడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశం. ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్‌ను వాట్సాప్‌లో షేర్‌ చేసే విధానంలో పూర్తిగా కొత్త వ్యవస్థను తీసుకురావడం లేదని తెలుస్తోంది. కొత్త రీల్స్‌ షార్ట్‌కట్‌ను ఉపయోగించాలంటే వినియోగదారులు తమ వాట్సాప్‌ ఖాతాను మెటా అకౌంట్స్‌ సెంటర్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మధ్య కంటెంట్‌ షేరింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చాలన్న మెటా ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఫీచర్‌ను తీసుకువస్తున్నారు. అయితే, ఖాతాలను అనుసంధానించడం తప్పనిసరి కాదు. తమ వాట్సాప్‌ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి వేరుగా ఉంచాలనుకునే వారు యథావిధిగా మెసేజింగ్‌ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. కానీ, ఖాతాలను అనుసంధానించని వారికి ప్రత్యేక రీల్స్‌ ఆప్షన్‌ కనిపించదు.

వాట్సాప్‌ రీల్స్‌ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా అందుబాటులో ఉన్న అనుకూల ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను ఉపయోగిస్తున్న కొంతమంది పరీక్షా వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. అయితే, సంబంధిత బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నంత మాత్రాన ఈ ఫీచర్‌ అందరికీ కనిపిస్తుందని చెప్పలేం. వాట్సాప్‌ దీన్ని దశలవారీగా ప్రారంభిస్తోంది. ఈ ఫీచర్‌ను విస్తృత స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనే విషయంపై సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అలాగే, ఐఓఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. చాట్‌ అటాచ్‌మెంట్‌ మెనూలో ఈ ఆప్షన్‌ కనిపించని వినియోగదారులు తమ ఖాతాకు అందుబాటులోకి వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

మెటా తన యాప్‌ల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ అప్‌డేట్‌ మరో ముందడుగుగా చెప్పవచ్చు. వివిధ ప్లాట్‌ఫామ్‌ల మధ్య కంటెంట్‌ను పంచుకునే ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం దీని లక్ష్యం. ముఖ్యంగా ప్రైవేట్‌ చాట్‌లలో తరచూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ను షేర్‌ చేసే వారికి ఈ ఫీచర్‌ సమయాన్ని ఆదా చేయనుంది. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న షేరింగ్‌ సదుపాయాన్ని సులభంగా ఉపయోగించుకునేందుకు మాత్రమే ఖాతాలను అనుసంధానించాల్సి రావడంతో, వినియోగదారులు తమ ఖాతాలను మెటా అకౌంట్స్‌ సెంటర్‌తో అనుసంధానించేందుకు ఎంతవరకు ఆసక్తి చూపుతారనే దానిపై ఈ ఫీచర్‌ ఆదరణ ఆధారపడి ఉంటుంది.

Advertisement
Advertisement