త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. అకౌంట్ లేకున్నా కాల్స్‌లో చేరొచ్చు..

WhatsApp | వాట్సాప్‌ వినియోగదారులకు కీలకమైన కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్‌ అకౌంట్‌ లేని వ్యక్తులు సైతం ఆహ్వాన లింక్‌ ద్వారా వ్యక్తిగత, గ్రూప్‌ కాల్స్‌లో పాల్గొనేందుకు వీలుగా గెస్ట్‌ కాలింగ్‌ ఫీచర్‌ను సంస్థ పరిచయం చేసింది. ఈ కాల్స్‌ ఉచితంగా అందుబాటులో ఉండడంతోపాటు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ రక్షణ కలిగి ఉంటాయి. కాల్స్‌కు ఎలాంటి సమయ పరిమితి ఉండదు.

S

Technology | Published On Oct 16, 2026, 2.23 pm IST

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. అకౌంట్ లేకున్నా కాల్స్‌లో చేరొచ్చు..
Advertisement

WhatsApp | వాట్సాప్‌ వినియోగదారులకు కీలకమైన కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్‌ అకౌంట్‌ లేని వ్యక్తులు సైతం ఆహ్వాన లింక్‌ ద్వారా వ్యక్తిగత, గ్రూప్‌ కాల్స్‌లో పాల్గొనేందుకు వీలుగా గెస్ట్‌ కాలింగ్‌ ఫీచర్‌ను సంస్థ పరిచయం చేసింది. ఈ కాల్స్‌ ఉచితంగా అందుబాటులో ఉండడంతోపాటు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ రక్షణ కలిగి ఉంటాయి. కాల్స్‌కు ఎలాంటి సమయ పరిమితి ఉండదు. గ్రూప్‌ కాల్స్‌లో గరిష్ఠంగా 32 మంది పాల్గొనవచ్చు.

వాట్సాప్‌ గెస్ట్‌ కాలింగ్‌ ఎలా పనిచేస్తుంది?

వాట్సాప్‌ వినియోగదారులు యాప్‌లోని కాల్స్‌ ట్యాబ్‌లో ప్లస్‌ (+) గుర్తుపై ట్యాప్ చేసి కాల్‌ లింక్‌ను సృష్టించవచ్చు. అనంతరం ఆ లింక్‌ను కాల్‌లో పాల్గొనాలని కోరుకునే వ్యక్తులతో పంచుకోవచ్చు. అయితే కాల్‌ లింక్‌లను సృష్టించే అవకాశం వాట్సాప్‌ అకౌంట్‌ ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. గెస్ట్‌లు తమ కంప్యూటర్‌ బ్రౌజర్‌లో ఆహ్వాన లింక్‌ను తెరిచి, పేరును నమోదు చేసి కాల్‌లో చేరేందుకు వేచి ఉండవచ్చు. హోస్ట్‌ అనుమతి ఇచ్చే వరకు వారు వెయిటింగ్‌ రూమ్‌లోనే ఉంటారు. హోస్ట్‌ ఆమోదించిన తర్వాతే కాల్‌లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. కాల్‌లో చేరిన గెస్ట్‌లు కంప్యూటర్‌ స్క్రీన్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. దీనివల్ల కలిసి పనిచేయడం, పత్రాలు లేదా ఇతర సమాచారాన్ని పరిశీలించడం సులభమవుతుంది. అలాగే థంబ్స్‌-అప్‌, హార్ట్‌ వంటి ఎమోజీలతో స్పందించవచ్చు. సంభాషణలో పాల్గొనేందుకు తమ వంతు కోసం చేతిని పైకెత్తే సదుపాయం కూడా ఉంటుంది.

గెస్ట్‌లకు కొన్ని పరిమితులు..

భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ గెస్ట్‌లకు కొన్ని పరిమితులు విధించింది. కాల్‌లో పాల్గొంటున్న ఇతర వ్యక్తుల ఫోన్‌ నంబర్లను గెస్ట్‌లు చూడలేరు. కాల్‌ సమయంలో సందేశాలు పంపడం లేదా తమంతట తాముగా ఇతర వ్యక్తులను కాల్‌లోకి చేర్చడం సాధ్యం కాదు. ప్రతి గెస్ట్‌ కాల్‌లో చేరేందుకు హోస్ట్‌ అనుమతి తప్పనిసరి. అలాగే హోస్ట్‌ ఎప్పుడైనా గెస్ట్‌ను కాల్‌ నుంచి తొలగించవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి గూగుల్‌ క్యాలెండర్‌, ఔట్‌లుక్‌ క్యాలెండర్‌లతో అనుసంధాన సదుపాయాన్ని కూడా తీసుకురావాలని వాట్సాప్‌ యోచిస్తోంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే వినియోగదారులు తమ క్యాలెండర్‌ నుంచే నేరుగా వాట్సాప్‌ కాల్స్‌ను సృష్టించవచ్చు. దీని కోసం వాట్సాప్‌ ప్లగిన్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, తమ అకౌంట్‌ను అనుసంధానించాలి. అనంతరం క్యాలెండర్‌ ఆహ్వానంలో వాట్సాప్‌ కాల్‌ లింక్‌ను జతచేయవచ్చు. ఆహ్వానం అందుకున్న వ్యక్తులు వాట్సాప్‌ అకౌంట్‌ ఉన్నా లేకపోయినా కాల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

గెస్ట్‌ కాలింగ్‌ ఫీచర్‌ను దశలవారీగా వినియోగదారులకు అందిస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. అయితే గూగుల్‌, ఔట్‌లుక్‌ క్యాలెండర్‌ అనుసంధాన సదుపాయాలను ఈ ఏడాది చివరి నాటికి పరిచయం చేయనుంది. ఈ మార్పులతో వాట్సాప్‌ అకౌంట్‌ లేని వ్యక్తులతోనూ సులభంగా ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం కలగనుంది.

Advertisement
Advertisement