త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

WhatsApp | డిజిటల్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, అనుమానాస్పద ఓటీపీ ట్రిక్స్ పెరుగుతున్న నేపథ్యంలో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ త‌న యూజర్ల భద్రత కోసం ఐదు కీలక యాంటీ-స్కామ్ టూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. స్కామర్లు అత్యవసర పరిస్థితుల మాదిరిగా ఒత్తిడి సృష్టించి వ్యక్తిగత సమాచారం చోరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది.

S

Technology | Published On May 26, 2026, 2.02 pm IST

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
Advertisement

WhatsApp | డిజిటల్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, అనుమానాస్పద ఓటీపీ ట్రిక్స్ పెరుగుతున్న నేపథ్యంలో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ త‌న యూజర్ల భద్రత కోసం ఐదు కీలక యాంటీ-స్కామ్ టూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. స్కామర్లు అత్యవసర పరిస్థితుల మాదిరిగా ఒత్తిడి సృష్టించి వ్యక్తిగత సమాచారం చోరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది. ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే అనేక భద్రతా, ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయ‌ని, అయితే ఇవి అకౌంట్ సెక్యూరిటీని బలోపేతం చేయడంతోపాటు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలోనూ సహాయపడతాయ‌ని తెలిపింది. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్ ద్వారా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా మ్యూట్ అవుతాయి. స్పామ్, స్కామ్ కాల్స్ నుంచి రక్షణ కల్పించడమే దీని ఉద్దేశం. అయితే యూజర్లు ఆ కాల్స్‌ను తర్వాత కాల్స్ ట్యాబ్ లేదా నోటిఫికేషన్స్‌లో చూసే అవకాశం ఉంటుంది.

ప్ర‌ధాన ఫీచ‌ర్లు ఇవే..

స్కామర్లు సాధారణంగా భయాందోళనలు సృష్టించి వెంటనే స్పందించేలా ఒత్తిడి తెస్తారని వాట్సాప్ తెలిపింది. దీనిని ఎదుర్కొనేందుకు కాంటెక్స్ట్ కార్డ్స్ ఫీచర్‌ను అందిస్తోంది. ఇందులో చాట్ లేదా గ్రూప్‌లోని వ్యక్తి కాంటాక్ట్‌గా సేవ్ అయ్యాడా లేదా, కామన్ గ్రూప్స్ ఉన్నాయా, ఆ ఫోన్ నంబర్ మరో దేశంలో రిజిస్టర్ అయ్యిందా, అకౌంట్ ఇటీవల క్రియేట్ అయ్యిందా వంటి వివరాలు కనిపిస్తాయి. దీంతో యూజర్లు రిప్లై ఇవ్వాలా, బ్లాక్ చేయాలా, రిపోర్ట్ చేయాలా అన్నది నిర్ణయించుకోవచ్చు. ఇక వీడియో కాల్ సమయంలో తెలియని వ్యక్తులతో స్క్రీన్ షేర్ చేయబోతే వాట్సాప్ ప్రత్యేక హెచ్చరికలు చూపిస్తుంది. స్కామర్లు బ్యాంక్ డిటైల్స్, వెరిఫికేషన్ కోడ్స్ వంటి సున్నితమైన సమాచారం పొందేందుకు స్క్రీన్ షేరింగ్‌ను ఉపయోగించే అవకాశముంటుందని కంపెనీ హెచ్చరించింది. ఈ వార్నింగ్ ద్వారా యూజర్లు ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాట్సాప్ అకౌంట్‌ను మరో డివైస్‌తో లింక్ చేయించే ప్రయత్నాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయని కంపెనీ తెలిపింది. అనుమానాస్పద డివైస్ లింకింగ్ రిక్వెస్టుల‌ను గుర్తించినప్పుడు వాట్సాప్ ప్రత్యేక అలర్ట్స్ పంపిస్తుంది. రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూపించడంతోపాటు అది స్కామ్ అయ్యే అవకాశముంటుందని హెచ్చరిస్తుంది. దీంతో యూజర్లు వెంటనే అప్రూవ్ చేయకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

టూ-స్టెప్ వెరిఫికేష‌న్ సెట్ చేసుకోవాలి..

అకౌంట్ భద్రత కోసం టూ-స్టెప్ వెరిఫికేషన్ ను తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. ఈ ఫీచర్ ద్వారా అకౌంట్ రీసెట్ లేదా వెరిఫికేషన్ సమయంలో అదనంగా ఆరు అంకెల పిన్ అవసరం అవుతుంది. దీంతో స్కామర్లు వెరిఫికేషన్ కోడ్స్ ద్వారా అకౌంట్‌ను హ్యాక్ చేసే ప్రమాదం తగ్గుతుంది. వాట్సాప్ భద్రతా, ప్రైవసీ ఫీచర్లపై పూర్తి వివరాలను వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. యూజ‌ర్లు స్కామ్‌ల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఆయా టూల్స్ స‌హాయం చేస్తాయ‌ని తెలిపింది.

Advertisement
Advertisement