త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్‌.. గ్రూప్ స‌భ్యుల ప‌రిమితి పెంపు..

WhatsApp | వాట్సాప్ సాధారణ గ్రూపుల్లో సభ్యుల గరిష్ఠ పరిమితిని ప్రస్తుతం ఉన్న 1,024 నుంచి 1,500కు పెంచుతోంది. దీంతో ఒకే గ్రూపులో అదనంగా 476 మంది చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ మార్పును దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

S

Technology | Published On Nov 21, 2026, 12.33 pm IST

WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్‌.. గ్రూప్ స‌భ్యుల ప‌రిమితి పెంపు..
Advertisement

WhatsApp | వాట్సాప్ సాధారణ గ్రూపుల్లో సభ్యుల గరిష్ఠ పరిమితిని ప్రస్తుతం ఉన్న 1,024 నుంచి 1,500కు పెంచుతోంది. దీంతో ఒకే గ్రూపులో అదనంగా 476 మంది చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ మార్పును దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఎంత నుంచి ఎంత‌కు పెంచారు..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కీలక మార్పును తీసుకొస్తోంది. గ్రూపుల్లో సభ్యుల గరిష్ఠ పరిమితిని 1,024 నుంచి 1,500కు పెంచాలని నిర్ణయించింది. దీంతో కుటుంబ గ్రూపులు, పాఠశాలలు, కార్యాలయ బృందాలు, ఇతర పెద్ద కమ్యూనిటీల నిర్వాహకులు ఒకే గ్రూపులో ఎక్కువ మందిని చేర్చుకోవచ్చు. అదనపు గ్రూపులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. వాట్సాప్ తాజా ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ల ద్వారా ఈ ఫీచర్‌ను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాబీటాఇన్ఫో నివేదిక వెల్లడించింది. ఈ మార్పు సాధారణ గ్రూప్ చాట్‌లతోపాటు వాట్సాప్ కమ్యూనిటీల్లో సృష్టించిన గ్రూపులకు కూడా వర్తిస్తుంది. అయితే కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూపులకు ఈ మార్పు వర్తించదు. ఎందుకంటే వాటిలో ఇప్పటికే 2వేల మంది వరకు సభ్యులుగా ఉండేందుకు అవకాశం ఉంది.

మూడేళ్లకు పైగా విరామం తర్వాత వాట్సాప్ సాధారణ గ్రూపుల సభ్యుల పరిమితిని పెంచడం ఇదే తొలిసారి. గతంలో 2022లో సభ్యుల పరిమితిని 512 నుంచి 1,024కు పెంచింది. అప్పటి నుంచి పెద్ద కమ్యూనిటీలను నిర్వహించే అడ్మిన్లు సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు అదనపు గ్రూపులు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఒకే గ్రూపులో ఎక్కువ మందికి ప్రకటనలు, సమాచారం, ఇతర అప్‌డేట్స్ పంపడం సులభం కానుంది.

కొత్త ఫీచర్‌ను ఎలా పొందాలి?

ఈ పరిమితిని పెంచుకోవడానికి గ్రూప్ అడ్మిన్లు ప్రత్యేకంగా ఎలాంటి సెట్టింగ్ మార్చాల్సిన అవసరం లేదు. అడ్మిన్ ఖాతాకు కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉన్న గ్రూపులకు కూడా ఈ మార్పు ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. అయితే వాట్సాప్ ఈ ఫీచర్‌ను దశలవారీగా విడుదల చేస్తుండడంతో అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం 1,024 మంది పరిమితి మాత్రమే కనిపిస్తున్న వినియోగదారులు మరికొన్ని వారాలు వేచి చూడాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్‌లో వాట్సాప్ తాజా వెర్షన్‌ను పరిశీలించుకోవచ్చు. పెద్ద సంఖ్యలో సభ్యులున్న గ్రూపులను నిర్వహించడం సులభతరం చేయడం, వినియోగదారుల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరచడం వాట్సాప్ లక్ష్యంగా ఈ మార్పును తీసుకొస్తోంది.

Advertisement
Advertisement