త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | భార‌త్‌లోనే త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉన్నాయ్‌.. ఫెడ్‌పై ట్రంప్ విమ‌ర్శ‌లు

Donald Trump | భార‌త్‌ను ఉదాహ‌ర‌ణ‌గా (India example) చూపుతూ.. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వడ్డీ రేట్లు తగ్గించడానికి బదులుగా పెంచడం (High Interest Rates) ద్వారా ఫెడరల్ రిజర్వ్ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. వ‌డ్డీ రేట్లు పెంచ‌డం వ‌ల్ల అమెరికా ఆర్థిక వృద్ధి రేటు త‌క్కువ‌గా న‌మోద‌వుతోంద‌న్నారు.

D

International | Published On Nov 21, 2026, 11.56 am IST

Donald Trump | భార‌త్‌లోనే త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉన్నాయ్‌.. ఫెడ్‌పై ట్రంప్ విమ‌ర్శ‌లు
Advertisement

Donald Trump | త్రినేత్ర న్యూస్ : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ (American central bank) అనుసరిస్తున్న ద్రవ్య విధానాలపై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బలమైన ఆర్థిక గణాంకాలు నమోదవుతున్నప్పటికీ వడ్డీ రేట్లు తగ్గించడానికి బదులుగా పెంచడం (High Interest Rates) ద్వారా ఫెడరల్ రిజర్వ్ దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. ఫెడరల్ రిజర్వ్ చాలా రాజకీయ ధోర‌ణితో (political Federal Reserve) వ్యవహరిస్తోందని విమర్శించారు.

వైట్‌హౌస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్త‌వానికి అమెరికాలోనే వ‌డ్డీరేట్లు అతిత‌క్కువ‌గా ఉండాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త్‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "నేను ఫెడ్ ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా తప్పుబట్టడం లేదు. కానీ, ఫెడరల్ రిజర్వ్ రాజకీయ కోణంలో ఆలోచిస్తోంది. మనం మంచి ఆర్థిక గణాంకాలు ప్రకటించినప్పుడల్లా వారు వడ్డీ రేట్లను పెంచుతున్నారు. దాని వెనుక ఒక కారణం ఉంది. నిజానికి దీనికి పూర్తి విరుద్ధంగా జరగాలి. ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉన్నప్పుడు దేశ పరపతి పెరుగుతుంది. అప్పుడు వడ్డీ రేట్లను తగ్గించాలి. కానీ మ‌నం రివ‌ర్స్ చేస్తున్నాం. అందుకే అమెరికా ఆర్థిక వృద్ధి రేటు త‌క్కువ‌గా న‌మోద‌వుతోంది. భార‌త్‌ను చూడండి.. అక్క‌డ తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. దాంతోపాటూ 7 శాతం జీడీపీ (GDP) వృద్ధి నమోదవుతోంది.

నిజానికి మ‌న ద‌గ్గ‌రే వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉండాలి. కానీ ఇక్క‌డ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ రాజ‌కీయ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంది. అందుకే వ‌డ్డీ రేట్లు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. మనకు మెరుగైన క్రెడిట్ ఉన్నందున రేట్లను తగ్గించాలి. అలా చేస్తే మన జీడీపీ 4 శాతం కాదు.. 15 లేదా 20 శాతం ఉంటుంది. మనం అప్పులను కూడా చాలా వేగంగా తీర్చేయగలం. దేశాన్ని నాశనం చేసేలా ఫెడ్‌ చర్యలు ఉన్నాయి" అని ట్రంప్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పాత్రను ఈ సంద‌ర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. ప్ర‌పంచంలోని కొన్ని దేశాలు అమెరికా వ‌ల్లే ఆర్థికంగా ఉన్న‌త స్థాయికి చేరుకున్నాయ‌ని చెప్పారు. అందుకే ప్రపంచంలోనే అత్యల్ప వడ్డీ రేట్లు అమెరికాలోనే ఉండాల‌న్నారు.

2023 తర్వాత ఫెడ్ ఈ ఏడాది తొలిసారి వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. వడ్డీ రేట్లను తగ్గించాల‌న్న అధ్య‌క్షుడు ట్రంప్‌ డిమాండ్‌ను ప‌క్క‌న పెడుతూ.. ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ (Kevin Warsh) నేతృత్వంలోని FOMC కమిటీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో వ‌డ్డీ రేట్ల‌ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఏక‌గ్రీవ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో వ‌డ్డీ రేటు 3.75% నుంచి 4 % చేరింది. యూఎస్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్ (BEA) విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. 2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అమెరికా వాస్తవ జీడీపీ వార్షిక ప్రాతిపదికన 3.4 శాతం వృద్ధి చెందింది.

ఇక భార‌త్ విష‌యానికొస్తే.. ద్వైమాసిక‌ సమీక్ష అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెప్టెంబర్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2025లో దశలవారీగా 1.25% మేర రేట్లను తగ్గించింది. ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిన భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

Also Read..

1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్‌

నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి

ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో వివాదం - మెగా హీరోతో హ‌నుమాన్ 2 అనౌన్స్

Advertisement
Advertisement