త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court | దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు వాట్సాప్ సహా ఇతర డిజిటల్ వేదికలు తీసుకోబోయే నివారణ చర్యల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమానాస్పద ఖాతాలను గుర్తించడం, వినియోగదారులను అప్రమత్తం చేయడం, బాధితులకు పరిహారం చెల్లించేలా బ్యాంకులపై బాధ్యత విధించడం వంటి అంశాలపై కీలక సూచనలు చేసింది.

S

National | Published On Nov 10, 2026, 4.54 pm IST

Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement

Supreme Court | దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు వాట్సాప్ సహా ఇతర డిజిటల్ వేదికలు తీసుకోబోయే నివారణ చర్యల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమానాస్పద ఖాతాలను గుర్తించడం, వినియోగదారులను అప్రమత్తం చేయడం, బాధితులకు పరిహారం చెల్లించేలా బ్యాంకులపై బాధ్యత విధించడం వంటి అంశాలపై కీలక సూచనలు చేసింది.

వాట్సాప్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు..

డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది. వాట్సాప్, ఇతర డిజిటల్ వేదికలు ఇటువంటి మోసాలను నివారించేందుకు ప్రతిపాదించిన చర్యల వివరాలను న్యాయస్థానానికి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కి ఒకేసారి సమర్పించాలని ఆదేశించింది. అక్టోబర్ 29న ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్‌కు సంబంధించిన డిజిటల్ అరెస్టు బాధితులు అనే స్వయంచాలక విచారణ కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన కూడా ఉన్నారు. తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది. వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఇప్పటికే 9,400 ఖాతాలపై చర్యలు తీసుకున్నామని, అనుమానాస్పద ఖాతాలను గుర్తించి వినియోగదారులను హెచ్చరించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

బాధితుల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించేలా నిబంధ‌న‌లు..

ఇదే విచారణలో డిజిటల్ అరెస్టు మోసాలు, ఇతర సైబర్ నేరాల వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్థిక సంస్థలు పరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను ఆదేశించింది. బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల చరిత్రను పరిశీలించి, సాధారణ లావాదేవీలకు భిన్నంగా భారీ మొత్తంలో నగదు బదిలీ చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్రమత్తం కావాలని సూచించింది. అనుమానాస్పద లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయడం, సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడం, అనంతరం సంబంధిత ఖాతాదారులను ప్రత్యక్షంగా సంప్రదించి లావాదేవీల నిజానిజాలను నిర్ధారించడం వంటి చర్యలను ప్రతిపాదించింది. బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలితే, బాధితులు కోల్పోయిన మొత్తానికి తక్కువ కాకుండా పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది.

అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు..

దేశంలో సైబర్ నేరాలు 50 శాతం తగ్గినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బాధితులు రూ.800 కోట్లను కోల్పోయారని ధర్మాసనం పేర్కొంది. ఆర్బీఐ ప్రతిపాదిస్తున్న కేవైసీ సవరణ మార్గదర్శకాలు-2026ను పరిశీలించిన తర్వాతే తదుపరి నియంత్రణ ప్రక్రియకు అనుమతిస్తామని తెలిపింది. ఈ మార్గదర్శకాలను నవంబర్ 30 నాటికి ప్రకటించి, డిసెంబర్ 31 నాటికి అమల్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్టు కేసులు, వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లు, దర్యాప్తు వివరాలతోపాటు నేరాల నివారణ, గుర్తింపు, విచారణకు సంబంధించిన సూచనలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు విభాగాలను ఆదేశించింది. ఈ నివేదికలను సమన్వయ కమిటీకి అందించాలని, డీజీపీలు ఆదేశాల అమలును పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థలో అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, నివారణ చర్యలను బలోపేతం చేసేందుకు ఇప్పటికే గణనీయమైన కృషి జరుగుతోందని తెలిపారు. ఆర్బీఐ తదుపరి విచారణ నాటికి అన్ని అధీకృత ఆర్థిక సంస్థల జాబితాను కూడా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement