త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whatsapp Chats Backup | వాట్సాప్‌లో చాట్‌ల‌ను ఎన్‌క్రిప్ష‌న్‌తో స‌హా బ్యాక‌ప్ తీసుకోవాలంటే.. ఇలా చేయండి..

Whatsapp Chats Backup | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ లో యూజ‌ర్ల చాట్‌ల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు గాను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఫీచ‌ర్‌ను ఆ సంస్థ అందిస్తున్న విష‌యం తెలిసిందే. 2016లో దీన్ని వాట్సాప్ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టింది.

S

Technology | Published On Apr 5, 2026, 5.12 pm IST

Whatsapp Chats Backup | వాట్సాప్‌లో చాట్‌ల‌ను ఎన్‌క్రిప్ష‌న్‌తో స‌హా బ్యాక‌ప్ తీసుకోవాలంటే.. ఇలా చేయండి..
Advertisement

Whatsapp Chats Backup | ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ లో యూజ‌ర్ల చాట్‌ల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు గాను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఫీచ‌ర్‌ను ఆ సంస్థ అందిస్తున్న విష‌యం తెలిసిందే. 2016లో దీన్ని వాట్సాప్ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టింది. యూజ‌ర్ల సంభాష‌ణ‌ల‌కు మ‌రింత ర‌క్ష‌ణ‌ను క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని వాట్సాప్ అప్ప‌ట్లో తెలిపింది. అయితే వాట్సాప్ త‌రువాత ఇత‌ర మెసేజింగ్ యాప్‌లు కూడా ఇదే ఫీచ‌ర్‌ను అందించ‌డం మొద‌లు పెట్టాయి, సిగ్న‌ల్ వంటి ప్లాట్‌ఫామ్‌ల‌లోనూ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ ఫీచ‌ర్‌ను ప్రవేశ‌పెట్టిన స‌మ‌యంలో మెటా స్పందిస్తూ యూజ‌ర్ల చాట్‌ల‌ను తాము కూడా యాక్సెస్ చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. అంత‌టి ప‌క‌డ్బందీగా సెక్యూరిటీ ఉంటుంద‌ని తెలిపింది. ప్ర‌తి డివైస్‌కు ఓ ఎన్‌క్రిప్ష‌న్ కీ ఉంటుంద‌ని, అందువ‌ల్ల యూజ‌ర్ల సంభాష‌ణ‌ల‌ను ఇత‌రులు యాక్సెస్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని తెలిపింది. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ఫీచ‌ర్ రియ‌ల్‌టైమ్‌లో ల‌భిస్తుంది. అందువ‌ల్ల యూజ‌ర్ల చాట్‌ల‌కు రియల్‌టైమ్‌లో ప్రొటెక్ష‌న్ ఉంటుంది. అయితే ఈ చాట్‌ల‌ను ఎన్‌క్రిప్ష‌న్‌తోనే బ్యాక‌ప్ తీసుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ విష‌యం చాలా మంది యూజ‌ర్ల‌కు తెలియ‌దు.

మెసేజ్ లు 64 అంకెల కీ తో ఎన్‌క్రిప్ష‌న్‌..

వాట్సాప్‌లో చాట్‌ల‌ను ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ తో బ్యాక‌ప్ తీసుకోవాలంటే అందుకు పాస్‌కీలు ఎంతో స‌హాయం చేస్తాయి. సాధార‌ణంగా వాట్సాప్‌లో యూజ‌ర్లు మెసేజ్‌ల‌ను పంపిన‌ప్పుడు అవి కోడ్ రూపంలోకి మారుతాయి. త‌రువాత ఆ మెసేజ్‌ల‌ను రిసీవ్ చేసుకునే వారి డివైస్‌ల‌లో ఉండే 64 అంకెల ఎన్‌క్రిప్ష‌న్ కీ ద్వారా మళ్లీ ఆ మెసేజ్‌లు సాధార‌ణ భాష‌గా మారుతాయి. ఇక స‌ద‌రు కీ మెసేజ్‌ల‌ను పంపించే డివైస్‌లోనూ ఉంటుంది. దీంతో పంపిన వారు, స్వీక‌ర్త‌ల మ‌ధ్య ఒక సుర‌క్షిత‌మైన క‌నెక్ష‌న్ క్రియేట్ అవుతుంది. ఈ క్ర‌మంలో వారు పంపించుకునే సందేశాలు త‌మ డివైస్‌ల‌లో మాత్ర‌మే డీక్రిప్ట్ (అన్ లాక్‌) అవుతాయి. ఇలా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల సందేశాల‌ను పంపించేవారు, స్వీక‌రించే వారు త‌ప్ప ఇత‌రులు ఆ వాటిని యాక్సెస్ చేయ‌లేరు.

కోడ్ రూపంలో ద‌ర్శ‌న‌మిస్తాయి..

అయితే యూజ‌ర్లు వాట్సాప్‌లో పంపించుకునే సందేశాల‌ను ఇత‌రులు యాక్సెస్ చేసినా వారికి అవి కోడ్ రూపంలో అర్థం లేని అక్ష‌రాల‌తో క‌నిపిస్తాయి. అందువ‌ల్ల చాట్‌ల‌కు సెక్యూరిటీ ఉంటుంది. అయితే చాట్‌ల‌ను బ్యాక‌ప్ తీసుకునే స‌మ‌యంలో వాడే పాస్‌కీల ద్వారా ఆ చాట్‌ల‌కు సెక్యూరిటీ ఇంకాస్త పెరుగుతుంది. మ‌రో లేయ‌ర్‌గా ఆ సెక్యూరిటీ ప‌నిచేస్తుంది. ఇక ఆ పాస్‌కీలు యూజ‌ర్ ధ్రువీక‌ర‌ణ‌తో ప‌నిచేస్తాయి. యూజ‌ర్ సెట్ చేసుకునే పాస్ వ‌ర్డ్‌, స్క్రీన్ లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ ద్వారా పాస్‌కీలు ఆథెంటికేష‌న్‌ను పూర్తి చేస్తాయి. ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ తో వాట్సాప్ ను బ్యాక‌ప్ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఇవి చాట్‌ల‌కు మ‌రింత సెక్యూరిటీని క‌ల్పిస్తుంది. హ్యాక‌ర్లు సైతం ఆ చాట్‌ల‌ను చ‌ద‌వ‌కుండా అడ్డుకోవ‌చ్చు. బ్యాక‌ప్ చేసిన మెసేజ్‌లు కూడా ఎన్‌క్రిప్ష‌న్ రూపంలోనే ఉంటాయి. అందువ‌ల్ల ఇత‌రులు ఆ చాట్‌ల‌ను ఓపెన్ చేయ‌లేరు.

ఆండ్రాయిడ్‌లో బ్యాక‌ప్ ఇలా..

వాట్సాప్‌లో పాస్‌కీల‌ను, ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ను ఉప‌యోగించి తీసుకునే బ్యాక‌ప్‌లు పాత చాట్‌ల‌ను స్టోర్ చేయ‌డానికి స‌హాయం చేస్తాయి. ఫోన్ పోయినా లేదా కొత్త ఫోన్ కొనుగోలు చేసినా పాత చాట్‌ల‌ను సుల‌భంగా రీస్టోర్ చేసుకోవ‌చ్చు. అయితే డివైస్‌కు రిమోట్ యాక్సెస్ ఫీచ‌ర్‌ను ఆన్ చేస్తే మాత్రం ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ప‌నిచేయ‌దు. అందువ‌ల్ల ఈ ఒక్క విష‌యాన్ని యూజ‌ర్లు గ‌మ‌నించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో పాస్‌కీ ల‌ను ఉప‌యోగించి వాట్సాప్ చాట్‌ల‌ను బ్యాక‌ప్ తీయాలంటే ముందుగా ఫోన్ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వెర్ష‌న్‌ను చెక్ చేయండి. ఆండ్రాయిడ్ ఓఎస్ 9.0 లేదా అంత‌క‌న్నా పైన వెర్ష‌న్‌లోనే బ్యాక‌ప్ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. ఫోన్‌ను అన్‌లాక్ చేసి వాట్సాప్‌ను ఓపెన్ చేశాక అందులో Settings > Chats > Chat Backup అనే ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి. అక్క‌డ End-to-end encrypted backup అనే ఆప్ష‌న్‌పై ట్యాప్ చేసి ఓపెన్ చేయాలి. త‌రువాత Turn on ను ఎంచుకుని పాస్‌కీ ని క్రియేట్ చేయాలి. స్క్రీన్‌పై క‌నిపించే సూచ‌న‌ల‌ను ఫాలో అవ్వాలి. దీంతో వాట్సాప్ చాట్‌లు ఎన్‌క్రిప్ష‌న్‌తో బ్యాక‌ప్ అవుతాయి. అవ‌స‌రం అయితే 64 అంకెల ఎన్‌క్రిప్ష‌న్ కీ ని కూడా వాడ‌వ‌చ్చు.

ఐఫోన్‌ల‌లో ఇలా చేయాలి..

ఇక ఐఫోన్ యూజ‌ర్లు ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించాలంటే ఐఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వెర్ష‌న్ ఐఓఎస్ 16 లేదా ఆపైన ఓఎస్‌ను క‌లిగి ఉండాలి. ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేశాక అందులో ప్రొఫైల్ పేజ్‌ను ఓపెన్ చేసి దాంట్లో Settings > Chats > Chat Backup లోకి వెళ్లాలి. అక్క‌డ ఉండే Back up now ను ఎంచుకోవాలి. త‌రువాత End-to-end encrypted backup ను ఆన్ చేయాలి. అనంత‌రం పాస్ కీ ని క్రియేట్ చేసి తెర‌పై క‌నిపించే సూచ‌న‌ల‌ను పాటించాలి. అయితే ఏ డివైస్‌లో అయినా స‌రే ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించి క్రియేట్ చేసే పాస్ కీలు డివైస్‌లో భ‌ద్రంగా ఉంటాయి. కానీ అవి చోరీకి గురి కాకుండా చూసుకోవాలి. ఫోన్‌ను ఎవ‌రికి ప‌డితే వారికి ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిది.

Advertisement
Advertisement