త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

On-Device AI | ఫోన్ కొనేముందు తప్పక తెలుసుకోండి.. ఆన్ డివైస్ ఏఐ అంటే ఏమిటి ?

On-Device AI | స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అతిపెద్ద ఆకర్షణగా మారుతోంది. ఫొటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్, కాల్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లను కంపెనీలు ప్రధానంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఫోన్ల‌లో చాలా సేవలు క్లౌడ్ ఆధారంగా పనిచేసేవి.

S

Technology | Published On Jul 31, 2026, 12.08 pm IST

On-Device AI | ఫోన్ కొనేముందు తప్పక తెలుసుకోండి.. ఆన్ డివైస్ ఏఐ అంటే ఏమిటి ?
Advertisement

On-Device AI | స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అతిపెద్ద ఆకర్షణగా మారుతోంది. ఫొటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్, కాల్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లను కంపెనీలు ప్రధానంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఫోన్ల‌లో చాలా సేవలు క్లౌడ్ ఆధారంగా పనిచేసేవి. అయితే ఇప్పుడు చాలా వ‌ర‌కు ఏఐ ఫీచర్ల‌ను నేరుగా ఫోన్‌లోనే పనిచేసేలా అందిస్తున్నారు. ఈ మార్పుతో స్మార్ట్‌ఫోన్లు మరింత వేగంగా, గోప్యతతోపాటు ఇంటర్నెట్ లేకున్నా అనేక ఏఐ పనులను నిర్వహించే సామర్థ్యాన్ని పొందుతున్నాయి. దీంతో ప్ర‌స్తుతం కంపెనీలు ఫోన్ల‌లోనే ఆన్ డివైస్ ఏఐ ఫీచ‌ర్‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే అసలు ఆన్ డివైస్ ఏఐ అంటే ఏమిటి ? అది ఎలా పనిచేస్తుంది ? కొత్త ఫోన్ కొనుగోలు సమయంలో అది ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఆన్ డివైస్ ఏఐ అంటే..

మీరు ఇటీవల విడుదలైన ఏదైనా స్మార్ట్‌ఫోన్‌లో మ్యాజిక్ ఎరేజర్, లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్ లేదా ఏఐ ఆధారిత ఫొటో ఎడిటింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించి ఉంటే, తెలియకుండానే ఇప్పటికే ఆన్ డివైస్ ఏఐని ఉప‌యోగించి ఉండే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఆన్ డివైస్ ఏఐ అంటే.. మీరు పంపే ఏఐ రిక్వెస్ఠ్‌లు క్లౌడ్ స‌ర్వ‌ర్‌కు వెళ్ల‌వు. మీ ఫోన్‌లోనే ప్రాసెస్ అవుతాయి. దీంతో ప‌ని వేగంగా పూర్త‌వుతుంది. దీన్నే ఆన్ డివైస్ ఏఐ అంటారు. అంటే ప్రతి సారి ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా మీ ఫోన్ అనేక ఏఐ పనులను స్వయంగా నిర్వహిస్తుంది. ఇది సాధ్యమవడానికి ఆధునిక స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌లలో ప్రత్యేకంగా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ) ఉంటుంది. సాధారణ కంప్యూటింగ్ పనులను సీపీయూ నిర్వహిస్తే, గ్రాఫిక్స్ పనులను జీపీయూ చూసుకుంటుంది. కానీ ఏఐ పనులను వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన భాగమే ఎన్‌పీయూ. ఇది ఫొటోలలో వస్తువులను గుర్తించడం, వాయిస్‌ను అర్థం చేసుకోవడం, భాషలను అనువదించడం, టెక్స్ట్‌ను సమ్మరీ చేయడం వంటి పనులను తక్కువ విద్యుత్ వినియోగంతో వేగంగా పూర్తి చేస్తుంది.

క్లిష్ట‌మైన టాస్క్‌లు క్లౌడ్‌లోనే..

అయితే ప్రతి ఏఐ ఫీచర్ పూర్తిగా ఫోన్‌లోనే పనిచేస్తుందని కాదు. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్లు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. సాధారణ పనులు ఫోన్‌లోనే పూర్తవుతాయి. కానీ క్లిష్టమైన ఫొటోల జ‌న‌రేష‌న్ లేదా సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులు క్లౌడ్ ఆధారిత ఏఐ మోడళ్ల ద్వారా పూర్త‌వుతాయి. వినియోగదారులకు పెద్దగా తెలియకపోయినా స్మార్ట్‌ఫోన్ పనితీరును ఆన్ డివైస్ ఏఐ అద్భుతంగా మారుస్తుంది. అనేక ఏఐ పనులు ఫోన్‌లోనే పూర్తవడం వల్ల లైవ్ ట్రాన్స్‌లేషన్, వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, ఏఐ ఫొటో ఎడిటింగ్ వంటి ఫీచర్లు దాదాపు వెంటనే పూర్త‌వుతాయి. డేటా సర్వర్‌కు వెళ్లి తిరిగి రావడానికి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. గోప్యత కూడా దీని ప్రధాన ప్రయోజనం. ఏఐ ఫీచర్లు ఫొటోలు, సందేశాలు, వాయిస్ రికార్డింగ్‌లు వంటి వ్యక్తిగత సమాచారంతో పనిచేస్తాయి. ఈ సమాచారాన్ని ఫోన్‌లోనే ప్రాసెస్ చేయడం వల్ల బయటి సర్వర్‌లకు పంపాల్సిన డేటా పరిమాణం తగ్గుతుంది.

ఇంటర్నెట్ లేకున్నా..

అలాగే ఇంటర్నెట్ లేకున్నా అనేక ఫీచర్లు పనిచేస్తాయి. ప్రయాణ సమయంలో లేదా నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్‌లేషన్, ట్రాన్స్‌క్రిప్షన్, కొన్ని ఎడిటింగ్ టూల్స్ ను వినియోగించుకోవచ్చు. ఇక రోజువారీ స్మార్ట్‌ఫోన్ అనుభవంలో కూడా ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఫొటో తీసే ముందు కెమెరా సన్నివేశాలను గుర్తించడం, కాల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించడం, ఫొటో లైబ్రరీని క్రమబద్ధీకరించడం, సందేశాలకు సమాధానాలు సూచించడం, ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ గుర్తింపు వంటి భద్రతా ఫీచర్లను మరింత మెరుగుపరచడం వంటి పనులన్నీ ఏఐ సహాయంతోనే పూర్త‌వుతాయి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు సమయంలో చాలామంది కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రాసెసర్‌లను మాత్రమే పోల్చుకుంటారు. అయితే ఇప్పుడు ఆన్ డివైస్ ఏఐ సామర్థ్యం కూడా అంతే ముఖ్యంగా మారుతోంది. ఎందుకంటే ఆధునిక ఫీచర్లు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో అది నిర్ణయిస్తుంది.

ఆన్ డివైస్ ఏఐ కెపాసిటీని కూడా చూడాలి..

శక్తివంతమైన ఏఐ ఇంజిన్ ఉంటే తక్కువ వెలుతురులో మంచి ఫొటోలు తీయడం, వాయిస్ అసిస్టెంట్ వేగంగా స్పందించడం, నోట్స్ లేదా కాల్స్‌ను సమ్మరీ చేయడం, ఫొటోలలో అవసరం లేని వస్తువులను తొలగించడం, మెరుగైన రైటింగ్, ఎడిటింగ్ టూల్స్ అందించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా వచ్చే కొత్త ఏఐ ఫీచర్లను కూడా మెరుగ్గా వినియోగించుకోవచ్చు. అయితే అన్ని ఏఐ ఫోన్లు ఒకేలా ఉండవు. రెండు ఫోన్లలో ఒకే రకమైన ఏఐ ఫీచర్లు ఉన్నట్లు ప్రచారం చేసినా, వాటి ప్రాసెసర్, మెమరీ, ప్రత్యేక ఏఐ హార్డ్‌వేర్ ఆధారంగా పనితీరు మారుతుంది. ఫీచర్లు ఎంత వేగంగా పనిచేస్తాయి, ఎంత క‌చ్చితంగా ఉంటాయి, ఫోన్‌లోనే నడుస్తాయా లేక క్లౌడ్‌పై ఆధారపడతాయా అనే విషయాల్లో తేడాలు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఏఐని మరిన్ని ఫీచర్లలో భాగం చేస్తుండటంతో, ఆన్ డివైస్ ఏఐ ఇప్పుడు ప్రీమియం ఫీచర్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఫోన్ ఎంతకాలం ఉపయోగకరంగా ఉంటుందో నిర్ణయించే కీలక అంశంగా మారుతోంది. కెమెరా, బ్యాటరీ, పనితీరుతోపాటు ఆన్ డివైస్ ఏఐ కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంపికలో ప్రధాన ప్రమాణంగా నిలవనుంది.

Advertisement
Advertisement