త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..

Anthropic | అమెరికాకు చెందిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన మైథోస్ 5 ఏఐ మోడల్‌కు అమెరికా ప్రభుత్వం పరిమిత స్థాయిలో మళ్లీ అనుమతి ఇచ్చింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను సంస్థ పరిష్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

S

Technology | Published On Jun 27, 2026, 12.40 pm IST

Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..
Advertisement

Anthropic | అమెరికాకు చెందిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన మైథోస్ 5 ఏఐ మోడల్‌కు అమెరికా ప్రభుత్వం పరిమిత స్థాయిలో మళ్లీ అనుమతి ఇచ్చింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను సంస్థ పరిష్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హొవార్డ్ లుట్నిక్ ఆంథ్రోపిక్ చీఫ్ కంప్యూట్ ఆఫీసర్‌కు పంపిన లేఖలో కవర్డ్ మోడల్స్‌కు సంబంధించిన ప్రమాదాలను తగ్గించేందుకు సంస్థ అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసింద‌ని, ఈ ప్రయత్నాల వల్ల గణనీయమైన పురోగతి సాధించింద‌ని, అందువల్ల మైథోస్ 5 మోడల్‌ను కొంతమంది విశ్వసనీయ భాగస్వాములకు మళ్లీ అందుబాటులోకి తీసుకురావచ్చ‌ని పేర్కొన్నారు. రెండు వారాల క్రితం అమెరికా ప్రభుత్వం అకస్మాత్తుగా విదేశీ పౌరులు మైథోస్ 5, ఫేబుల్ 5 మోడళ్లను ఉపయోగించకుండా నిషేధించింది. ఈ మోడళ్లలో ఉన్న భద్రతా పరిమితులను (గార్డ్‌రైల్స్) దాటవేయడం సాధ్యమవుతుందనే అనుమానాలతో ఈ ఆంక్షలు విధించింది. దీంతో ఆంథ్రోపిక్ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు మోడళ్లకు యాక్సెస్‌ను నిలిపివేసి, ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది.

ఫేబుల్ 5 కోసం సైతం చ‌ర్చ‌లు..

అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి బెన్నో కాస్ మాట్లాడుతూ కేవలం రెండు వారాల్లోనే అమెరికా ఏఐ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని కొనసాగిస్తూ జాతీయ భద్రతను కాపాడే దిశగా కీలక పురోగతి సాధించింద‌ని తెలిపారు. కాగా ఫేబుల్ 5 మోడల్‌పై ఉన్న పరిమితుల్లో ఎలాంటి మార్పు చేసినట్లు ప్రస్తావించలేదు. అయితే ఇదే విష‌యంపై అటు ఆంథ్రోపిక్ కూడా ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. మైథోస్ 5 త‌మ‌ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ మోడల్ అని, అమెరికా ప్రభుత్వం నుంచి పరిమిత సంఖ్యలోని సైబర్ రక్షణ సంస్థలు, మౌలిక సదుపాయాల సంస్థలకు దీన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం అందింద‌ని తెలిపింది. అనుమతి పొందిన సంస్థలకు వీలైనంత త్వరగా యాక్సెస్ ను పునరుద్ధరించే పనిలో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది. మైథోస్ 5 వినియోగాన్ని మరింత విస్తరించడంతోపాటు ఫేబుల్ 5ను కూడా సాధారణ వినియోగానికి మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నామ‌ని పేర్కొంది.

ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టారు..?

కాగా ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలను నివారించేందుకు ఆంథ్రోపిక్ ఎలాంటి సాంకేతిక చర్యలు తీసుకుందో వెల్లడించలేదు. అయితే వారాంతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు కొనసాగనున్నాయని, త్వరలోనే ఫేబుల్ 5ను కూడా పునరుద్ధరించాలని సంస్థ భావిస్తున్నట్లు ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్పష్టమైన విధాన రూపకల్పనపై కూడా ఆంథ్రోపిక్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. మోడళ్లపై ఎగుమతి నియంత్రణలు విధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంథ్రోపిక్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి ప్రమాణాలను మొత్తం పరిశ్రమపై అమలు చేస్తే, అత్యాధునిక ఏఐ మోడళ్ల విడుదల పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వస్తుంద‌ని సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే ఏ సంస్థకైనా పూర్తిస్థాయి జైల్‌బ్రేక్ నిరోధకత ప్రస్తుతం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఓపెన్ ఏఐ పైనా ప్ర‌భావం..

ఆంథ్రోపిక్‌పై తీసుకున్న చర్యల ప్రభావం ఇతర ఏఐ సంస్థలపై కూడా పడింది. ముఖ్యంగా ఓపెన్ఏఐ తన కొత్త జీపీటీ 5.6 మోడల్‌ను పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా, అమెరికా ప్రభుత్వ సూచనల మేరకు ముందుగా ఎంపిక చేసిన భాగస్వాములకు మాత్రమే ప్రివ్యూ రూపంలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం దశలవారీగా మరింత విస్తృతంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement