త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసిన‌వో ప్ర‌జ‌ల‌కు చెప్పు

Harish Rao | తుంగ‌భ‌ద్ర గేట్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి చారిత్ర‌క ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రమ‌ని.. ఆ చారిత్ర‌క ఒప్పందం ఏంట‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఆ సమావేశంలో ఏ మాట్లాడారో సీఎం రేవంత్ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉందన్నారు.

S

Telangana | Published On Jun 27, 2026, 2.09 pm IST

Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసిన‌వో ప్ర‌జ‌ల‌కు చెప్పు
Advertisement
  • ఉత్త‌మ్‌కుమార్‌ను బ‌య‌ట‌నే ఎందుకు కూసుండ‌వెట్టిన‌వ్‌
  • క‌ర్ణాట‌క ప్రాజెక్టులు క‌డుతుంటే ఎందుకు నోరు మూసుకున్న‌వ్‌
  • పైగా ప్రాజెక్టులు అడ్డుకోవ‌ద్ద‌ని తెలంగాణ‌కు ఆ రాష్ట్రం లేఖ రాసింది
  • రేవంత్‌కు అవ‌గాహ‌న త‌క్కువ‌.. ఆగం ఎక్కువ‌
  • సీఆర్ పాటిల్ ద‌గ్గ‌ర ఏం హామీ తీసుకున్న‌వో వెల్ల‌డించు
  • మూడు రాష్ట్రాల మ‌ధ్య ఏం ఒప్పందం జ‌రిగిందో చెప్పు
  • మీడియా స‌మావేశంలో హ‌రీశ్‌రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తుంగ‌భ‌ద్ర గేట్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి చారిత్ర‌క ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రమ‌ని.. ఆ చారిత్ర‌క ఒప్పందం ఏంట‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఆ సమావేశంలో ఏ మాట్లాడారో సీఎం రేవంత్ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర విఘాతం క‌లిగించే విధంగా క‌ర్ణాట‌క రాష్ట్రం తుంగ‌భ‌ద్ర దిగువన ఆర్డీఎస్ ఎగువ‌న 35 టీఎంసీల వినియోగంతో న‌వేలీ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి క‌ర్ణాట‌క పూనుకున్న‌ది. ఇంకోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్డీఎస్ దిగువ‌న సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామ‌ర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మాణం చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ రేవంత్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఈ ప్రాజెక్టుల విష‌యంలో ఆనాడు బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ ముందు కూడా వాద‌నలు జ‌రిగిన‌యి. 2013లో ట్రిబ్యున‌ల్ తీర్పు ఇచ్చింది. కొత్త‌ది క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. సిల్టేష‌న్ ఏద‌న్నా ఉంటే మీరు ప్ర‌త్యామ్నాయం ఆలోచించుకోవాల‌ని త‌ప్పా గుండ్రేవుల‌కు నీటి కేటాయింపులు చేయ‌మ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. మేం తీవ్రంగా నిర‌స‌న తెలిపితే అది కోల్డ్ స్టోరేజ్‌లోకి పోయింది. కానీ త‌మ అనునాయుడే తెలంగాణ‌లో సీఎంగా ఉన్న‌డ‌ని చెప్పి గుండ్రెవుల‌ను మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చారు. ట్రిబ్యున‌ల్ వ‌ద్ద‌న్న‌ది.. తొమ్మిదిన్న‌రేండ్లు బీఆర్ఎస్ ఆపింది. అయినా మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చారు. తుంగ‌భ‌ద్ర మీద 55 టీఎంసీలతో వ‌చ్చే ఈ రెండు రిజ‌ర్వాయ‌ర్లు రేపు తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం చేస్త‌య్‌. శ్రీ‌శైలం మీద ఆధార‌ప‌డ్డ కల్వ‌కుర్తిగాని, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం మీద కూడా తీవ్ర‌మైన ప్ర‌భావం చూపిస్తది.

నీకు ఆగ‌మాగం ఎక్కువ‌..

ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిని, ఆఫీస‌ర్ల‌ను బ‌య‌ట‌నే కూసోబెట్టినం లోప‌ల ముగ్గురు సీఎంలం, కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శి కాంతారావు కూసున్నం అని సీఎం చెప్పిండు. ఏపీతో అనుబంధం ఉన్న వ్యక్తి కాంతారావు. మీరు చేసిన ర‌హ‌స్య ఒప్పందం ఏంది. నీకు అవ‌గాహ‌న త‌క్కువ‌. ఆగ‌మాగం ఎక్కువ. గ‌తంలో దేవాదుల ఏ బేసిన్‌లో ఉంది.. న‌ల్ల‌మ‌ల ఏపీల ఉంట‌దా.. తెలంగాణ‌ల ఉంట‌దా? బ‌చావ‌త్‌కు బ్రిజేశ్‌కు తేడా తెల్వ‌ని విధంగా ఎన్నిసార్లు మాట్లాడిన‌వో తెలుసు. మూడు రాష్ట్రాల మ‌ధ్య ఏం ఒప్పందం జ‌రిగిందో చెప్పు. మ‌న‌ ఆర్డీఎస్‌కు 15.9 టీఎంసీల నీళ్లు రావాలి. వ‌స్త‌లేవు. ఆనాడు కేసీఆర్ తుమ్మిళ్ల‌కు లిఫ్ట్ పెట్టి క‌నీసం 50 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌చ్చేలా చేశారు. మొన్న‌టి మీటింగుల 15.9 టీఎంసీల నీళ్లు రావాల‌ని స్ప‌ష్ట‌మైన హామీ తీసుకున్న‌వా? ఏం మాట్లాడిన‌వో చెప్పు అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

తుంగ‌భ‌ద్ర‌పై కురిడి అనే 2 టీఎంసీల ప్రాజెక్టును క‌ర్ణాట‌క క‌డుతుంది. చిక్కాల పరివి అని రెండున్న‌ర టీఎంసీల బ్రిడ్జ్ కం బ్యారేజ్ క‌డుతుంది. చిక్కాల మంచి అని 5 టీఎంసీల బ్రిడ్జ్ కం బ్యారేజ్ క‌డుతున్న‌రు. ఈ మూడు ప్రాజెక్టులు క‌డితే తెలంగాణకు న‌ష్టం జ‌రుగుత‌ద‌ని నువ్ ఏమ‌న్నా చెప్పిన‌వా? మీరు సీఆర్ పాటిల్ నుంచి ఏం హామీ తీసుకున్నారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పండి.

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ఒక లెట‌ర్ రాసింది. నువ్ క‌ర్ణాట‌క‌తో కుమ్మ‌క్క‌యినవ్‌. తుంగ‌భ‌ద్ర మీద రెండు బ్యారేజ్‌లు క‌ట్టుకుంటున్నం. వీటికి మీరు అడ్డంకులు చెప్పొద్దు. వీటిని కేంద్రం దృష్టికి తీసుకుపోవ‌ద్దు అని క‌ర్ణాట‌క అడిష‌న‌ల్ చీఫ్ సెక్రెట‌రీ మ‌న తెలంగాణ ఇరిగేష‌న్ సెక్రెట‌రీకి లేఖ రాశారు. దీనికి మీరు ఏం స‌మాధానం చెప్పారు.

ప్రాజెక్టులు మొద‌లుపెట్టి సంవ‌త్స‌రం అయింది. కురిడి అయితే స‌గం ప‌ని అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఏం మాట్లాడ‌లే. ఎట్ల క‌డుత‌ర‌ని కేఆర్ఎంబీకి గానీ, క‌ర్ణాట‌క‌కు గానీ, కేంద్రానికి గానీ లేఖ రాయ‌లే. మీరెందుకు సైలెంట్‌గా ఉన్న‌రు. ఎందుకు స‌డి స‌ప్పుడు లేకుండా ఉన్న‌రు. ప్ర‌జ‌ల ప‌క్షాన మేం అడుగుతున్నం. నీళ్ల మంత్రినే బ‌య‌ట ఎందుకు కూసోవెట్టిర్రు. ఇంజినీర్ల‌ను లోప‌లికి ఎందుకు రానియ్య‌లే. తెలంగాణ నీటి హ‌క్కుల‌ను కాల‌రాస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. చుక్క నీరు త‌గ్గినా, నువ్ ఎక్క‌డ కాంప్ర‌మైస్ అయినా బీఆర్ఎస్ దానికి అంగీక‌రించ‌దు. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల‌తో దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీయొద్ద‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నం.

సీఎం రేవంత్ ఇయ్యాళ‌ నాలుగు వేర్వేరు అంశాల‌ను క‌లిపి మాట్లాడుతున్న‌డు. గోదావ‌రిలో తెలంగాణ‌కు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్న‌య్‌. 830 టీఎంసీల‌కు మ‌న‌కు టెక్నిక‌ల్ అడ్వైజ‌రి క్లియ‌రెన్స్ ఉన్న‌య్‌. ఇంకా 138 టీఎంసీల‌కు అనుమ‌తులు రావాల్సి ఉంది.
ఇవి తొంద‌ర‌గా తెచ్చుకోవాలి.

60 ఏండ్లు కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు తెలంగాణ‌ను పాలించాయి. ఈ 60 ఏండ్ల‌లో 265 టీఎంసీల‌కే మ‌న‌కు అనుమ‌తులు వ‌చ్చాయి. తొమ్మిదిన్న‌ర ఏండ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 383 టీఎంసీలకు అనుమ‌తులు తీసుకొచ్చింది. ప్ర‌తి సంవ‌త్సరం మీరు 4 మేం 40 టీఎంసీలకు అనుమ‌తులు తెచ్చినం. మ‌ళ్లీ మీరుచ్చి రెండేండ్ల ఏడు నెల‌లు అయింది. ఏమ‌న్నా తెచ్చిండ్రా. మేమున్న‌ప్పుడు కూడా ఇంట‌ర్‌లింకింగ్ స‌బ్జెక్టు న‌డుస్తూ వ‌చ్చింది. అనుమ‌త‌లు తేకుండ‌నే మీరు ఇంట‌ర్‌లింకింగ్ మీద ఎందుకు ముందుకు పోతున్న‌రు. స‌మ్మ‌క్క సాగ‌ర్ 47 టీఎంసీలు, వార్ధా 20 టీఎంసీలు, ఎల్లంప‌ల్లి 30 టీఎంసీలకు డీపీఆర్‌లు ఢిల్లీలో ఇచ్చినం. వాటికి క్లియ‌రెన్స్‌లు రాకుండా వాప‌స్ వ‌స్తున్న‌యి. మీరు ప‌ట్టించుకుంట‌లేరు.

అన్ని అనుమ‌తులు ఇచ్చాకే ఇంట‌ర్‌లింకింగ్ చేప‌ట్టాలి..

968 టీఎంసీల‌కు మొత్తం అన్ని అనుమ‌తులు ఇచ్చాకే ఇంట‌ర్‌లింకింగ్ చేప‌ట్టాలి. ఆ ఇంట‌ర్‌లింకింగ్ తెలంగాణ గుండ‌నే వెళ్లాలి. స‌మ్మ‌క్క సాగ‌ర్ నుంచి నాగార్జున సాగ‌ర్ వెళ్లాలి. 147 టీఎంసీల్లో స‌గం నీళ్లు మాకు ఇయ్యాలే. ఇవ‌న్నీ రికార్డుల‌ల్ల ఉన్న‌య్‌. వంద‌ల మీటింగుల్లో వంద‌ల‌సార్లు చెప్పినం. ఆనాడే నేనే నీళ్ల మంత్రిగా ఉన్నా. ఈరోజు రేవంత్ 968 గురించి ఆలోచ‌న చేస్త‌లేరు. పూర్తి హ‌క్కులు సాధించ‌కుండ‌నే గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల ఇంట‌ర్‌లింకింగ్‌కు ముందుకు పోతున్న‌డు. తెలుగుగంగ చెన్నైకి పోతున్న‌ది. మ‌ధ్య‌లో రాయ‌ల‌సీమ వాళ్లే స‌గం నీళ్లు గుంజుకుంట‌రు. ఇప్పుడు కూడా ఇంట‌ర్‌లింకింగ్ మ‌న ద‌గ్గ‌ర నుంచే ఉంటే మ‌న‌కే మొద‌టి రైట్ ఉంట‌ది. నీకు సోయి ఉందా.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న‌వ్‌.

ఏపీ 512 వాడేసుకున్న‌ది. తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రాకెళ్లే కిందికెళ్లి కిందికి నీళ్లు పోవ‌డానికే అంత‌ర్గ‌త ఒప్పందం చేసుకున్న‌వ‌ని ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్న‌యి. ఇది నిజ‌మా? తెలంగాణ‌కు స‌మాధి క‌ట్ట‌ద‌లుచుకున్న‌వా? నీ రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఒక్క ప్రాజెక్టుకు అనుమ‌తి తేలేదు. డీపీఆర్‌లు వాప‌స్ వ‌స్తున్న‌య్‌. నువ్ ఒక్క టీఎంసీకి కూడా అనుమ‌తులు తేలేదు. నీ చీక‌టి ఒప్పంద ఏందో ప్ర‌జ‌ల‌కు చెప్పు? అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement