త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Green Card Suspension | భారత ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్ షాక్: TCS, ఇన్ఫోసిస్, విప్రోలకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ రద్దు

భారత టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలకు అమెరికా ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగుల గ్రీన్ కార్డు ప్రాసెసింగ్‌ను తక్షణమే నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

J

Technology | Published On Oct 8, 2026, 10.35 pm IST

US Green Card Suspension | భారత ఐటీ కంపెనీలకు అమెరికా బిగ్ షాక్: TCS, ఇన్ఫోసిస్, విప్రోలకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ రద్దు

సంక్షిప్త సారాంశం

TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) కార్యక్రమం నుంచి అమెరికా సస్పెండ్ చేసింది. ఈ సంస్థల నుంచి కొత్త గ్రీన్ కార్డ్ దరఖాస్తులను స్వీకరించబోమని, పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా ప్రాసెస్ చేయబోమని లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని, హెచ్-1బీ నిబంధనలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన ఐటీ సంస్థలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్‌జెమినీ వంటి సంస్థల తీరుపైనా అమెరికా ఆంక్షలు విధించింది.

Advertisement
  • గ్రీన్ కార్డులపై సస్పెన్షన్
  • కొత్త దరఖాస్తులు బంద్
  • జేడీ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు
  • మైక్రోసాఫ్ట్‌పైనా ఆరోపణలు

US Green Card Suspension | త్రినేత్ర న్యూస్ : అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వత నివాసం (Green Card) పొందాలనుకుంటున్న భారతీయ టెక్ నిపుణులకు అమెరికా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే నిర్ణయం తీసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ వంటి అగ్రశ్రేణి ఐటీ సంస్థలపై అమెరికా లేబర్ విభాగం కఠిన ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు తమ విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు స్పాన్సర్ చేసే ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు (Suspend) గురువారం ప్రకటించింది.

అమెరికా లేబర్ సెక్రటరీ కీత్ సాండర్లింగ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యాంటీ-ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ విభాగం అధిపతి సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికన్ల ఉద్యోగాలను విదేశీ నిపుణులకు కట్టబెడుతున్నారన్న కారణంతో 'పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్' (PERM) నుంచి ఈ ప్రధాన ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

కొత్త దరఖాస్తులు బంద్.. పెండింగ్ ఫైల్స్ నిలిపివేత

ఈ నిర్ణయంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్‌తో పాటు క్యాప్‌జెమినీ వంటి విదేశీ కంపెనీల నుంచి భవిష్యత్తులో ఎలాంటి కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) దరఖాస్తులను స్వీకరించబోమని సాండర్లింగ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న (Pending) దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

సాండర్లింగ్ మాట్లాడుతూ.. "2009 నుంచి కేవలం ఈ కంపెనీలే దాదాపు 30 లక్షల మంది విదేశీ వర్కర్ల కోసం రిక్వెస్ట్‌లు పెట్టాయి. వీటిలో 2.3 లక్షలకు పైగా హెచ్-1బీ (H-1B) వీసాలు, లక్షకు పైగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లు పొందాయి. ఈ విధానం వల్ల స్థానిక అమెరికన్లకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు చేజారిపోయాయి" అని ఆరోపించారు.

"వీసా మిల్లులు".. జేడీ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ టెక్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్-1బీ వీసాల ద్వారా తీసుకొచ్చే విదేశీ ఉద్యోగులను "విదేశీ బానిసలు" (Foreign indentured servants) అని వ్యాఖ్యానించిన ఆయన, ఈ కంపెనీలు వ్యవస్థను అడ్డం పెట్టుకుని "వీసా మిల్లులు"గా మారాయని తీవ్రంగా దుయ్యబట్టారు.

ముఖ్యంగా ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "2025లో అర్హులైన అమెరికన్ ఉద్యోగులు దొరకడం లేదని సర్టిఫై చేసిన మైక్రోసాఫ్ట్, అదే సమయంలో 6,000 మంది స్థానిక అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. కానీ మరోవైపు 6,000 కంటే ఎక్కువ H-1B వీసాలకు అనుమతి పొంది, 3,682 'పెర్మ్' (PERM) దరఖాస్తులు దాఖలు చేసింది. తొలగించిన స్థానిక ఉద్యోగుల హోదాల్లోనే దాదాపు వెయ్యి మంది విదేశీయులను నియమించుకుంది" అని ధ్వజమెత్తారు.

భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం

అమెరికాలో ఏటా జారీ అయ్యే హెచ్-1బీ వీసాలలో అత్యధిక శాతం భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే దక్కించుకుంటారు. అయితే, భారత్ నుంచి తక్కువ ఖర్చుతో నిపుణులను రప్పించడాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే దరఖాస్తు ఫీజులను భారీగా పెంచడంతో పాటు పలు నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇప్పుడు తాజా నిర్ణయంతో గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది.

Advertisement
Advertisement