త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | అక్టోబర్‌లో జియో, ఎయిర్‌టెల్ షేర్లపై మ్యూచువల్ ఫండ్స్ భారీ పెట్టుబడులు.. బ్యాంకింగ్ షేర్ల‌కు బైబై..

Mutual Funds | అక్టోబర్ లో మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడుల వ్యూహాన్ని మార్చుకున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ వంటి షేర్లలో పెట్టుబడులు పెంచగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లను విక్రయించాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ నగదు నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి.

S

Business | Published On Nov 16, 2026, 1.32 pm IST

Mutual Funds | అక్టోబర్‌లో జియో, ఎయిర్‌టెల్ షేర్లపై మ్యూచువల్ ఫండ్స్ భారీ పెట్టుబడులు.. బ్యాంకింగ్ షేర్ల‌కు బైబై..
Advertisement

Mutual Funds | అక్టోబర్ లో మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడుల వ్యూహాన్ని మార్చుకున్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ వంటి షేర్లలో పెట్టుబడులు పెంచగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లను విక్రయించాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ నగదు నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి.

బ్యాంకింగ్ షేర్ల విక్ర‌యం..

అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ ఐటీ, టెలికాం, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లోని షేర్లపై పెట్టుబడులను పెంచినట్లు నివేదిక‌లు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ఆర్థిక సేవలు, బీమా, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, క్యాపిటల్ గూడ్స్, లోహాలు, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులను తగ్గించాయి. మార్కెట్ విలువ ఆధారంగా చూస్తే లార్జ్ క్యాప్ విభాగంలో జియో ప్లాట్‌ఫామ్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, బీఎస్‌ఈ షేర్లను అత్యధికంగా కొనుగోలు చేశాయి. మిడ్ క్యాప్ విభాగంలో ఏథర్ ఎనర్జీ, ఆదిత్య ఇన్ఫోటెక్, జైడస్ లైఫ్‌సైన్సెస్, మీషో, ధూత్‌ ట్రాన్స్‌మిషన్ షేర్లలో పెట్టుబడులను పెంచాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ డీఎల్ఎఫ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లపై ఆసక్తి చూపించాయి.

లార్జ్ క్యాప్ షేర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి..

మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ విక్రయించిన లార్జ్ క్యాప్ షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. మిడ్ క్యాప్ విభాగంలో ఎంసీఎక్స్, పేటీఎం, ఎటర్నల్, డిక్సన్ టెక్నాలజీస్, బీఎస్‌ఈ షేర్లను విక్రయించాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ సైతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్‌ల‌లో తమ వాటాలను తగ్గించుకున్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ నగదు నిల్వలు 2025 ఏప్రిల్‌లో 6.7 శాతంగా ఉండగా, ఈ అక్టోబర్ నాటికి 4.1 శాతానికి పడిపోయాయి. నగదు నిల్వల మొత్తం విలువ రూ.1.53 లక్షల కోట్లుగా నమోదైంది.

ఏఎంఎఫ్‌ఐ గణాంకాలు ఏం చెబుతున్నాయి?

భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఏఎంఎఫ్‌ఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు సెప్టెంబర్‌తో పోలిస్తే 13.9 శాతం తగ్గాయి. సెప్టెంబర్‌లో రూ.38,307 కోట్లుగా ఉన్న పెట్టుబడులు అక్టోబర్‌లో రూ.32,994 కోట్లకు చేరాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు రూ.859 కోట్ల నుంచి రూ.1,032 కోట్లకు పెరిగాయి. అయితే మిడ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు 37.5 శాతం తగ్గి రూ.4,893 కోట్లకు, స్మాల్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు 29.1 శాతం తగ్గి రూ.6,408 కోట్లకు చేరాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులు 25.7 శాతం తగ్గి రూ.4,980 కోట్లుగా నమోదయ్యాయి.

మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) సెప్టెంబర్‌లో రూ.82.64 లక్షల కోట్ల నుంచి అక్టోబర్‌లో 0.9 శాతం పెరిగి రూ.83.38 లక్షల కోట్లకు చేరింది. నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) పెట్టుబడులు సెప్టెంబర్‌లో రూ.32,490 కోట్లుగా ఉండగా, అక్టోబర్‌లో రూ.32,160 కోట్లుగా నమోదయ్యాయి. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి రూ.3,474.03 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవి సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు 22 శాతం తక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement