త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?

Nifty IT | జూలైలో జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 36 శాతం పడిపోయిన నిఫ్టీ ఐటీ సూచీ అక్టోబర్‌లో అనూహ్యంగా కోలుకుంది. సెప్టెంబర్‌లో 11 శాతం నష్టపోయిన సూచీ, అక్టోబర్‌లో ఏకంగా 17 శాతం ర్యాలీ చేసింది. అయితే ఈ పుంజుకోవడంతో ఐటీ కంపెనీల షేర్ల విలువలు పెరిగిపోయాయని, ప్రస్తుత స్థాయిల్లో మరింత లాభాలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

S

Business | Published On Nov 11, 2026, 3.08 pm IST

Nifty IT | ఐటీ షేర్లలో భారీ ర్యాలీ.. కొనాలా.. అమ్మాలా..?
Advertisement

Nifty IT | జూలైలో జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 36 శాతం పడిపోయిన నిఫ్టీ ఐటీ సూచీ అక్టోబర్‌లో అనూహ్యంగా కోలుకుంది. సెప్టెంబర్‌లో 11 శాతం నష్టపోయిన సూచీ, అక్టోబర్‌లో ఏకంగా 17 శాతం ర్యాలీ చేసింది. అయితే ఈ పుంజుకోవడంతో ఐటీ కంపెనీల షేర్ల విలువలు పెరిగిపోయాయని, ప్రస్తుత స్థాయిల్లో మరింత లాభాలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఐటీ షేర్ల‌లో భారీ రిక‌వ‌రీ..

దేశీయ ఐటీ షేర్లలో సెప్టెంబర్ కనిష్ఠ స్థాయిల నుంచి భారీ రికవరీ కనిపించింది. విప్రో అత్యధికంగా 27 శాతం లాభపడగా, టీసీఎస్ 22 శాతం, టెక్ మహీంద్రా 20 శాతం, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చెరో 16 శాతం చొప్పున పెరిగాయి. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడం, కంపెనీల యాజమాన్యాల నుంచి సానుకూల వ్యాఖ్యలు రావడం, కృత్రిమ మేధ ద్వారా ఆదాయాలు పెరగడం, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల నియామకాలు మెరుగుపడడం ఈ ర్యాలీకి మద్దతునిచ్చాయి. అయితే ఐటీ సేవలపై ఖాతాదారుల విచక్షణాధారిత వ్యయాలు గణనీయంగా పెరిగిన సంకేతాలు ఇంకా కనిపించడం లేదు. మరోవైపు షేర్ల ధరలు పెరగడంతో కంపెనీల పీఈ నిష్పత్తులు కూడా పెరిగాయి. సెప్టెంబర్‌లో 14 రెట్లుగా ఉన్న టీసీఎస్ పీఈ 16 రెట్లకు, ఇన్ఫోసిస్ పీఈ 13 నుంచి 15 రెట్లకు, హెచ్‌సీఎల్ టెక్ పీఈ 18 నుంచి 20 రెట్లకు చేరాయి. టెక్ మహీంద్రా పీఈ 27 నుంచి 31 రెట్లకు, విప్రో పీఈ 12 నుంచి 15 రెట్లకు పెరిగాయి.

పెరిగిన టార్గెట్ ధ‌ర‌లు..

బ్రోకరేజ్ సంస్థ సిటీ నాలుగు ప్రధాన ఐటీ కంపెనీలైన టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రాపై అమ్మకాల రేటింగ్‌ను కొనసాగించింది. అయితే రంగంలో వచ్చిన రీ-రేటింగ్ నేపథ్యంలో వాటి టార్గెట్ ధరలను పెంచింది. విప్రో టార్గెట్ ధరను రూ.145 నుంచి రూ.170కు, హెచ్‌సీఎల్ టెక్ ధరను రూ.1,050 నుంచి రూ.1,200కు పెంచింది. టీసీఎస్‌కు రూ.2,000, టెక్ మహీంద్రాకు రూ.1,525 టార్గెట్ ధరలను నిర్ణయించింది. అయినప్పటికీ ఈ కంపెనీల భవిష్యత్తు ఆదాయ వృద్ధిపై పరిమిత అంచనాలనే వ్యక్తం చేసింది. ఎఫ్‌వై28-29లో టీసీఎస్ వార్షిక ఈపీఎస్ వృద్ధి 2-3 శాతంగా ఉంటుంద‌ని, విప్రోలో ఎఫ్‌వై29 వరకు సుమారు 2 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్ ఈపీఎస్ వృద్ధి ఎఫ్‌వై28లో 2 శాతానికి, ఎఫ్‌వై29లో 1 శాతానికి తగ్గుతుంద‌ని అంచనా వేసింది. టెక్ మహీంద్రా వృద్ధి ఎఫ్‌వై29లో 5.1 శాతానికి పరిమితం అవుతుంద‌ని పేర్కొంది. ఇన్ఫోసిస్‌పై మాత్రం న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తూ రూ.1,105 టార్గెట్ ధరను నిర్ణయించింది. ప్రస్తుత స్థాయిల్లో ఇన్ఫోసిస్‌కు మాత్రమే 3.5 శాతం మేర సానుకూల రాబడికి అవకాశం ఉండగా, విప్రోలో 11.5 శాతం, హెచ్‌సీఎల్ టెక్‌లో 9 శాతం, టీసీఎస్‌లో 3.7 శాతం, టెక్ మహీంద్రాలో 1.5 శాతం మేర నష్టపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

స్వల్పంగా ఆదాయ వృద్ధి..

మరోవైపు క్యూ2 ఫలితాల్లో ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి స్వల్పంగా నమోదైంది. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ ఆదాయాలు త్రైమాసిక ప్రాతిపదికన 3 శాతం చొప్పున పెరిగాయి. ఇన్ఫోసిస్ 2.1 శాతం, టీసీఎస్ 1.3 శాతం, విప్రో 1.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కృత్రిమ మేధ ఆధారిత సేవలు కంపెనీల ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీసీఎస్ వార్షికీకరించిన ఏఐ ఆదాయం 3.1 బిలియన్ డాలర్లను దాటిందని, మొత్తం ఆదాయంలో ఇది 10 శాతానికి పైగా ఉందని వెల్లడించింది. హెచ్‌సీఎల్ టెక్ అధునాతన ఏఐ ఆదాయం స్థిర కరెన్సీ ప్రాతిపదికన త్రైమాసికంలో 28.4 శాతం పెరిగి 219 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాను 1.5-3 శాతం నుంచి 1-2 శాతానికి తగ్గించింది. విప్రో కూడా క్యూ3 ఐటీ సేవల ఆదాయం 1.5 శాతం క్షీణత నుంచి 0.5 శాతం వృద్ధి మధ్య ఉంటుంద‌ని అంచనా వేసింది. ఐటీ షేర్లలో ర్యాలీ కనిపిస్తున్నప్పటికీ, వాస్తవ డిమాండ్ పుంజుకోవడం, ఆదాయ వృద్ధి మెరుగుపడడం ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. అందువల్ల తదుపరి ర్యాలీకి కంపెనీల ఆదాయ వృద్ధి, షేర్ల విలువలు కీలకంగా మారనున్నాయి.

Advertisement
Advertisement