త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UIDAI | ఎం-ఆధార్ యాప్‌కు యూఐడీఏఐ గుడ్‌బై.. అంద‌రూ కొత్త యాప్ వాడాల్సిందే..

UIDAI | భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎం-ఆధార్ (mAadhaar) యాప్‌ను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌య‌మై ఇది వ‌ర‌కే ఆ సంస్థ ప‌లు మార్లు చివ‌రి తేదీని ప్ర‌క‌టించ‌గా మంగ‌ళ‌వారం నుంచి ఈ యాప్ వినియోగంలో ఉండ‌ద‌ని తెలియ‌జేసింది. వినియోగదారులను కొత్తగా రూపొందించిన ఆధార్ మొబైల్ యాప్ కు మారాలని సూచించింది.

S

Technology | Published On Jun 30, 2026, 1.44 pm IST

UIDAI | ఎం-ఆధార్ యాప్‌కు యూఐడీఏఐ గుడ్‌బై.. అంద‌రూ కొత్త యాప్ వాడాల్సిందే..
Advertisement

UIDAI | భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎం-ఆధార్ (mAadhaar) యాప్‌ను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌య‌మై ఇది వ‌ర‌కే ఆ సంస్థ ప‌లు మార్లు చివ‌రి తేదీని ప్ర‌క‌టించ‌గా మంగ‌ళ‌వారం నుంచి ఈ యాప్ వినియోగంలో ఉండ‌ద‌ని తెలియ‌జేసింది. వినియోగదారులను కొత్తగా రూపొందించిన ఆధార్ మొబైల్ యాప్ కు మారాలని సూచించింది. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు ద్వారా వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కొత్త యాప్‌లో మెరుగైన ప్రైవసీ కంట్రోల్స్, ఫేస్ అథెంటికేషన్, క్యూ ఆర్ కోడ్ ఆధారిత ఐడెంటిటీ షేరింగ్, అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయ‌ని, వీటి ద్వారా ఆధార్ వెరిఫికేషన్‌ను మరింత వేగంగా, సురక్షితంగా పూర్తి చేయొచ్చని యూఐడీఏఐ తెలిపింది.

మ‌రింత సెక్యూరిటీ, ప్రైవ‌సీ ల‌క్ష్యంగా..

స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ సేవలను ఉపయోగించేందుకు ఎం-ఆధార్ యాప్‌ను గ‌తంలో ప్రారంభించారు. అయితే కాలక్రమేణా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉండేలా, ప్రైవసీకి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా యూఐడీఏఐ కొత్త ఆధార్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో పాత ఎం-ఆధార్ యాప్‌కు బదులుగా కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేసే సదుపాయం, మెరుగైన అథెంటికేషన్ విధానాలు, మరింత భద్రమైన యూజర్ అనుభవం అందుబాటులో ఉన్నాయి. కొత్త యాప్ ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, ఈ యాప్‌ను వినియోగ‌దారులు డౌన్‌లోడ్ చేసి ఉప‌యోగించాల‌ని యూఐడీఏఐ సూచించింది. ఈ ఏడాదిలో యూఐడీఏఐ ప్రారంభించిన కొత్త ఆధార్ యాప్ డిజిటల్ ఐడెంటిటీ వాలెట్‌లా పనిచేస్తుంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ వివరాలను సురక్షితంగా నిల్వ చేసుకోవడంతోపాటు అవసరమైనప్పుడు షేర్ చేయవచ్చు. పాత యాప్‌తో పోలిస్తే కొత్త యాప్‌లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను కూడా అందించారు.

కావ‌ల్సిన స‌మాచారం మాత్ర‌మే షేరింగ్‌..

ఫేస్ అథెంటికేషన్ ద్వారా సురక్షిత లాగిన్, వెరిఫికేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆధార్ వివరాలను సులభంగా షేర్ చేయవచ్చు. పూర్తి ఆధార్ డాక్యుమెంట్‌ను కాకుండా అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసి పంచుకునే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆధార్ వెరిఫికేషన్, క్రెడెన్షియల్ మేనేజ్‌మెంట్ సేవలు, అప్‌డేట్ హిస్టరీ, అథెంటికేషన్ రికార్డులు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఒకే డివైస్‌లో మ‌ల్టిపుల్ ఆధార్ ప్రొఫైల్స్‌కు సపోర్ట్ ఉండగా, భారతీయ భాషల్లో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. కొత్త ఆధార్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు డెవలపర్ పేరుగా యూఐడీఏఐ ఉందో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించాలని సంస్థ సూచించింది.

ఇలా చేయండి..

కొత్త ఆధార్ యాప్‌ను వినియోగ‌దారులు సంబంధిత యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేశాక దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. త‌రువాత యాప్‌లో సైన్ ఇన్ చేయాలి. అనంత‌రం బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆపై కొత్త పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలను యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు.

Advertisement
Advertisement