త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TSLPRB | తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు జాతీయ అవార్డు

TSLPRB | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ద‌క్కింది. పోలీస్‌ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆధార్‌ ఆధారిత ఫేస్‌ అథెంటికేషన్‌ను సమర్థంగా అమలు చేసినందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ‘ఆధార్‌ సంవాద్‌–2026’ జాతీయ అవార్డుతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని సత్కరించింది.

P

Telangana | Published On Sep 29, 2026, 8.55 pm IST

TSLPRB | తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు జాతీయ అవార్డు
Advertisement

TSLPRB | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ద‌క్కింది. పోలీస్‌ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆధార్‌ ఆధారిత ఫేస్‌ అథెంటికేషన్‌ను సమర్థంగా అమలు చేసినందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ‘ఆధార్‌ సంవాద్‌–2026’ జాతీయ అవార్డుతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని సత్కరించింది. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన 5వ జాతీయ భాగస్వాముల సదస్సులో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద హాజరైన కార్యక్రమంలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారు.

ఇంపర్సనేషన్‌కు చెక్‌

పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో ఇతరుల పేర్లతో హాజరయ్యే నకిలీ అభ్యర్థులను (ఇంపర్సనేషన్‌) అరికట్టేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఆధార్‌ ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. యూఐడీఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ మార్గదర్శకత్వంలో తొలిసారిగా ఆఫ్‌లైన్‌ ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌ విధానాన్ని అమలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈ సాంకేతికతను విజయవంతంగా వినియోగించిన తొలి నియామక సంస్థగా రికార్డు సృష్టించింది. గత ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు తొలి విడత దరఖాస్తుల స్వీకరణలో భాగంగా అభ్యర్థులు తమ మొబైల్‌ ఫోన్లలో ఆధార్‌ యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 98.7 శాతం మంది.. అంటే 4,23,348 మంది ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. మిగిలిన 1.3 శాతం మంది 5,652 మందికి యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయ సమన్వయంతో సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పారదర్శకతకు సాంకేతికత..

నియామక ప్రక్రియల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆధార్‌ సాంకేతికతను సమర్థంగా వినియోగించిన తీరును యూఐడీఏఐ ప్రశంసించింది. 17వ ఆధార్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన పాలనాధికారి ఏడ్ల రామకృష్ణ స్వామి, పర్యవేక్షకులు పిండిగ సునీల్‌ కుమార్‌, సాంకేతిక సహాయకులు మల్లెకేడి శ్రీనాథ్‌తో పాటు సాంకేతిక భాగస్వాములను బోర్డు అభినందించింది. యూఐడీఏఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అందించిన సహకారానికి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement