త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRAI | బెడిసికొట్టిన ట్రాయ్ వ్యూహం.. 140, 1600 సిరీస్ నంబ‌ర్ల బ్లాకింగ్ కంటిన్యూ..

TRAI | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రపంచవ్యాప్తంగా స్పామ్, మోసపూరిత ఫోన్ కాల్స్ పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా భారత్ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం భారత‌ వినియోగదారులు సుమారు 41 బిలియన్ స్పామ్ కాల్స్, 129 బిలియన్ స్పామ్ మెసేజ్‌లు అందుకుంటున్నారు.

S

Technology | Published On Jul 9, 2026, 10.48 am IST

TRAI | బెడిసికొట్టిన ట్రాయ్ వ్యూహం.. 140, 1600 సిరీస్ నంబ‌ర్ల బ్లాకింగ్ కంటిన్యూ..
Advertisement
  • నంబ‌ర్స్ వైట్ లిస్టింగ్‌ను దుర్వినియోగం చేస్తున్న సంస్థ‌లు
  • మార్కెటింగ్‌, సేవ‌ల కాల్స్‌ను గుర్తించ‌లేక‌పోతున్న ప్ర‌జ‌లు
  • మొత్తం అన్ని నంబ‌ర్స్‌ను బ్లాక్ చేస్తున్న వైనం
  • క‌మ్యూనిటీ యాప్స్‌పై నియంత్ర‌ణ ఎందుక‌ని ట్రూ కాల‌ర్ ప్ర‌శ్న

TRAI | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రపంచవ్యాప్తంగా స్పామ్, మోసపూరిత ఫోన్ కాల్స్ పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా భారత్ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం భారత‌ వినియోగదారులు సుమారు 41 బిలియన్ స్పామ్ కాల్స్, 129 బిలియన్ స్పామ్ మెసేజ్‌లు అందుకుంటున్నారు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వినియోగదారులు కమర్షియల్ కాల్స్‌ను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా 140, 1600 సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. ఇందులో 140 సిరీస్ టెలీమార్కెటింగ్ కాల్స్‌కు, 1600 సిరీస్ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు చేసే సర్వీస్ కాల్స్‌కు కేటాయించారు. ఈ నిబంధనలను గ‌తేడాది ఫిబ్రవరిలో టీసీసీసీపీఆర్ (Telecom Commercial Communications Customer Preference Regulations) కింద ఖరారు చేశారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఏడాది ప్రారంభం వ‌ర‌కు ఈ నంబర్లకు మారాలని ట్రాయ్ ఆదేశించింది.

140, 1600 సిరీస్ నంబ‌ర్ల బ్లాకింగ్ కంటిన్యూ..

గ‌తేడాది చివర్లో ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రూకాలర్, హియా వంటి కాలర్ ఐడీ యాప్‌లు 140, 1600 సిరీస్ నంబర్లను పూర్తిగా వైట్‌లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ నంబర్లకు ఎంతమంది స్పామ్‌గా రిపోర్ట్ చేసినా, స్పామ్ ట్యాగ్ చూపించకూడదు, బ్లాక్ చేయకూడదు. ట్రూకాలర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ, నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు అమలు చేసినట్లు తెలిపింది. దీని ఫలితంగా ఇప్పుడు 1600 సిరీస్ నుంచి వచ్చే ప్రతి కాల్ ఎలాంటి హెచ్చరిక లేకుండా సాధారణ నంబర్‌లాగానే కనిపిస్తోంది. అది నిజమైన బ్యాంక్ ఫ్రాడ్ అలర్ట్ అయినా, వేలాది మంది స్పామ్‌గా రిపోర్ట్ చేసిన మార్కెటింగ్ కాల్ అయినా వినియోగదారుడికి తేడా తెలియడం లేదు. ఈ నిర్ణయం అమలై ఎనిమిది నెలలు పూర్తవుతుండగా, వినియోగదారుల నుంచి తీవ్ర ప్రతిస్పందన కనిపిస్తోంది. ట్రూకాలర్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 140 సిరీస్ కాల్స్‌లో 81 శాతం, 1600 సిరీస్ కాల్స్‌లో 79 శాతం కాల్స్‌కు ప్రజలు స్పందించడం లేదు. ప్రతి రోజు ఈ రెండు సిరీస్‌ల నుంచి వచ్చే 5.1 కోట్లకు పైగా కాల్స్ ఆన్సర్ చేయకుండా వదిలేస్తున్నారు.

వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేస్తున్న సంస్థ‌లు..

అలాగే వినియోగదారులు స్వయంగా ఈ నంబర్లను పెద్దఎత్తున బ్లాక్ చేస్తున్నారు. రోజుకు సుమారు 4 లక్షల 140 సిరీస్ నంబర్లు, 1.25 లక్షల 1600 సిరీస్ నంబర్లు మాన్యువల్‌గా బ్లాక్ అవుతున్నాయి. గ‌తేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 7.4 కోట్ల బ్లాకింగ్స్‌ నమోదయ్యాయి. ముఖ్యంగా 1600 సిరీస్ నంబర్ల బ్లాకింగ్ రోజువారీ స్థాయిలో 208 శాతం పెరిగింది. ఈ సమస్యకు ప్రధాన కారణం కంపెనీలే అని ట్రూకాలర్ ఆరోపిస్తోంది. వాస్తవానికి 1600 సిరీస్‌ను మోసపూరిత లావాదేవీల హెచ్చరికలు, చెల్లింపు నిర్ధారణలు, ఖాతా అప్‌డేట్‌లు వంటి సేవా కాల్స్ కోసం మాత్రమే ఉద్దేశించారు. కానీ అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇదే సిరీస్‌ను ఉపయోగించి క్రెడిట్ కార్డులు, రుణాలు, బీమా పాలసీల మార్కెటింగ్ చేస్తున్నారు. ట్రాయ్ ఆదేశాలతో ఈ నంబర్లకు స్పామ్ ట్యాగ్ చూపించలేకపోవడంతో వినియోగదారులు ముందస్తు హెచ్చరిక లేకుండానే ఈ కాల్స్ అందుకుంటున్నారు. వేలాది మంది స్పామ్‌గా రిపోర్ట్ చేసినా ట్రూకాలర్ వాటిని చూపించడానికి అనుమతి లేదు. ఈ సంస్థలపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం ట్రాయ్‌కే ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడం కంటే, వాటిని గుర్తించే యాప్‌లపై నియంత్రణ పెంచడంపైనే దృష్టి పెట్టిందని విమర్శలు వస్తున్నాయి.

క‌మ్యూనిటీ యాప్‌ల‌పై నియంత్ర‌ణా..?

అయితే ఇప్పుడు ట్రాయ్ మరింత అధికారం కోరుతోంది. కాలర్ ఐడీ యాప్‌లైన ట్రూకాలర్, హియా, హూస్‌కాల్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై నేరుగా నియంత్రణ సాధించేందుకు ఐటీ చట్టం కింద తనను అథరైజ్డ్ ఏజెన్సీగా ప్రకటించాలని మెయిటీని కోరింది. ప్రస్తుతం ఈ యాప్‌లు టెలికాం చట్టాల పరిధిలో కాకుండా ఐటీ చట్టం పరిధిలో ఉన్నాయి. ప్రతిపాదిత టీసీసీసీపీఆర్ సవరణల్లో మరో కీలక ప్రతిపాదన కూడా ఉంది. 140, 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేసే, ఫిల్టర్ చేసే లేదా స్పామ్ ట్యాగ్ చేసే యాప్‌లు ఐటీ చట్టంలోని సెక్షన్ 79 సేఫ్ హార్బర్ రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. దీంతో వాటిపై నేరుగా చట్టపరమైన బాధ్యతలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ నంబర్లపై ఎలాంటి సమాచారం కూడా యాప్‌లు చూపించకుండా నిషేధించే అవకాశం ఉంటుంది.

ట్రూ కాల‌ర్ తీవ్ర అసంతృప్తి..

ఈ పరిణామాలపై ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రోజు కోట్లాది మంది భారతీయులకు, ముఖ్యంగా వృద్ధులకు సురక్షిత కమ్యూనికేషన్ అందించేందుకు తాము పనిచేస్తున్నామ‌ని తెలిపారు. కానీ చెడు ఉద్దేశాలతో పనిచేసే వారికే అవకాశం కల్పిస్తూ, కమ్యూనిటీ అందించే సమాచారాన్ని దాచాలని ప్రయత్నిస్తున్నార‌ని, ఇది ఆమోదయోగ్యం కాద‌ని అన్నారు. తప్పు చేసే వారిని శిక్షించాలి కానీ వినియోగదారులకు రక్షణ కల్పిస్తున్న ట్రూకాలర్ వంటి సంస్థలను కాద‌ని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనలను ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కూడా అధికారికంగా వ్యతిరేకించింది. ట్రూకాలర్ వంటి యాప్‌లు టెలికాం చట్టాల పరిధిలోకి రావని, అవి ఐటీ చట్టం, మెయిటీ పరిధిలో ఉంటాయని పేర్కొంది. అలాగే యాప్‌లు సంవత్సరాలుగా సేకరించిన స్పామ్ గుర్తింపు డేటా, వినియోగదారుల రిపోర్ట్‌లను టెలికాం ఆపరేటర్లకు ఇవ్వాలని ప్రతిపాదించడం సరికాదని అభిప్రాయపడింది. ఒకసారి ట్రాయ్‌కు యాప్ ఫీచర్లపై నియంత్రణ అధికారం ఇస్తే, భవిష్యత్తులో ఇతర నియంత్రణ సంస్థలు కూడా ఇదే తరహా అధికారాలు కోరే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.

డీఎన్‌డీ వ్య‌వ‌స్థ విఫ‌లం..

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్ ఇప్పటికే 2010లో డీఎన్‌డీ (డు నాట్ డిస్టర్బ్) రిజిస్ట్రీని ప్రారంభించింది. వినియోగదారులు 1909కు కాల్ చేయడం లేదా మెసేజ్ పంపడం ద్వారా కమర్షియల్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను నిలిపివేయవచ్చు. డీఎన్‌డీలో నమోదు అయిన నంబర్లకు మార్కెటింగ్ కాల్స్ చేసిన టెలీమార్కెటర్లపై జరిమానాలు, కనెక్షన్ రద్దు వంటి చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి. అయితే వాస్తవ పరిస్థితుల్లో స్పామ్ కాల్స్ ఎక్కువగా సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి రావడం ప్రారంభమైంది. వీటిని డీఎన్‌డీ వ్యవస్థ సమర్థంగా అడ్డుకోలేకపోయింది. ఫిర్యాదుల పరిష్కారం కూడా నెమ్మదిగా సాగుతుండటంతో, కోట్లాది మంది వినియోగదారులు ట్రూకాలర్ వంటి కమ్యూనిటీ ఆధారిత కాలర్ ఐడీ యాప్‌లపై ఆధారపడటం ప్రారంభించారు.

ట్రూ కాల‌ర్ వంటి యాప్స్ ఉండాలి..

ఈ వివాదంలో ప్రధాన అంశం వినియోగదారుల స్వేచ్ఛ అని నిపుణులు చెబుతున్నారు. కాల్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అదే నంబర్‌పై ఇతరుల అనుభవం ఏమిటి అనే సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ట్రూకాలర్ వంటి కమ్యూనిటీ ఆధారిత రిపోర్టింగ్ వ్యవస్థల వల్ల కోట్లాది మంది కాల్ ఎత్తాలా వద్దా అనే నిర్ణయం ముందుగానే తీసుకునే అవకాశం లభిస్తుంద‌ని అంటున్నారు. అయితే బలవంతపు వైట్‌లిస్టింగ్ కారణంగా ఇప్పుడు ఆ సమాచారం మొత్తాన్ని దాచిపెట్టాల్సి వ‌స్తోంది. ఫలితంగా వినియోగదారులు ఈ కాల్స్‌ను బ్లాక్ చేయడం లేదా పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం ప్రారంభించారు. వ్యవస్థ ఇచ్చిన సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడమే అసలు పరిష్కారమని, కానీ ఇప్పటికే వినియోగదారుల నమ్మకం దెబ్బతిన్నందున ఇప్పుడు దాన్ని తిరిగి సాధించడం కష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నిజమైన సేవా కాల్స్ చేసే సంస్థలు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.

Advertisement
Advertisement