త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRAI | 1600, 140 సిరీస్ ఫోన్‌ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..

TRAI | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 140, 1600 నంబర్ సిరీస్‌లకు సంబంధించిన వివాదంపై తాజాగా స్పష్టత ఇచ్చింది. ఇటీవల‌ మీడియాలో వచ్చిన కథనాలను తప్పుడు సమాచారంగా కొట్టిపారేస్తూ, 1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్‌ను ట్యాగ్ చేయడం, బ్లాక్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం అనుమతించేది లేదని మరోసారి స్పష్టం చేసింది.

S

Technology | Published On Jul 11, 2026, 12.32 pm IST

TRAI | 1600, 140 సిరీస్ ఫోన్‌ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..
Advertisement

TRAI | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 140, 1600 నంబర్ సిరీస్‌లకు సంబంధించిన వివాదంపై తాజాగా స్పష్టత ఇచ్చింది. ఇటీవల‌ మీడియాలో వచ్చిన కథనాలను తప్పుడు సమాచారంగా కొట్టిపారేస్తూ, 1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్‌ను ట్యాగ్ చేయడం, బ్లాక్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం అనుమతించేది లేదని మరోసారి స్పష్టం చేసింది. అలాగే 140 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను డీఎన్‌డీ (డూ నాట్ డిస్టర్బ్) రిజిస్ట్రీ ద్వారా మాత్రమే బ్లాక్ చేయవచ్చని తెలిపింది. అయితే అసలు సమస్య ఏమిటన్న విషయంపై మాత్రం ట్రాయ్ స్పందించలేదు. ఈ నంబర్ సిరీస్‌లను సంస్థలే దుర్వినియోగం చేస్తుండగా, దాని ప్రభావం వినియోగదారులపై పడుతోంది.

నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై చ‌ర్య‌లేవి..

1600 సిరీస్ నంబర్లను కేవలం సర్వీస్, ట్రాన్సాక్షనల్ కాల్స్‌కే కేటాయించారు. మోసాల హెచ్చరికలు, చెల్లింపుల నిర్ధారణలు, ఖాతా అప్‌డేట్‌లు వంటి సేవా సంబంధిత సమాచారానికే ఈ నంబర్లను ఉపయోగించాలన్నది ట్రాయ్ నిబంధన. కానీ ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ నంబర్ల నుంచే క్రెడిట్ కార్డులు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి మార్కెటింగ్ కాల్స్ చేస్తున్నాయి. ఇది ట్రాయ్ స్వయంగా రూపొందించిన నిబంధనలకు నేరుగా విరుద్ధం. అయినప్పటికీ, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై చర్యల గురించి ట్రాయ్ తాజా వివరణలో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సంస్థలన్నీ ట్రాయ్ పరిధిలో నమోదైనవే కావడం గమనార్హం. కాగా కాలర్ ఐడీ, కాల్ మేనేజ్‌మెంట్ యాప్‌ల నియంత్రణ అధికారాన్ని ట్రాయ్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రూకాలర్ వంటి యాప్‌లపై నియంత్రణాధికారాలు ఇవ్వాలని ట్రాయ్ మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలుస్తోంది. దీనిపై చట్టపరమైన మార్గాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగంతో కలిసి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ట్రూకాలర్ వంటి యాప్‌లు ట్రాయ్ పరిధిలోకి రావు. అవి ఐటీ చట్టం-2000 కింద ఇంటర్మీడియరీలుగా పనిచేస్తుండగా, వాటి నియంత్రణ బాధ్యత కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖదే.

బ్లాక్ చేస్తున్న వినియోగ‌దారులు..

ఇక ట్రూకాలర్ వంటి కాలర్ ఐడీ యాప్‌లు, వినియోగదారులు ఎంతమంది స్పామ్‌గా రిపోర్ట్ చేసినా, 1600 సిరీస్ నంబర్లపై స్పామ్ ట్యాగ్ చూపించలేని పరిస్థితి కొనసాగుతోంది. ట్రాయ్ తాజా వివరణ ప్రకారం కూడా, వినియోగదారులకు 1600 సిరీస్ నుంచి వచ్చే అవాంఛిత కాల్స్‌ను అధికారికంగా ఫ్లాగ్ చేయడానికి లేదా బ్లాక్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ట్రాయ్ సూచిస్తున్న డీఎన్‌డీ విధానం కూడా కేవలం 140 సిరీస్ నంబర్లకే వర్తిస్తుంది. ట్రూకాలర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం వినియోగదారులు ఈ రెండు సిరీస్‌ల నుంచి వచ్చే ప్రతి 10 కాల్స్‌లో దాదాపు 8 కాల్స్‌కు స్పందించడం లేదు. అంతేకాకుండా రోజుకు 5 లక్షలకు పైగా కాల్స్‌ను మాన్యువల్‌గా బ్లాక్ చేస్తున్నారు. కాల్ చేస్తున్న వ్యక్తి లేదా సంస్థ గురించి ఎలాంటి సమాచారం కనిపించకపోవడంతో, వినియోగదారులు మొత్తం 1600 సిరీస్‌కే దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజమైన బ్యాంక్ అలర్ట్‌లు, సేవా సంబంధిత ముఖ్యమైన కాల్స్ కూడా మిస్ అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది.

కాల్స్ కు స్పందించ‌ని వినియోగ‌దారులు..

ట్రాయ్ తాజా వివరణలో కాలర్ ఐడీ యాప్‌లకు వర్తించే నిబంధనలను మాత్రమే మరోసారి గుర్తుచేసింది. అయితే 1600 సిరీస్‌ను దుర్వినియోగం చేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై అమలు చర్యలు ఎలా ఉంటాయన్న అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ లోటు కొనసాగినంతకాలం వినియోగదారులు ఈ కాల్స్‌ను ఎత్తకుండా ఉండటమే కొనసాగుతుందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

Advertisement
Advertisement