త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CNAP | నవంబర్ 1 నుంచి కొత్త కాలర్ ఐడీ రూల్‌.. ఫోన్‌లో పేరు తప్పనిసరి..

CNAP | దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇకపై ఫోన్‌కు కాల్ వచ్చినప్పుడు మొబైల్ నంబర్‌తోపాటు కాల్ చేస్తున్న వ్యక్తి పేరు కూడా కనిపించనుంది. ఈ మేరకు భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (సీఎన్ఏపీ) సేవను దేశవ్యాప్తంగా అమలు చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.

S

Technology | Published On Oct 15, 2026, 2.48 pm IST

CNAP | నవంబర్ 1 నుంచి కొత్త కాలర్ ఐడీ రూల్‌.. ఫోన్‌లో పేరు తప్పనిసరి..
Advertisement

CNAP | దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇకపై ఫోన్‌కు కాల్ వచ్చినప్పుడు మొబైల్ నంబర్‌తోపాటు కాల్ చేస్తున్న వ్యక్తి పేరు కూడా కనిపించనుంది. ఈ మేరకు భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ (డీఓటీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (సీఎన్ఏపీ) సేవను దేశవ్యాప్తంగా అమలు చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం సంస్థల వినియోగదారులకు ఈ మార్పు వర్తించనుంది. ప్రస్తుతం ఫోన్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోవడానికి ట్రూకాలర్ వంటి ప్రత్యేక యాప్‌లపై చాలామంది ఆధారపడుతున్నారు. అయితే కొత్త సీఎన్ఏపీ విధానంలో టెలికాం సంస్థల వద్ద నమోదైన చందాదారుల వివరాల ఆధారంగా కాలర్ పేరును నేరుగా ఫోన్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా మరో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు.

కాంటాక్ట్ సేవ్ చేసి ఉంటే..

కాల్ చేస్తున్న వ్యక్తి మొబైల్ నంబర్ ఇప్పటికే ఫోన్‌లో సేవ్ చేసి ఉంటే, కాంటాక్ట్స్‌లో ఉన్న పేరే కనిపిస్తుంది. ఒకవేళ ఆ నంబర్ సేవ్ చేయకపోతే, కాల్ చేస్తున్న వ్యక్తి టెలికాం సంస్థ వద్ద నమోదైన పేరును ప్రదర్శిస్తారు. దీంతో కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడం సులభం అవుతుంది. ఈ సేవను వినియోగదారులు విడిగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని ఆదేశాల్లో పేర్కొన్నారు. టెలికాం సంస్థలు తమ నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయాన్ని డిఫాల్ట్‌గా అందుబాటులోకి తీసుకురావాలి. అయితే, ఈ సేవ అమలు ప్రధానంగా 4జి, ఆపైన ఉండే ఆధునిక నెట్‌వర్క్‌లకు సంబంధించినది. 2జి, 3జి నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్ సేవల్లో అమలుపై ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు సాధారణంగా దేశీయ చందాదారుల పేరును చూపించే విధానానికి భిన్నంగా, స్క్రీన్‌పై ఇంటర్నేషనల్ కాల్ అని ప్రదర్శించే నిబంధన ఉంది. దీనివల్ల విదేశీ కాల్‌ను గుర్తించేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది.

వ్యాపారులు, బ‌ల్క్ క‌నెక్ష‌న్లు ఉంటే..

వ్యాపార, బల్క్ మొబైల్ కనెక్షన్లు ఉపయోగించే సంస్థలు తమ సాధారణ చందాదారుల రికార్డుల్లో ఉన్న పేరుకు బదులుగా ప్రత్యేక వ్యాపార పేరును ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఆ పేరుకు సంబంధించి ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ లేదా జీఎస్‌టీ పోర్టల్‌లో నమోదైన వ్యాపార పేరు వంటి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. టెలికాం సంస్థలు ఆ వివరాలను ధ్రువీకరించిన తర్వాతే అనుమతిస్తాయి. కాల్ ముగిసిన తర్వాత పేరు తెలుసుకునే ప్రక్రియలో సేకరించిన సమాచారాన్ని ఆ ప్రక్రియ ద్వారా నిల్వ చేయకుండా ఉండేలా భద్రతా నిబంధనలు పాటించాలి. అలాగే, తమ నంబర్‌ను ఇతరులకు ప్రదర్శించకుండా ఉండేందుకు కాలర్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్ సేవను వినియోగించుకున్న వారి పేర్లు ప్రదర్శించకూడదని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

కాల్స్‌ను న‌మ్మ‌వ‌చ్చా..

గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించడం, అనవసర కాల్స్ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఈ విధానంతో సులభం అవుతుంది. అయితే, కాలర్ పేరు కనిపించినంత మాత్రాన ఆ కాల్ నమ్మదగినదని లేదా మోసపూరితం కాదని భావించకూడదు. పేరు ప్రదర్శన ఒక్కటే స్పామ్, సైబర్ మోసాలను పూర్తిగా అరికట్టలేదు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండడం అవసరం. డీఓటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం నవంబర్ 1 నుంచి ఈ సేవ అమలుకు మార్గం సుగమమైంది. దీంతో మొబైల్ కాలర్ గుర్తింపు విధానంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. అయితే ఈ సేవ ట్రూకాలర్‌కు ప్రత్యామ్నాయంగా కొంత ఉపయోగపడుతుంది. కానీ ఈ రెండు సేవలూ ఒకే విధంగా పనిచేస్తాయని అర్థం కాదు. సీఎన్ఏపీ ప్రధానంగా టెలికాం సంస్థల వద్ద నమోదైన వివరాలపై ఆధారపడుతుంది.

Advertisement
Advertisement