త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

CM Revanth Reddy | డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ గ్లోబల్‌ సమ్మిట్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

P

Telangana | Published On Oct 27, 2026, 10.11 pm IST

CM Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
Advertisement
  • నవంబర్‌ మొదటి వారంలోగా ప్రణాళికలు ఖరారు చేయాలి
  • ఈ నెల 29న ఢిల్లీలో కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం
  • తెలంగాణ సంస్కృతి, వారసత్వం ఉట్టిపడేలా ఏర్పాట్లు
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ గ్లోబల్‌ సమ్మిట్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమ్మిట్‌ ఏర్పాట్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. కార్యక్రమాల నిర్వహణ, అంతర్జాతీయ ప్రతినిధులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

29న ఢిల్లీలో కర్టెన్‌ రైజర్‌

ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్‌ 7 నుంచి ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమాలు, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్‌ ఈవెంట్ల నిర్వహణపై అధికారులతో చర్చించారు. నవంబర్‌ మొదటి వారంలోగా అన్ని ప్రణాళికలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి హాజరయ్యే సీఈఓలు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతికత, ఫార్మా, ఏరోస్పేస్‌ తదితర రంగాల్లో హైదరాబాద్‌, తెలంగాణ సాధించిన విజయాలను అంతర్జాతీయ అతిథులకు పరిచయం చేసేలా నగరవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్‌ ఆధారిత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. క్లైమేట్‌ చేంజ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగాల్లో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించాలని తెలిపారు.

తెలంగాణ సంస్కృతికి పెద్దపీట

గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసే డిజైన్లు తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ నమూనాలకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ గురించి విదేశీ అతిథులు తెలుసుకునేలా ప్రత్యేక డిజైన్లు, ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమ్మిట్‌లో భాగంగా యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ (ఏవీజీసీ) రంగానికి సంబంధించి చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో సీఎస్‌ సంజయ్‌ జాజు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్‌ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డీ అనుదీప్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement