త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Health | శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో ఏఐ హెల్త్ విప్లవం.. రాత్రి పూట ఎమ‌ర్జెన్సీ ఉంటే ముందే చెప్పేస్తుంది..

Samsung Health | శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన శాంసంగ్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌కు భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. రాబోయే శాంసంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ కోసం కొత్త ఏఐ ఆధారిత ఆరోగ్య ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

S

Technology | Published On Jun 4, 2026, 12.52 pm IST

Samsung Health | శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో ఏఐ హెల్త్ విప్లవం.. రాత్రి పూట ఎమ‌ర్జెన్సీ ఉంటే ముందే చెప్పేస్తుంది..
Advertisement

Samsung Health | శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన శాంసంగ్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌కు భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. రాబోయే శాంసంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ కోసం కొత్త ఏఐ ఆధారిత ఆరోగ్య ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. సంక్లిష్టమైన బయోమెట్రిక్ డేటాను సులభంగా అర్థమయ్యే సూచనలుగా మార్చి, రోజువారీ ఆరోగ్య ట్రాకింగ్‌ను మరింత సులభతరం చేయడమే ఈ అప్‌డేట్ లక్ష్యం. వినియోగదారుల కార్యకలాపాలు, నిద్ర, శారీరక సంకేతాలను నిరంతరం విశ్లేషిస్తూ మరింత సమగ్ర ఆరోగ్య సమాచారం అందించే ఏఐ ఆధారిత హెల్త్ ప్లాట్‌ఫామ్ దిశగా శాంసంగ్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే కొత్త అప్ డేట్‌లో ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నారు.

రాత్రి స‌మ‌యంలో హెచ్చ‌రిక‌లు..

రాత్రి పూట బ‌యోమెట్రిక్ సిగ్న‌ల ట్రాకింగ్ ద్వారా వైట‌ల్స్‌ను తెలుసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల రాత్రి స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ముందే హెచ్చ‌రిస్తుంది. ముఖ్యంగా హార్ట్ రేట్‌, హార్ట్ రేట్ మార్పు, శ్వాస‌క్రియ రేటు, చ‌ర్మం ఉష్ణోగ్ర‌త‌, బ్ల‌డ్ ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ వంటి కీల‌క వైటల్స్ వివ‌రాల‌ను రాత్రి పూట రియ‌ల్‌టైమ్‌లో ట్రాక్ చేయ‌వచ్చు. ఈ వివరాలను వినియోగదారుడి సాధారణ విశ్రాంతి స్థాయి డేటాతో పోల్చి చూస్తుంది. గణనీయమైన మార్పులు కనిపించినప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు పంపుతుంది. దీంతో అనవసర హెచ్చరికలు తగ్గి, శరీర రికవరీ అవసరాలు లేదా అనారోగ్య సంకేతాలను సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు ఉన్న వాస్క్యులర్ లోడ్ ఫీచర్‌ను విస్తరించి హార్ట్ హెల్త్ స్కోర్ రూపంలో అందిస్తున్నారు. ఇందులో స‌మ‌గ్ర‌మైన స్లీప్ డేటా, ఒత్తిడి స్థాయిలు, శారీర‌క కార్య‌క‌లాపాల వివ‌రాలు, బాడీ కంపోజిష‌న్ డేటా వంటి స‌మాచారం ఉంటుంది. దాన్నంతా విశ్లేషించి ఒకే రోజువారీ స్కోర్‌ను అందిస్తుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న జీవనశైలి అంశాలను గుర్తించవచ్చు.

గుండెపై ప‌డే ఒత్తిడిని కొలుస్తుంది..

డైలీ కార్డియో లోడ్ ఫీచర్ స‌హాయంతో ఏరోబిక్ వ్యాయామాల సమయంలో గుండెపై పడే ఒత్తిడిని కొలుస్తుంది. రోజువారీ శ్రమను గరిష్ట శిక్షణ సామర్థ్యంతో పోల్చి తగిన ట్రైనింగ్ ఇంటెన్సిటీని సూచిస్తుంది. అలాగే విశ్రాంతి అవసరం అయితే చెబుతుంది. రికవరీకి ఎంత‌ సమయం ప‌ట్టే అవ‌కాశం ఉంటుందో కూడా తెలియ‌జేస్తుంది. దీంతో అధిక వ్యాయామం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు. ఫిట్‌నెస్ ఇండెక్స్ ఫీచర్ ప‌లు అంశాల ఆధారంగా ఫిట్‌నెస్ స్థాయిని అంచనా వేస్తుంది. వీఓ2 మ్యాక్స్, హార్ట్ రేట్ డేటా, రోజువారీ స్టెప్ కౌంట్, ఇతర సమాన వయస్సు, సామర్థ్యం కలిగిన వ్యక్తులతో పోల్చి బలాలు, బలహీనతలను గుర్తించి వ్యక్తిగత మెరుగుదల సూచనలు అందిస్తుంది. అప్‌డేట్ చేసిన శాంసంగ్ హెల్త్ యాప్‌ను ఐదు ప్రధాన విభాగాలుగా విభజించారు. స్లీప్, యాక్టివిటీ, న్యూట్రిషన్, మైండ్‌ఫుల్‌నెస్, వైటల్స్ వంటి విభాగాలు ఉంటాయి. హోమ్ స్క్రీన్‌లో ఏఐ ఆధారిత ఎనర్జీ స్కోర్ తోపాటు రోజువారీ ఆరోగ్య వివరాలు ఒకేచోట కనిపిస్తాయి.

వినికిడి ఆరోగ్యం కోసం కూడా..

అప్‌గ్రేడ్ చేసిన యాంటీఆక్సిడెంట్ ఇండెక్స్‌లో ట్రెండ్ చార్ట్స్, రోజువారీ హిస్టరీ ట్రాకింగ్, ఆహారం, శారీరక ప్రతిస్పందనల మధ్య మెరుగైన అనుసంధానం వంటి వివ‌రాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఆహారం ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మెరుగైన ఏజీఈఎస్ ఇండెక్స్ నిద్ర సమయంలో ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది. రాత్రిపూట సేకరించిన డేటా ఆధారంగా జీవనశైలి ప్రభావాలు కాలక్రమేణా శరీరంపై ఎలా పేరుకుపోతున్నాయో విశ్లేషిస్తుంది. గెలాక్సీ వాచ్ సెన్సార్ల సహాయంతో చుట్టుపక్కల శబ్ద స్థాయిలను పర్యవేక్షిస్తుంది. అధిక శబ్దంతో కూడిన ప్రయాణాలు, ఎక్కువ వాల్యూమ్‌తో చేసే వర్కౌట్లు, నగర వాతావరణం వంటి పరిస్థితుల్లో వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యక్తిగత సూచనలు అందిస్తుంది. శాంసంగ్ ఈ ఆరోగ్య ఫీచర్లను తన గెలాక్సీ ఎకోసిస్టమ్ అంతటా విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్ పరికరాల మధ్య డేటా సమన్వయం జరిగి, అన్ని పరికరాల్లో ఒకే విధమైన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది. సేకరించిన డేటా ఆధారంగా ఏఐ సిఫార్సులు మరింత క‌చ్చితంగా ఉంటాయి.

కొత్త వాచ్‌ల‌లోనే..

ఈ కొత్త శాంసంగ్ హెల్త్ అప్‌డేట్ జూన్ 8 నుంచి విడుదల కానుంది. ఇది రాబోయే గెలాక్సీ వాచ్ ఫీచర్లకు ప్రివ్యూగా పనిచేస్తుంది. పూర్తి స్థాయి ఏఐ హెల్త్ సామర్థ్యాలు తదుపరి తరం గెలాక్సీ వాచ్‌లతో అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎంఎక్స్ బిజినెస్ డిజిటల్ హెల్త్ టీమ్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హాన్‌పాక్ మాట్లాడుతూ గెలాక్సీ వాచ్ ద్వారా సేకరించిన ఆరోగ్య డేటాను ఏఐ విశ్లేషణలతో అనుసంధానించి వినియోగదారులు తమ శారీరక, మానసిక స్థితిని మరింత సులభంగా అర్థం చేసుకునేలా శాంసంగ్ హెల్త్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కనెక్టెడ్ గెలాక్సీ ఎకోసిస్టమ్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణల ఆధారంగా వ్యక్తిగతీకరించిన ఆరోగ్య నిర్వహణ అనుభవాలను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement