త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్‌26 ఎఫ్ఈ వ‌చ్చేసింది.. ఫీచ‌ర్లు అదుర్స్‌..

Samsung Galaxy S26 FE | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ, టెక్ దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్‌26ఎఫ్ఈ ని భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌త నెల‌లో ఈ ఫోన్‌ను సంస్థ ప‌రిచయం చేయ‌గా, ప్ర‌స్తుతం అధికారికంగా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫోన్‌లో మెరుగైన డిజైన్‌, అప్‌డేట్ చేసిన కెమెరాలు, అధిక రిఫ్రెష్ రేట్ క‌లిగిన డిస్‌ప్లే, శాంసంగ్ లేటెస్ట్ వ‌న్ యూఐ 9 ఇంటర్‌ఫేస్‌, గెలాక్సీ ఏఐ టూల్స్ వంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందించారు.

S

Technology | Published On Sep 15, 2026, 1.26 pm IST

Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్‌26 ఎఫ్ఈ వ‌చ్చేసింది.. ఫీచ‌ర్లు అదుర్స్‌..
Advertisement

Samsung Galaxy S26 FE | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ, టెక్ దిగ్గ‌జ సంస్థ శాంసంగ్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్‌26ఎఫ్ఈ ని భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌త నెల‌లో ఈ ఫోన్‌ను సంస్థ ప‌రిచయం చేయ‌గా, ప్ర‌స్తుతం అధికారికంగా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫోన్‌లో మెరుగైన డిజైన్‌, అప్‌డేట్ చేసిన కెమెరాలు, అధిక రిఫ్రెష్ రేట్ క‌లిగిన డిస్‌ప్లే, శాంసంగ్ లేటెస్ట్ వ‌న్ యూఐ 9 ఇంటర్‌ఫేస్‌, గెలాక్సీ ఏఐ టూల్స్ వంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ ఫోన్‌లో కెమెరా ప్రాసెసింగ్ మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌ని శాంసంగ్ తెలిపింది. అలాగే గెలాక్సీ ఏఐ టూల్స్‌ను మ‌రింత అభివృద్ధి చేశామ‌ని, దీర్ఘ‌కాలికంగా సాఫ్ట్‌వేర్ స‌పోర్ట్‌ను కూడా అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ కెమెరా..

ఈ ఫోన్‌లో వెనుక వైపు అప్‌గ్రేడ్ చేసిన 3 కెమెరాల‌ను ఇచ్చారు. ఇందులో ప్ర‌త్యేకంగా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ క‌లిగిన టెలిఫొటో కెమెరా ఉంది. ముందు వైపు కెమెరాను సైతం అప్‌గ్రేడ్ చేసి 12 మెగాపిక్స‌ల్ సెన్సార్‌ను ఇచ్చారు. గ్రూప్ సెల్ఫీల కోసం ఇది ఎక్కువ ఫ్రేమింగ్‌ను అందిస్తుంద‌ని కంపెనీ తెలిపింది. వీడియో రికార్డింగ్‌లో భాగంగా మై ఫ్యాన్ క్యామ్ అనే కొత్త ఫీచ‌ర్‌ను ఇచ్చారు. ఇది ఆటోమేటెడ్ స‌బ్జెక్ట్ ట్రాకింగ్‌లా ప‌నిచేస్తుంది. యూజ‌ర్ ఎంచుకున్న వ్య‌క్తిని మ‌ధ్య‌లో ఉంచుతూ రికార్డింగ్ స‌మ‌యంలో ఫ్రేమింగ్‌ను ఇది ఆటోమేటిగ్గా మారుస్తుంది. దీంతో వీడియోలు క్వాలిటీగా రికార్డ్ అవుతాయి. అలాగే ఫొటోల‌ను ఎడిట్ చేసేందుకు గాను ఫొటో అసిస్ట్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు. స‌హ‌జ భాష‌లో ఇచ్చే సూచ‌న‌ల ఆధారంగా ఫొటోల‌ను ఎడిట్ చేసుకునే స‌దుపాయాన్ని ఈ ఫీచ‌ర్ క‌ల్పిస్తుంది. గ్యాల‌రీలోని వీడియోల‌ను ఆటోమేటిగ్గా క‌లిపి రూపొందించేందుకు జెమిని ఓమ్ని ఇంటిగ్రేష‌న్‌ను కూడా ఇచ్చారు.

7 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌..

శాంసంగ్ సొంతంగా అభివృద్ధి చేసిన వ‌న్‌యూఐ 9ని ఇందులో ఇచ్చారు. నౌబ్రీఫ్ అనే ఫీచ‌ర్ ద్వారా వాతావ‌ర‌ణం, ఆరోగ్యం, షెడ్యూల్ వంటి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. స‌హ‌జ భాష‌లో ఇచ్చే సూచ‌న‌ల ఆధారంగా వీటిని రూపొందించుకోవ‌చ్చు. ఈ ఫోన్‌కు గాను 7 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌ను, 7 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల ఇన్ఫినిటీ-ఓ డైన‌మిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను క‌లిగి ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో శాంసంగ్‌కు చెందిన సొంత ఎగ్జినోస్ 2500 డెకాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వ‌న్ యూఐ 9 ఓఎస్ వ‌స్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. ముందు వైపు 12 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. ఐపీ 68 డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెన్స్‌, స్టీరియో స్పీక‌ర్లు, డాల్బీ అట్మోస్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌, యూఎస్‌బీ టైప్ సి, 5జి, 4జి, వైఫై 6ఇ, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, 4900 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 45 వాట్ల వైర్డ్ ఫాస్ఠ్ చార్జింగ్‌, 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందించారు.

ధ‌ర ఎంతంటే..

గెలాక్సీ ఎస్26 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను పిస్తాచియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.79,999గా ఉంది. ఈఫోన్‌ను సెప్టెంబ‌ర్ 18 నుంచి శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, ఇత‌ర రిటెయిల్ స్టోర్స్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా సంస్థ ప‌లు ఆఫ‌ర్ల‌ను సైతం ప్ర‌క‌టించింది. పాత ఫోన్‌ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8వేల వ‌ర‌కు గ‌రిష్ట అప్‌గ్రేడ్ బోన‌స్ పొంద‌వ‌చ్చు. ఎంపిక చేసిన ఆర్థిక సంస్థ‌లు లేదా బ్యాంకుల ద్వారా ఫోన్‌ను 30 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయంతో కొనే వీలు క‌ల్పించారు. ఈ విధానంలో కొనుగోలు చేస్తే పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై మ‌రో రూ.3వేల వ‌ర‌కు అప్‌గ్రేడ్ బోన‌స్ ఇస్తారు. బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా రూ.7వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్‌, 12 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొంటే 18 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని ఇస్తారు.

Advertisement
Advertisement