త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung Galaxy F70 5G | శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 5జి లాంచ్‌.. ధర రూ.17,999 నుంచే..

Samsung Galaxy F70 5G | భారత్‌లో తన మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి శాంసంగ్‌ కొత్తగా గెలాక్సీ ఎఫ్‌70 5జిని తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రకటించిన ఈ ఫోన్‌లో సన్నని డిజైన్‌, మెరుగైన కెమెరా సాంకేతికత, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లకు ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సదుపాయం, ఐదేళ్ల భద్రతా అప్‌డేట్లు ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

S

Technology | Published On Oct 19, 2026, 10.28 am IST

Samsung Galaxy F70 5G | శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 5జి లాంచ్‌.. ధర రూ.17,999 నుంచే..
Advertisement

Samsung Galaxy F70 5G | భారత్‌లో తన మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోకి శాంసంగ్‌ కొత్తగా గెలాక్సీ ఎఫ్‌70 5జిని తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రకటించిన ఈ ఫోన్‌లో సన్నని డిజైన్‌, మెరుగైన కెమెరా సాంకేతికత, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లకు ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సదుపాయం, ఐదేళ్ల భద్రతా అప్‌డేట్లు ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గెలాక్సీ ఎఫ్‌70 5జిని కేవలం 7.5 మిల్లీమీటర్ల మందంతో సన్నని ఆకృతిలో రూపొందించారు. వెనుక భాగంలో శాంసంగ్‌ ప్రత్యేకమైన నిలువు కెమెరా అమరికను అందించింది. లిలాక్‌ బ్లిస్‌, బ్లిస్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వ‌చ్చింది. ముందు భాగంలో 6.7 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లేను అందించారు. 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉండడంతో స్క్రీన్‌పై కంటెంట్‌ను స్క్రోల్‌ చేసేటప్పుడు మరింత సున్నితమైన అనుభూతి లభిస్తుంది. రంగుల స్పష్టత, కాంట్రాస్ట్‌ మెరుగ్గా ఉండేలా అమోలెడ్‌ సాంకేతికతను ఉపయోగించారు. ప్రమాదవశాత్తూ ఫోన్‌ కిందపడినా, గీతలు పడినా రక్షణ కల్పించేందుకు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను ఇచ్చారు.

50 ఎంపీ కెమెరాతో ఫొటోగ్రఫీ..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఎఫ్‌/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్స‌ల్‌ ప్రధాన కెమెరా కీలకమైనది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (ఓఐఎస్‌) సదుపాయం ఉండడంతో ఫొటోలు తీసేటప్పుడు చేతి కదలికల కారణంగా ఏర్పడే అస్పష్టతను తగ్గించవచ్చు. తక్కువ వెలుతురులో ఫొటోల నాణ్యతను మెరుగుపరచడంలోనూ ఇది సహాయపడుతుంది. విస్తృత దృశ్యాలు, గ్రూప్‌ ఫొటోల కోసం 5 మెగాపిక్స‌ల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరాను అందించారు. దగ్గరగా ఉన్న వస్తువులను ఫొటోలు తీయడానికి 2 మెగాపిక్సెల్‌ మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్‌ నాచ్‌లో 13 మెగాపిక్సెల్‌ కెమెరాను అమర్చారు. దీనికి ఎఫ్‌/2.0 అపెర్చర్‌ ఉంది.

ఎక్సినోస్‌ ప్రాసెసర్‌.. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ..

గెలాక్సీ ఎఫ్‌70 5జికి శాంసంగ్‌ సొంత ఎక్సినోస్‌ 1330 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అమర్చింది. ఐదు నానోమీటర్ల తయారీ సాంకేతికతతో రూపొందించిన ఈ చిప్‌సెట్‌లో రెండు 2.4 గిగాహెడ్జ్‌ కార్టెక్స్‌-ఎ78 కోర్లు, ఆరు 2 గిగాహెడ్జ్‌ కార్టెక్స్‌-ఎ55 కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్‌ అవసరాల కోసం మాలి-జి68 ఎంపీ2 జీపీయూను అందించారు. ఈ ఫోన్ 4జి, 5జి నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా, 25 వాట్ల వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కల్పించారు. రోజువారీ వినియోగానికి అనుగుణంగా బ్యాటరీ సామర్థ్యాన్ని అందించినట్లు కంపెనీ పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ మద్దతు విషయంలోనూ శాంసంగ్‌ ఈ ఫోన్‌కు ప్రాధాన్యమిచ్చింది. నాలుగు తరాల ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌లు, ఐదేళ్లపాటు భద్రతా అప్‌డేట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ధర విభాగంలో దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్‌ మద్దతు వినియోగదారులకు ఉపయోగపడనుంది.

శాంసంగ్ వాలెట్ స‌దుపాయం..

భద్రత కోసం హార్డ్‌వేర్‌ ఆధారిత శాంసంగ్‌ నాక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అందించారు. డిజిటల్‌ గుర్తింపు పత్రాలను భద్రపరచడం, ట్యాప్‌ అండ్‌ పే చెల్లింపులు చేయడం వంటి అవసరాల కోసం శాంసంగ్‌ వాలెట్‌ సదుపాయం కూడా ఉంది. గూగుల్‌తో కలిసి పనిచేసే సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ పర్యావరణ వ్యవస్థలో భాగమైన క్విక్‌ షేర్‌, వాయిస్‌ ఫోకస్‌ వంటి సదుపాయాలనూ అందించారు. 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలోనూ 128 జీబీ అంతర్గత స్టోరేజ్‌ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం ఉండడంతో రెండు నానో సిమ్‌ కార్డులు లేదా ఒక నానో సిమ్‌, ఒక మైక్రో ఎస్‌డీ కార్డును ఉపయోగించవచ్చు.

ద‌ర వివ‌రాలు..

ఫోన్‌ పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ను అమర్చారు. యూఎస్‌బీ టైప్ సి ఆడియో, కింది భాగంలో స్పీకర్లు ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌ ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా 5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్టీఈ, 2.4, 5 గిగాహెడ్జ్‌ బ్యాండ్లలో వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్‌ 5.3, జీపీఎస్‌, గ్లోనాస్‌ నావిగేషన్‌ సదుపాయాలు ఉన్నాయి. ఛార్జింగ్‌ కోసం యూఎస్‌బీ టైప్ సి పోర్టును అందించారు. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌70 5జి 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌ అక్టోబర్‌ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా బ్యాంకు డిస్కౌంట్‌తో రూ.17,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌కు సంబంధించిన అర్హతలు, నిబంధనల‌ను కొనుగోలు సమయంలో పరిశీలించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement