త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PhonePe | ఫోన్‌పేలో రూ.250తో పెన్ష ఖాతా.. కేవైసీ అవసరం లేదు..

PhonePe | ఫోన్‌పే వినియోగదారులు ఇకపై కేవలం రూ.250 ప్రారంభ పెట్టుబడితోనే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాను తెరవవచ్చు. ఇందుకోసం కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయడం, మరోసారి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం అవసరం లేదని సంస్థ మంగళవారం ప్రకటించింది. తత్కాల్ ఎన్‌పీఎస్ పేరుతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

S

Technology | Published On Oct 27, 2026, 3.40 pm IST

PhonePe | ఫోన్‌పేలో రూ.250తో పెన్ష ఖాతా.. కేవైసీ అవసరం లేదు..
Advertisement

PhonePe | ఫోన్‌పే వినియోగదారులు ఇకపై కేవలం రూ.250 ప్రారంభ పెట్టుబడితోనే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాను తెరవవచ్చు. ఇందుకోసం కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయడం, మరోసారి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం అవసరం లేదని సంస్థ మంగళవారం ప్రకటించింది. తత్కాల్ ఎన్‌పీఎస్ పేరుతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సేవ ద్వారా వినియోగదారుల బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఇప్పటికే ధ్రువీకరించిన కేవైసీ వివరాలను వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా నిర్ధారిస్తారు. అనంతరం అనుసంధానమైన బ్యాంకు ఖాతాను ఎంచుకుని, ఫోన్‌పే యూపీఐ ద్వారా ప్రారంభ పెట్టుబడిని చెల్లించవచ్చు. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్‌పీఎస్ ఖాతాకు గుర్తింపు సంఖ్యగా పనిచేసే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్‌ఏఎన్) జారీ అవుతుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భాగస్వామ్య బ్యాంకుల ద్వారా అందిస్తున్న సేవలను మరిన్ని బ్యాంకులకు విస్తరించాలని ఫోన్‌పే యోచిస్తోంది.

ఫోన్‌పేలో ఎన్‌పీఎస్ ఖాతా ఎలా తెరవాలి?

వినియోగదారులు ఫోన్‌పే యాప్‌లో ఎన్‌పీఎస్ అని సెర్చ్ చేసి, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం స్టార్ట్ పెన్షన్ అకౌంట్ జర్నీపై క్లిక్ చేసి, తమకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తయ్యాక కనీసం రూ.250 పెట్టుబడిని నమోదు చేసి, యూపీఐ ద్వారా చెల్లింపు చేయాలి. దీంతో ఖాతా ప్రారంభ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంలో కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.

ఎవరికి ఉపయోగకరం?

ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన యువత, తొలిసారి పెట్టుబడులు పెట్టేవారు, గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు పదవీ విరమణ కోసం పొదుపు ప్రారంభించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. అయితే, భవిష్యత్తులో సమకూరే నిధి మొత్తం క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులు, పెట్టుబడులపై వచ్చే రాబడులు, ఎంచుకున్న పెట్టుబడి విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఖాతా తెరిచినంత మాత్రాన నిర్దిష్ట మొత్తం లభిస్తుందని హామీ ఉండదు.

పెట్టుబడికి ముందు ఇవి తెలుసుకోండి

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణలో పనిచేసే పదవీ విరమణ పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెట్టే ముందు అందుబాటులో ఉన్న పెట్టుబడి ఎంపికలు, మార్కెట్ రిస్కులు, నగదు ఉపసంహరణ నిబంధనలు, వర్తించే పన్ను నిబంధనలను పరిశీలించాలి. ఫోన్‌పే అందిస్తున్న రూ.250 అనేది ఖాతా ప్రారంభించేందుకు అవసరమైన కనీస మొత్తం మాత్రమే. పదవీ విరమణ సమయానికి ఎంత పొదుపు అవసరమనే విషయాన్ని వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవాలి.

ఫోన్‌పే చెల్లింపుల విభాగం వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీప్ అగర్వాల్ మాట్లాడుతూ, డిజిటల్ ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే ఈ సదుపాయం లక్ష్యమని తెలిపారు. అయితే, ఈ సేవ కోసం భాగస్వామ్యమైన బ్యాంకుల పేర్లను సంస్థ వెల్లడించలేదు.

Advertisement
Advertisement