త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | రేవంత్‌! నాన్చ‌కు ఇగ‌.. క‌న్నేప‌ల్లి నుంచి నీళ్లు ఎత్తిపొయ్‌

Jeevan Reddy | సీఎం రేవంత్‌రెడ్డి ఇక‌నైనా నాన‌వేత ధోర‌ణి వ‌దిలి క‌న్నేప‌ల్లి (Kannepally) నుంచి నీళ్ల‌ను ఎత్తిపోయాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 27, 2026, 3.40 pm IST

Jeevan Reddy | రేవంత్‌! నాన్చ‌కు ఇగ‌.. క‌న్నేప‌ల్లి నుంచి నీళ్లు ఎత్తిపొయ్‌
Advertisement
  • నెలలో కాఫర్ డ్యాం క‌ట్టి నీళ్లివ్వొచ్చు
  • రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోసినా ఐదు నెలల్లో 150 టీఎంసీలు అయిత‌య్‌
  • నిన్న‌ మహారాష్ట్రకు వెళ్లి ఏం సాధించిన‌ట్టు? ఎక్క‌డిద‌క్క‌న్నే ఉంది
  • నీకు చేతగాకపోతే దిగిపో.. గవర్నర్‌కు బాధ్య‌తలు అప్పగించు
  • రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ఫైర్‌

Jeevan Reddy | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి ఇక‌నైనా నాన‌వేత ధోర‌ణి వ‌దిలి క‌న్నేప‌ల్లి (Kannepally) నుంచి నీళ్ల‌ను ఎత్తిపోయాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) డిమాండ్ చేశారు. కాఫ‌ర్ డ్యాంను నెల రోజుల్లో క‌ట్టి నీళ్లివ్వొచ్చ‌న్నారు. రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోసినా ఐదు నెల‌ల్లో 150 టీఎంసీలు ఎత్తిపోయొచ్చ‌ని చెప్పారు. నిన్న మ‌హారాష్ట్ర‌కు వెళ్లి ఏం సాధించార‌ని ప్ర‌శ్నించారు. నీకు పాల‌న‌ చేత‌గాక‌పోతే గ‌వ‌ర్న‌ర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌న్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఎల్ నినో ప్రత్యేక పరిస్థితుల్లో కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలి. నీరు ఎత్తిపోసేందుకు తగిన లెవల్ లేకపోతే కాఫర్ డ్యాం నిర్మించాలి. సీతారామ దగ్గర ఇసుక బస్తాలు వేసుకొని నీటిని నింపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు చెప్పారు కదా.. ఇక్కడ కూడా అలా చేయొచ్చు. నీరు, కరెంట్ అడగవద్దని.. వరి విత్తనాలు కొనే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇటువంటి మూర్ఖపు ఆలోచన మానుకోవాలి.

ఆ ప్రభావం అందరిపైనా పడుతుంది

వృథాగా పోతున్న ప్రాణహిత జలాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. తాగు, సాగు నీటితో పాటు విద్యుత్‌కు కూడా ఉపయోగపడుతుంది. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామ రక్షగా ఈ కరువు సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతు పంట పండించకపోతే ఆ ప్రభావం అందరిపైనా పడుతుంది. ఇప్పటికే బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్ర‌భుత్వం తన బాధ్యతను విస్మరించి రైతులను పంట వేసుకోవద్దని చెప్పడం విడ్డూరంగా ఉంది.

ఉత్త‌మ్ మాట‌లు విడ్డూర‌మే..

30 నెలలు నిద్రపోయిన రేవంత్ రెడ్డి నిన్న మహారాష్ట్ర వెళ్లి తుమ్మిడిహెట్టి గురించి మాట్లాడారు. మహారాష్ట్ర వెళ్లినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కేసీఆర్ హయాంలో తుమ్మిడిహెట్టి కోసం ఎంతగానో ప్రయత్నించారు. కేసీఆర్ మూడేళ్లలో ప్రాజెక్టు కడితే... రేవంత్ రెడ్డి కనీసం మూడేళ్లలో మరమ్మతులు కూడా చేయలే. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీరు తెస్తామని.. చదువుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది.

తుమ్మిడిహెట్టి విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డికి ఇప్పటికీ కలలో కనిపించేది కేసీఆరే. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నానవేత ధోరణి మానుకొని రైతుల ప్రయోజనం కోసం కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి అని జీవ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె .విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement