త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Perplexity | ఇక ఏఐతో మీ పీసీలో ప‌నులు చేయించుకోవ‌చ్చు.. కొత్త టూల్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప‌ర్‌ప్లెక్సిటీ..

Perplexity | కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప‌ర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సంస్థ తాజాగా పర్సనల్ కంప్యూటర్ పేరిట కొత్త టూల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్రస్తుతం ఇది మాక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

S

Technology | Published On Apr 17, 2026, 12.20 pm IST

Perplexity | ఇక ఏఐతో మీ పీసీలో ప‌నులు చేయించుకోవ‌చ్చు.. కొత్త టూల్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప‌ర్‌ప్లెక్సిటీ..
Advertisement

Perplexity | కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప‌ర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సంస్థ తాజాగా పర్సనల్ కంప్యూటర్ పేరిట కొత్త టూల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్రస్తుతం ఇది మాక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ టూల్‌ను ఫిబ్రవరి చివరలో పరిచయం చేసిన ప‌ర్‌ప్లెక్సిటీ కంప్యూట‌ర్ లోని మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఆధారంగా చేసుకుని మరింత అభివృద్ధి చేసి విడుద‌ల చేశారు. ఇందులో యూజ‌ర్ల ఫైళ్లు, యాప్‌లు, కనెక్టర్లు, అలాగే ఇంటర్నెట్‌తో పరస్పరం చర్యలు చేపట్టగల ఏఐ ఏజెంట్లు ఉంటాయి. ఇవి క్లిష్టమైన పనులు, నిరంతర వర్క్‌ఫ్లోలను నిర్వహిస్తాయి. ఈ పర్సనల్ కంప్యూటర్ టూల్ ద్వారా యూజర్లు తమ లోకల్ ఫైళ్లు, నేటివ్ యాప్‌లు, బయటి కనెక్టర్లు, వెబ్ వనరులతో సమగ్రంగా పని చేసుకోవచ్చు. దీనివల్ల ప‌ర్స‌న‌లైడ్జ్‌ అనుభవం లభిస్తుంది. అలాగే లోకల్, క్లౌడ్ వ్య‌వ‌స్థ‌ల‌ను సమన్వయం చేస్తూ ఉత్పాదకతను పెంచుతుంది. దీంతోపాటు భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. ఈ మేర‌కు ప‌ర్‌ప్లెక్సిటీ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

24 గంట‌ల‌పాటు నిరంత‌రాయంగా..

ఈ సాఫ్ట్‌వేర్ టూల్‌ను మాక్ మినీపై ఉప‌యోగిస్తే 24 గంటలపాటు నిరంతరంగా పనిచేసేలా చేయ‌వచ్చని కంపెనీ తెలిపింది. దీని ద్వారా ప్రైవేట్ ఫైళ్లు, నేటివ్ ప్రోగ్రామ్‌లకు సురక్షిత యాక్సెస్ లభిస్తుంది. అలాగే యూజర్లు బయట ఉన్నప్పటికీ తమ మొబైల్ ఫోన్ల ద్వారా పనులను ప్రారంభించవ‌చ్చు, లేదా పర్యవేక్షించవ‌చ్చు. ఈ టూల్ ఉపయోగాలు విస్తృతంగా ఉంటాయని ప‌ర్‌ప్లెక్సిటీ పేర్కొంది. ఉదాహరణకు యూజర్లు తమ టు-డూ లిస్ట్‌ను సమీక్షించమని లేదా అందులోని పనులను పూర్తి చేయమని సూచించవచ్చు. మాక్‌లోని నోట్స్ యాప్‌ను ఓపెన్ చేసి సహాయం కోరితే, ఈ సిస్టమ్ అవసరాన్ని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తుంది. ఇది ఫైళ్ల నుంచి సమాచారాన్ని తీసుకుని, యాపిల్ మెసేజెస్ వంటి యాప్‌లతో కలిసి పనిచేస్తుంది. అవసరమైతే అనేక ఏఐ ఏజెంట్లను ఉపయోగించి పనిని పూర్తి చేస్తుంది. అదేవిధంగా గందరగోళంగా ఉన్న ఫోల్డర్లను సక్రమంగా సర్దుబాటు చేసి, ఫైళ్లకు సరైన పేర్లు పెట్టి నిర్మాణాన్ని స్పష్టంగా రూపొందిస్తుంది. దీని వ‌ల్ల మాక్ పీసీలో ఫైల్స్‌, ఫోల్డ‌ర్స్ అన్నీ అస్త‌వ్య‌స్తంగా లేకుండా ఒక చోట క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అమ‌ర్చ‌బ‌డ‌తాయి.

వాయిస్ క‌మాండ్ల‌కు కూడా స‌పోర్ట్..

ఈ పర్సనల్ కంప్యూటర్ టూల్ వాయిస్ కమాండ్లకు కూడా స‌పోర్ట్‌ ఇస్తుంది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచే పనులను ప్రారంభించవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు. ఫైళ్లను క్రియేట్‌ సమయంలో ఈ యాప్ సురక్షిత శాండ్‌బాక్స్‌లో పనిచేస్తుందని, ప్రతి చర్యను పూర్తిగా ట్రాక్ చేయగలిగేలా, అవసరమైతే తిరిగి మార్చుకునేలా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ మాక్ వినియోగదారుల్లో మాక్ సబ్‌స్క్రైబర్ల‌కి మాత్రమే అందుబాటులో ఉంద‌ని, త్వరలో ఇతర వినియోగదారులకు కూడా ఈ టూల్‌ను అందిస్తామ‌ని, ముఖ్యంగా ముందుగా వెయిటింగ్ లిస్ట్‌లో నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని ప‌ర్‌ప్లెక్సిటీ పేర్కొంది.

Advertisement
Advertisement