త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ChatGPT Images 2.0 | ఓపెన్ఏఐ నుంచి చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0.. అడ్వాన్స్‌డ్ ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఏఐ మోడ‌ల్‌..

ChatGPT Images 2.0 | ప్ర‌ముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఓపెన్ఏఐ త‌న చాట్‌జీపీటీ ఏఐకి గాను నూత‌నంగా చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 అనే ఇమేజ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అత్యంత క‌చ్చిత‌మైన‌, నిర్మిత‌మైన‌, వినియోగానికి అనుకూల‌మైన విజువ‌ల్ ఔట్‌పుట్‌ల‌ను ఇచ్చే విధంగా ఈ మోడ‌ల్‌ను అభివృద్ధి చేసిన‌ట్లు ఓపెన్ ఏఐ వెల్ల‌డించింది.

S

Technology | Published On Apr 22, 2026, 3.55 pm IST

ChatGPT Images 2.0 | ఓపెన్ఏఐ నుంచి చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0.. అడ్వాన్స్‌డ్ ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఏఐ మోడ‌ల్‌..
Advertisement

ChatGPT Images 2.0 | ప్ర‌ముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఓపెన్ఏఐ త‌న చాట్‌జీపీటీ ఏఐకి గాను నూత‌నంగా చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 అనే ఇమేజ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అత్యంత క‌చ్చిత‌మైన‌, నిర్మిత‌మైన‌, వినియోగానికి అనుకూల‌మైన విజువ‌ల్ ఔట్‌పుట్‌ల‌ను ఇచ్చే విధంగా ఈ మోడ‌ల్‌ను అభివృద్ధి చేసిన‌ట్లు ఓపెన్ ఏఐ వెల్ల‌డించింది. ఈ మోడ‌ల్ చాలా క్లిష్ట‌మైన విజువ‌ల్ టాస్క్‌ల‌ను సైతం నిర్వ‌హిస్తుంద‌ని, సూచ‌న‌ల‌ను మ‌రింత క‌చ్చితంగా అనుస‌రిస్తుంద‌ని, వాస్త‌వ ప్ర‌పంచ డిజైన్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా ఇమేజ్‌ల‌ను జ‌న‌రేట్ చేస్తుంద‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది. చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 మోడ‌ల్ యూజ‌ర్లు ఇచ్చే ఇమేజ్ ప్రాంప్ట్‌ల‌ను స‌రిగ్గా అర్థం చేసుకుంటుంద‌ని, అలాగే స్థిర‌త్వాన్ని క‌లిగి ఉండే విధంగా ఇమేజ్‌ల‌ను జ‌న‌రేట్ చేస్తుంద‌ని తెలిపింది.

లాజిక్‌గా ఆలోచిస్తుంది..

చాట్‌జీపీటీ, కోడెక్స్‌, ఏపీఐ ద్వారా ఈ కొత్త ఇమేజ్ జ‌న‌రేష‌న్ ఏఐ మోడ‌ల్ అందుబాటులో ఉండ‌గా, ఇందులో కంపోజిష‌న్ కంట్రోల్‌, టెక్ట్స్ రెండ‌రింగ్‌, మ‌ల్టీ లింగ్వ‌ల్ స‌పోర్ట్‌, విజువల్ క‌న్సిస్టెన్సీలో అప్‌గ్రేడ్‌ల‌ను అందించారు. ఈ వెర్షన్‌లో థింకింగ్ కెపబిలిటీ అనే కొత్త ఫీచ‌ర్‌ను అందించారు. అంటే ఇమేజ్‌ను జ‌న‌రేట్ చేసే ముందు ప్రాంప్ట్‌ను విశ్లేషించి లాజిక్‌గా ఆలోచించగలిగే సామర్థ్యం అన్న‌మాట‌. అనుకూల మోడ్‌లలో వెబ్ సమాచారాన్ని వినియోగించడం, ఒకే ప్రాంప్ట్ నుంచి అనేక ఇమేజ్‌లను జ‌న‌రేట్ చేయ‌డం, ఫలితాలను మెరుగుపరచడం వంటి సామర్థ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో ఈ సిస్టమ్ సాధారణ ఇమేజ్ జనరేషన్ మోడ‌ల్ నుండి నిర్మాణాత్మ‌క‌ విజువల్ రీజనింగ్ టూల్‌గా అందుబాటులోకి వ‌చ్చింది.

సూక్ష్మ వివ‌రాల‌ను కూడా..

సూచనలను క‌చ్చితంగా అనుసరించడం ఈ ఇమేజ్ మోడ‌ల్ ప్ర‌త్యేక‌త కాగా క్లిష్టమైన ప్రాంప్ట్‌లను కూడా సరిగ్గా అర్థం చేసుకుని, యూజ‌ర్ అవసరాలు, సూక్ష్మ వివరాలను ఆక‌ళింపు చేసుకుని ఔట్‌పుట్‌ను ఇస్తుంది. అలాగే లేఅవుట్‌లో ఆబ్జెక్ట్స్‌, యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్స్‌ను సరైన స్థానాల్లో అమర్చడంలో మెరుగుదల, చిన్న ఫాంట్లు, లేబుల్స్, టెక్స్ట్‌ను కూడా స్పష్టంగా రూపొందించడం, జపనీస్, కొరియన్, చైనీస్, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో మెరుగైన స్పష్టతతో టెక్స్ట్ రూపొందించ‌డం, ఫోటో రియలిజం, సినిమాటిక్ విజువల్స్, మాంగా, పిక్సెల్ ఆర్ట్, ఇలస్ట్రేషన్ వంటి విభిన్న శైలుల్లో స్థిరమైన అవుట్‌పుట్ ను ఇవ్వ‌డం, బ్యానర్లు, పోస్టర్లు, మొబైల్ లే-అవుట్లు, సోషల్ మీడియా కంటెంట్ కోసం అనుకూలంగా ఇమేజ్‌ల‌ను జ‌న‌రేట్ చేయ‌డం ఈ కొత్త మోడ‌ల్ ప్ర‌త్యేక‌తలుగా ఓపెన్ఏఐ తెలియ‌జేసింది.

అభ్యంత‌ర‌క‌ర కంటెంట్‌కు అడ్డుక‌ట్ట‌..

చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0లో బహుళ స్థాయి భద్రతా వ్యవస్థ అమలులో ఉంది. ప్రాంప్ట్ స్థాయిలో ప్రమాదకర అభ్యర్థనలను నిరోధించడం, అవుట్‌పుట్ స్థాయిలో చిత్రాలను సమీక్షించడం, ఇన్‌పుట్, అవుట్‌పుట్‌లను పర్యవేక్షించే సేఫ్టీ రీజనింగ్ మోడల్ వినియోగం, నిరంతర మూల్యాంకనం ద్వారా భద్రతను మెరుగుపరచడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. ఇవి హానికర లేదా నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌ను తగ్గించేందుకు ప‌నిచేస్తాయి. అయితే అధునాతన ఫీచర్లున్నప్పటికీ కొన్ని పరిమితులు ఇంకా ఉన్నాయి. క్లిష్టమైన ఫిజికల్ లేదా స్టెప్-బేస్డ్ లాజిక్ సన్నివేశాల్లో క‌చ్చితత్వం తగ్గే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా నిండి ఉన్న లేదా పునరావృతమైన విజువల్ నమూనాల్లో అసమానతలు ఉంటాయి. టెక్నికల్ లేబుల్స్, యారో సింబ‌ల్స్‌ లేదా నిర్మిత డయాగ్రామ్స్‌లో కొన్ని తప్పులు జ‌రిగే చాన్స్ ఉంది. దాగి ఉన్న లేదా ఏదైనా ఒక యాంగిల్‌లో ఉన్న వివరాలను సరిగ్గా చూపడంలో సవాళ్లు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. కొన్ని మల్టీలింగ్వల్ లేదా డయాగ్రామ్ ఆధారిత అవుట్‌పుట్‌లను సమీక్షించాల్సిన అవసరం ఏర్ప‌డుతుంది.

ఎలా వాడుకోవ‌చ్చు..

కాగా చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 మోడల్ చాట్ జీపీటీతోపాటు కోడెక్స్‌, ఏపీఐ ద్వారా అందుబాటులో ఉండ‌గా, సాధారణ ఇమేజ్ జనరేషన్ టూల్‌ను యూజ‌ర్లు అంద‌రూ ఉప‌యోగించుకోవచ్చు. అయితే అడ్వాన్స్‌డ్‌ థింకింగ్ ఫీచర్లు మాత్రం ప్లస్, ప్రొ, బిజినెస్ యూజర్లకు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఏపీఐ ద్వారా జీపీటీ-ఇమేజ్-2 రూపంలో యాక్సెస్ ఇచ్చారు. అలాగే ఏపీఐ రుసుమును ఇమేజ్‌ల‌ రిజల్యూషన్, క్వాలిటీ ఆధారంగా వ‌సూలు చేస్తారు. ఇక ఏపీఐ వినియోగించేవారికి 2కె రిజల్యూషన్ వరకు సపోర్ట్ ఇస్తున్నారు.

Advertisement
Advertisement