త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OnePlus N6 | 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ ఎన్‌6 ఫోన్‌.. అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు..

OnePlus N6 | మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ మ‌రో నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. కంపెనీ ముందుగా ప్రకటించినట్లుగానే కొత్త వన్‌ప్లస్ ఎన్6 ఫోన్‌ని ఆవిష్కరించింది. రూ.25 వేల లోపు ధర విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఈ ఫోన్ ఆల్వేస్ ఆన్, ఆల్వేస్ స్మూత్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైంది.

S

Technology | Published On Jun 30, 2026, 1.28 pm IST

OnePlus N6 | 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ ఎన్‌6 ఫోన్‌.. అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు..
Advertisement

OnePlus N6 | మొబైల్స్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ మ‌రో నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. కంపెనీ ముందుగా ప్రకటించినట్లుగానే కొత్త వన్‌ప్లస్ ఎన్6 ఫోన్‌ని ఆవిష్కరించింది. రూ.25 వేల లోపు ధర విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఈ ఫోన్ ఆల్వేస్ ఆన్, ఆల్వేస్ స్మూత్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైంది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, స్థిరమైన పనితీరు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కాగా, ఈ ధర విభాగంలోనే అతిపెద్ద బ్యాటరీని క‌లిగిన ఫోన్ల‌లో ఇది ఒకటిగా నిలిచింది. దీన్ని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా మూడు రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీతో పాటు 45వాట్ల సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించింది. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ సమయంలో విద్యుత్‌ను నేరుగా ఫోన్‌కు అందించడం ద్వారా బ్యాటరీపై భారం తగ్గించి వేడి తగ్గించేలా ఇది పనిచేస్తుంది. అలాగే 5 వాట్ల‌ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్‌తో ఛార్జ్ చేయవచ్చు.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే..

బ్యాటరీ దీర్ఘకాలిక మన్నికపై కూడా వన్‌ప్లస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 1,600 పూర్తి ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80 శాతం కంటే ఎక్కువగా కొనసాగుతుందని తెలిపింది. అంటే సాధారణ వినియోగంలో సుమారు ఏడు సంవత్సరాల పాటు మంచి బ్యాటరీ లైఫ్‌ను అందించేలా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ద్వారా బ్యాటరీ 5 శాతం లేదా 1 శాతానికి పడిపోయినా కాల్స్, నావిగేషన్, స్టాండ్‌బై వంటి కీలక ఫీచర్లు పనిచేస్తాయని పేర్కొంది. ఫోన్ లో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేనిఅందించారు. ఇందులో 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. అలాగే 1,200 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్ సపోర్ట్ ఉండటంతో సూర్య‌కాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్ ను అమర్చారు. దీనికి వీసీ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ హీట్ కు గురికాకుండా ఇది ర‌క్షిస్తుంది. అలాగే ఫోన్‌కు 2 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనున్నారు.

అత్యంత దృఢ‌మైన బిల్డ్ క్వాలిటీ..

మన్నిక విషయంలో కూడా ఈ ఫోన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను పొందింది. మైనస్ 60 డిగ్రీల నుంచి 65 డిగ్రీల వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పరీక్షలు నిర్వహించారు. వర్షం, మంచు, ఇసుక తుఫాన్లు, దుమ్ము, ఉప్పు ప్రభావం వంటి కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా రూపొందించారు. అదేవిధంగా వరుసగా 25 సార్లు గట్టి ఉపరితలంపై పడేసినా తట్టుకునే పరీక్షలను పూర్తి చేసింది. ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా బలమైన మూలలు, ఎయిర్‌బ్యాగ్ కుషనింగ్, గట్టిపడిన గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్‌ను అందించారు. అలాగే ఐపీ65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది. స్పీకర్లలో 400 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్ సపోర్ట్ ఉండటంతో గట్టిగా, స్పష్టమైన ఆడియోను అందిస్తుందని కంపెనీ తెలిపింది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండ‌గా, ముందు వైపు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఆక‌ట్టుకునే ఏఐ ఫీచ‌ర్లు..

ఫోటోగ్రఫీ కోసం పలు ఏఐ ఫీచర్లను ఇచ్చారు. ఏఐ ఎరేజర్ ద్వారా అవసరం లేని వ్యక్తులు లేదా వస్తువులను తొలగించవచ్చు. రోజుకు గరిష్టంగా 400 సార్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఏఐ పర్‌ఫెక్ట్ షాట్ బర్స్‌ట్ ఫోటోలు తీసి కళ్లుమూయని ఉత్తమ ఫ్రేమ్‌ను ఎంపిక చేస్తుంది. ఏఐ అన్‌బ్లర్, రిఫ్లెక్షన్ ఎరేజర్ ద్వారా బ్లర్ అయిన ఫోటోలను స్పష్టంగా మార్చడంతోపాటు గాజు లేదా మెరిసే ఉపరితలాలపై కనిపించే ప్రతిబింబాలను తొలగించవచ్చు. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, డీటెయిల్ బూస్ట్ ఫీచర్లు తక్కువ వెలుతురులో ముఖాన్ని ప్రకాశవంతంగా చూపించి, ఫోటోలను జూమ్ చేసినప్పుడు మెరుగైన క్వాలిటీని ఇస్తాయి. ఈ ఫోన్‌లో 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌ను ఇచ్చారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. సైడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్‌బీ టైప్ సి, వైఫై 6, బ్లూటూత్ 5.4, 5జి తదిత‌ర క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు.

ధ‌ర‌, ఆఫ‌ర్ల వివ‌రాలు..

వ‌న్‌ప్ల‌స్ ఎన్‌6 ఫోన్‌కు చెందిన 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.22,999 ఉండ‌గా, 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. జూలై 4 నుంచి ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌, యాప్ స్టోర్‌, అమెజాన్‌, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించ‌నున్నారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.2వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, ప్రైమ్ డే ప్రత్యేక ఆఫర్‌గా రూ.1వేయి అదనపు తగ్గింపును కంపెనీ ప్రకటించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement