త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram | స్మార్ట్‌వాచ్‌లోనూ టెలిగ్రామ్.. ఏఐ గార్డియన్ బాట్స్‌తో కొత్త అప్‌డేట్..

Telegram | ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ తన తాజా అప్‌డేట్‌లో స్మార్ట్‌వాచ్ యాప్‌లు, బాట్స్‌కు అధునాతన మెసేజింగ్ సామర్థ్యాలు, ఏఐ ఆధారిత గ్రూప్ మోడరేషన్ టూల్స్, అలాగే బ్రౌజర్, లింక్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

S

Technology | Published On Jun 13, 2026, 10.20 am IST

Telegram | స్మార్ట్‌వాచ్‌లోనూ టెలిగ్రామ్.. ఏఐ గార్డియన్ బాట్స్‌తో కొత్త అప్‌డేట్..
Advertisement

Telegram | ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ తన తాజా అప్‌డేట్‌లో స్మార్ట్‌వాచ్ యాప్‌లు, బాట్స్‌కు అధునాతన మెసేజింగ్ సామర్థ్యాలు, ఏఐ ఆధారిత గ్రూప్ మోడరేషన్ టూల్స్, అలాగే బ్రౌజర్, లింక్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌తో యాపిల్ వాచ్‌, వియ‌ర్ ఓఎస్ కోసం ప్రత్యేక టెలిగ్రామ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండానే స్మార్ట్‌వాచ్ నుంచే చాట్స్, మీడియా ఫైళ్లు బ్రౌజ్ చేయవచ్చు. ఎలాంటి పరిమితి లేకుండా దీర్ఘ‌మైన మెసేజీలను చదవడం, వాయిస్ మెసేజీలను వినడం, వీడియోలను చూడడం, అలాగే చేతులు ఖాళీగా లేని పరిస్థితుల్లో టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్‌ల‌ను పంపడం కూడా సాధ్యమవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ వినియోగదారులు చాట్స్‌ను మ్యూట్ చేయడం, పిన్ చేయడం, మెసేజీలను డిలీట్ చేయడం వంటి ఫీచర్లను ఉపయోగించుకోవ‌చ్చు. ఐఓఎస్ వినియోగదారులు లొకేషన్‌లను చూడడం, స్టిక్కర్లు పంపడం వంటి అదనపు సదుపాయాలను పొందుతారు. వేర్ ఓఎస్ యాప్‌కు మద్దతు లేని హువావే వాచ్‌ల కోసం భవిష్యత్తులో ప్రత్యేక ఫీచ‌ర్ల‌ను అభివృద్ధి చేసే అవకాశముందని టెలిగ్రామ్ వెల్లడించింది.

బాట్స్‌కు కీల‌క అప్‌డేట్స్‌..

బాట్స్‌కు కూడా ఈ అప్‌డేట్‌లో కీలకమైన అప్‌డేట్స్‌ వచ్చాయి. ఇకపై బాట్స్ అధునాతన రిచ్ టెక్స్ట్ ఫార్మాటింగ్‌తో స్పందిస్తాయి. టేబుల్స్, బ్లాక్‌కోట్స్, చెక్‌లిస్టులు, ఇన్‌లైన్ ఇమేజ్‌లు, విస్తృత ఫార్మాటింగ్ ఎంపికలు వంటి అంశాలను సపోర్ట్ చేస్తాయి. ఒక్క మెసేజ్‌లో గరిష్టంగా 32,768 అక్షరాల వరకు సమాచారాన్ని పంపవచ్చు. మొదటి సుమారు 8వేల‌ అక్షరాల తర్వాత షో మోర్ బటన్ ద్వారా మిగిలిన కంటెంట్‌ను చూడవచ్చు. గ్రూప్ చాట్స్ కోసం టెలిగ్రామ్ ఏఐ గార్డియన్ బాట్స్‌ను కూడా పరిచయం చేసింది. వీటిని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లుగా నియమించవచ్చు. ఈ బాట్స్ జాయిన్ రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేయడం, ముందుగా నిర్ణయించిన నియమాల ఆధారంగా సభ్యులను ఆమోదించడం లేదా తిరస్కరించడం, చర్చలను పర్యవేక్షించడం, అవసరమైతే సందేశాలను తొలగించడం వంటి పనులు నిర్వహిస్తాయి. కొత్త సభ్యులను గ్రూప్‌లోకి అనుమతించే ముందు మినీ యాప్ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా స్క్రీనింగ్ చేసే సామర్థ్యాన్ని కూడా అందిస్తున్నాయి.

మార్క్ డౌన్ ఫైల్స్‌కు స‌పోర్ట్‌..

పోల్స్ ఫీచర్‌లో కూడా మార్పులు వచ్చాయి. ఇకపై పోల్ ఆప్షన్‌లలో క్లిక్ చేయగ‌లిగే లింక్‌లను యాడ్ చేసుకోవ‌చ్చు. దీంతో ఓటింగ్ ఆప్ష‌న్ల‌తోపాటు అదనపు సమాచారం లేదా బాహ్య రిఫరెన్స్‌లను నేరుగా వినియోగదారులకు అందించవచ్చు. ఇన్-యాప్ బ్రౌజర్‌లో మార్క్‌డౌన్ (.md) ఫైళ్లకు స‌పోర్ట్ ఇచ్చారు. దీని వ‌ల్ల వినియోగదారులు ప్రత్యేక యాప్ అవసరం లేకుండా టెలిగ్రామ్‌లోనే మార్క్‌డౌన్ డాక్యుమెంట్లను తెరిచి చూడవచ్చు. లింక్ హ్యాండ్లింగ్‌కు సంబంధించి కూడా కొత్త నియంత్రణలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు లింక్‌లను టెలిగ్రామ్ బ్రౌజర్‌లో తెరవాలా లేదా బాహ్య యాప్‌లలో తెరవాలా అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవచ్చు. లింక్‌పై లాంగ్-ప్రెస్ చేసి డిఫాల్ట్ బ్రౌజర్‌కు భిన్నమైన బ్రౌజర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వెబ్‌సైట్‌లను ఎల్లప్పుడూ టెలిగ్రామ్ బ్రౌజర్‌లోనే లేదా ఎప్పుడూ తెరవకుండా వైట్‌లిస్ట్ చేయవచ్చు.

ఏం చేయాలి..

టెలిగ్రామ్ బ్రౌజర్ బ్రౌజింగ్ హిస్టరీని నిల్వ చేయదని సంస్థ పేర్కొంది. దీంతో కోర్స్ రీసెర్చ్, హోమ్‌వర్క్ అసైన్‌మెంట్స్ వంటి వ్యక్తిగత బ్రౌజింగ్ సెషన్‌లు రికార్డ్ కాకుండా గోప్యత మెరుగుపడుతుందని తెలిపింది. ఈ సెట్టింగ్‌లను ఆండ్రాయిడ్‌లో సెట్టింగ్స్ > చాట్ సెట్టింగ్స్ > ఇన్-యాప్ బ్రౌజర్ విభాగంలో, ఐఓఎస్‌లో సెట్టింగ్స్ > ప్రైవసీ అండ్ సెక్యూరిటీ > ఓపెన్ లింక్స్ ఇన్ విభాగంలో మార్చుకోవ‌చ్చు. టెలిగ్రామ్ వెర్షన్ 12.8.0 లేదా ఆపైన వెర్ష‌న్‌ల‌ను వాడుతున్న యూజ‌ర్లు త‌మ యాప్ ల‌ను కొత్త అప్ డేట్‌కు మార్చుకోవడం ద్వారా ఈ ఫీచ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement