Model Schools | మోడల్ స్కూల్ సమస్యలకు మోక్షమెప్పుడు?
Model Schools | తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తూ, రాష్ట్ర విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు 13 ఏళ్లు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు.
13 ఏళ్లుగా సేవలందిస్తున్నా తీరని కష్టాలు..
తక్షణ పరిష్కారానికి ఎంఎస్-జాక్ 15 రోజుల అల్టిమేటం
నవంబర్ 17న రాష్ట్రస్థాయి ముట్టడికి సమరశంఖం
Model Schools | తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తూ, రాష్ట్ర విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు 13 ఏళ్లు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. సర్వీస్, ఆర్థిక, సంక్షేమ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఐక్య పోరాటానికి సిద్ధమయ్యారు. ఐదు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో కూడిన 'మోడల్ స్కూల్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ' (ఎంఎస్-జాక్) ప్రభుత్వానికి 15 రోజుల గడువుతో కూడిన నోటీసును అందజేసింది. గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త దశలవారీ నిరసనలతో పాటు నవంబర్ 17న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించింది.
ప్రభుత్వాలు మారుతున్నా.. మారని ఉద్యోగుల తలరాత
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన మోడల్ స్కూళ్లలో సుమారు 3,000 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు అనేకమంది అవుట్ సోర్సింగ్, గంటల ప్రాతిపదికన పనిచేసే సిబ్బంది సేవలందిస్తున్నారు. అయితే, విద్యా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఈ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం నేటికీ కనీస సర్వీస్ భద్రత, సకాలంలో ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రధాన డిమాండ్లు ఇవే:
పాఠశాల విద్యాశాఖలో విలీనం :
మోడల్ స్కూళ్లను వెంటనే పాఠశాల విద్యాశాఖలో పూర్తిస్థాయిలో విలీనం చేసి, ఉద్యోగులందరికీ '010 హెడ్ ఆఫ్ అకౌంట్' (010 పద్దు) ద్వారా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా వేతనాలు చెల్లించాలి.
కారుణ్య నియామకాలు – ఆర్థిక భద్రత:
సర్వీసులో ఉండగా మరణించిన 40 మందికి పైగా ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి. సీపీఎస్ మరణానంతర గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్, ఇతర టెర్మినల్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.
టీజీటీలకు నోషనల్ సర్వీస్:
ప్రిన్సిపాళ్లు, పీజీటీలకు కల్పించినట్లే, టీజీటీలందరికీ జూన్ 2013 నుండి నోషనల్ సర్వీస్ ప్రయోజనం కల్పించి సీనియారిటీ, ప్రమోషన్లలో న్యాయం చేయాలి.
డీఏ, సీపీఎస్ బకాయిల చెల్లింపు:
పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) బకాయిలను, ప్రభుత్వం చెల్లించాల్సిన సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ మొత్తాన్ని తక్షణమే జమ చేయాలి. మ్యాచింగ్ గ్రాంట్ విడుదలలో సాంకేతిక అడ్డంకులు ఉంటే ఉద్యోగుల వాటాను వారికే వెనక్కి ఇవ్వాలి.
ఈహెచ్ఎస్ సౌకర్యం:
ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్య సేవలందించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) వర్తింపజేయాలి.
317 మార్గదర్శకాల అమలు – ప్రమోషన్లు:
317 మార్గదర్శకాలను పారదర్శకంగా అమలు చేసి టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాళ్లకు రావలసిన ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రిన్సిపాళ్లకు ఉన్నతస్థాయి ప్రమోషన్ ఛానెల్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల కేటాయింపు:
ఇంటర్మీడియట్ తరగతులకు బోధిస్తున్న పీజీటీలకు తగినట్లుగా మోడల్ స్కూళ్లలో జూనియర్ లెక్చరర్ పోస్టులను సృష్టించి పదోన్నతులు కల్పించాలి.
హిందీ పీజీటీ పోస్టుల మంజూరు:
పాఠశాలల్లో అవసరమైన హిందీ పీజీటీ పోస్టులను మంజూరు చేసి, అర్హులైన హిందీ టీజీటీలకు పదోన్నతులు ఇవ్వాలి.
ఖాళీల భర్తీ – జూనియర్ అసిస్టెంట్ పోస్టులు:
అన్ని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి మోడల్ స్కూల్‌కు ఒక రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టును మంజూరు చేయాలి.
సైన్స్ ఉపాధ్యాయుల పనిభారం తగ్గింపు:
టీజీటీ, పీజీటీ సైన్స్ ఉపాధ్యాయులపై ఉన్న తీవ్రమైన అదనపు పనిభారాన్ని సమీక్షించి సబ్జెక్టుల వారీగా కొత్త పోస్టులను మంజూరు చేయాలి.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ:
ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ లేదా విలీనం చేయాలి.
గంటల ప్రాతిపదిక ఉపాధ్యాయులకు కనీస వేతనం:
అవర్లీ బేసిస్ టీచర్లకు (హెచ్‌బీటీ) నెలకు కనీస వేతనంగా రూ. 35,000 చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలి.
ఎంఎస్-జాక్ దశలవారీ ఉద్యమ కార్యాచరణ ఇలా..
- అక్టోబర్ 30, 31న పాఠశాల స్థాయి పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన.
- నవంబర్ 02, 03న మండల స్థాయి స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలకు వినతిపత్రాల సమర్పణ.
- నవంబర్ 04, 05, 06 తేదీల్లో జిల్లా స్థాయి జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్లకు సమస్యలపై వినతిపత్రాల సమర్పణ.
- నవంబర్ 10, 11, 12 తేదీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేయడం.
- నవంబర్ 17న హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా/ముట్టడి కార్యక్రమం.
ప్రభుత్వం స్పందించకుంటే పోరు ఉధృతం
"మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కోరుకుంటున్నది న్యాయమైన హక్కులు మాత్రమే. ఉపాధ్యాయులు మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చలు జరపాలి. ఇచ్చిన 15 రోజుల గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం" అని మోడల్ స్కూల్ ఉద్యోగ సంఘాలు (పీఎంటీఏ, టీఎంఎస్‌టీఎఫ్, టీఎంఎస్‌టీఏ, టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్, ఎంఎస్‌టీయూ) హెచ్చరించారు.

JAC స్టీరింగ్ కమిటీ మెంబర్ తరాల జగదీష్
(PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు)
తాజావార్తలు
- ●Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం
- ●Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ
- ●Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్
- ●One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!
- ●The Traitors Telugu | ది ట్రైటర్స్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరంటే? - ఇద్దరికి దక్కిన ప్రైజ్‌మనీ
- ●GP's Income | గ్రామపంచాయతీల ఖాతాల్లోకే సొంత ఆదాయం!

Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం

Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ

Anaswara Rajan | చిరంజీవి, రవితేజ సినిమాల్లో ఆఫర్స్ - మలయాళ బ్యూటీ రియాక్షన్

One-Way | లక్డీకాపూల్‌లో కొత్తగా వన్‌వే!






