త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..

Meta | మెటా సంస్థ స్టైల్ స్కెచ్ పేరుతో కొత్త ఏఐ ఆధారిత ఫ్యాషన్ యాప్‌ను తీసుకొచ్చింది. వినియోగదారుల దగ్గర ఇప్పటికే ఉన్న దుస్తులతోనే కొత్త కాంబినేషన్లను సూచించడం, వర్చువల్ ట్రై-ఆన్, రోజువారీ ఫ్యాషన్ ప్లానింగ్, ప్రయాణాల కోసం దుస్తుల ఎంపిక వంటి ఫీచర్లను ఇందులో అందిస్తోంది.

S

Technology | Published On Oct 30, 2026, 4.34 pm IST

Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..
Advertisement

Meta | మెటా సంస్థ స్టైల్ స్కెచ్ పేరుతో కొత్త ఏఐ ఆధారిత ఫ్యాషన్ యాప్‌ను తీసుకొచ్చింది. వినియోగదారుల దగ్గర ఇప్పటికే ఉన్న దుస్తులతోనే కొత్త కాంబినేషన్లను సూచించడం, వర్చువల్ ట్రై-ఆన్, రోజువారీ ఫ్యాషన్ ప్లానింగ్, ప్రయాణాల కోసం దుస్తుల ఎంపిక వంటి ఫీచర్లను ఇందులో అందిస్తోంది.

ఉన్న దుస్తుల‌తోనే కొత్త లుక్‌..

కొత్త దుస్తులు కొనకుండానే ఉన్న దుస్తులతో విభిన్న ఫ్యాషన్ లుక్స్ ప్రయత్నించాలనుకునే వారి కోసం మెటా సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టైల్ స్కెచ్ పేరుతో రూపొందించిన ఈ ఏఐ ఆధారిత యాప్ వినియోగదారుల వార్డ్‌రోబ్‌లో ఉన్న దుస్తులను విశ్లేషించి, వారి వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా కొత్త ఔట్‌ఫిట్ కాంబినేషన్లను సూచిస్తుంది. సోషల్ మీడియా కన్సల్టెంట్ మ్యాట్ నవారా తొలిసారిగా ఈ యాప్ గురించి వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఖాతాలను అనుసంధానం చేయడం ద్వారా గతంలో షేర్ చేసిన ఫొటోల నుంచి డిజిటల్ వార్డ్‌రోబ్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే దుస్తుల ఫొటోలు తీయడం, చిన్న వీడియోలు రికార్డు చేయడం లేదా ఫోన్ గ్యాలరీ నుంచి చిత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా దుస్తులను జోడించవచ్చు.

యాప్ ద్వారా సూచ‌న‌లు..

ఈ యాప్‌లో ఏఐ ఆధారిత ఔట్‌ఫిట్ సూచనలు, వర్చువల్ ట్రై-ఆన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల శరీరాకృతి, చర్మపు రంగుకు సరిపోయే వర్చువల్ మోడల్‌పై సూచించిన దుస్తులను ధరించినట్లుగా చూడవచ్చు. ఒక జాకెట్ లేదా షూ వంటి ప్రత్యేకమైన దుస్తుల‌ను ఎంచుకుంటే, దానికి సరిపోయే ఇతర దుస్తుల కాంబినేషన్లను కూడా ఏఐ సూచిస్తుంది. అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతిరోజూ ఏ దుస్తులు ధరించాలో సలహాలు ఇస్తుంది. ప్రయాణాల సమయంలో గమ్యస్థానం, పర్యటన రోజుల సంఖ్య, చేయబోయే కార్యకలాపాలు, వాతావరణ అంచనాలను పరిగణనలోకి తీసుకుని రోజువారీ దుస్తుల ప్రణాళికను రూపొందిస్తుంది. ఫ్యాషన్ ట్రెండ్స్, కొత్త లుక్స్‌ను పరిశీలించడంతోపాటు వాటిని తమ దగ్గరున్న దుస్తులతో ఎలా పునఃసృష్టించుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఎంచుకున్న ఔట్‌ఫిట్‌లను స్నేహితులతో షేర్ చేసి వారి అభిప్రాయాలను కూడా పొందవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానం చేస్తే..

ఇన్‌స్టాగ్రామ్ అనుసంధానం ద్వారా గతంలో షేర్ చేసిన ఫొటోలతోనే డిజిటల్ వార్డ్‌రోబ్ తయారవడం ఈ యాప్‌లో ప్రధాన ప్రత్యేకత. దీనివల్ల దుస్తుల‌ను విడివిడిగా జోడించాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆల్టా వంటి ఏఐ వార్డ్‌రోబ్, ఔట్‌ఫిట్ ప్లానింగ్ యాప్‌లకు ఇది పోటీగా నిలవనుంది. గూగుల్ ఫొటోస్‌లో కూడా దుస్తుల ఫొటోల ఆధారంగా డిజిటల్ వార్డ్‌రోబ్, ఫ్యాషన్ ఐడియాలను రూపొందించే సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం స్టైల్ స్కెచ్ యాప్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల్లో మాత్రమే ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇంకా విడుదల కాలేదు. ఇతర దేశాలకు విస్తరించే విషయంపై మెటా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ట్యాగ్స్:

AI Fashion AppAI StylingDigital WardrobeMetaOutfit PlannerStyle SketchVirtual Try On
Advertisement
Advertisement