త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్‌న‌గ‌ర్‌లో 168 మెగావాట్ల డేటా సెంట‌ర్ ఏర్పాటు..

Meta And Reliance | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ భారత్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్‌ను లీజుకు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్‌ను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ నిర్మించనుంది. బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఈ సదుపాయాన్ని నిర్మించి, రెండేళ్లలో మెటాకు అందజేయనుంది.

S

Technology | Published On Jun 10, 2026, 5.19 pm IST

Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్‌న‌గ‌ర్‌లో 168 మెగావాట్ల డేటా సెంట‌ర్ ఏర్పాటు..
Advertisement

Meta And Reliance | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ భారత్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్‌ను లీజుకు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్‌ను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ నిర్మించనుంది. బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఈ సదుపాయాన్ని నిర్మించి, రెండేళ్లలో మెటాకు అందజేయనుంది. అవసరానికి అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రపంచ స్థాయి డేటా సెంటర్ గుజరాత్‌లోని జామ్ న‌గ‌ర్ లో ఏర్పాటు కానుంది. మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకెర్‌బ‌ర్గ్ మాట్లాడుతూ, జామ్‌నగర్‌లోని ఈ అత్యాధునిక సదుపాయం త‌మ‌ గ్లోబల్ ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు తోడ్పడటంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థలో త‌మ‌ దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంద‌ని తెలిపారు.

సంయుక్తంగా ముందుకు..

రిలయన్స్-మెటా భాగస్వామ్యం 2020లో ప్రారంభమైంది. అప్పట్లో మెటా, రిలయన్స్‌కు చెందిన డిజిటల్ సేవలు, టెలికాం వ్యాపార సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లో 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనంతరం గతేడాది ఇరు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి, భారతీయ సంస్థలు, డెవలపర్లకు మెటా ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చే సంయుక్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ ఈ తాజా పెట్టుబడిని భారత డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కీల‌క‌ ఘట్టంగా అభివర్ణించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైపర్‌స్కేలర్ సంస్థలు భారత డేటా సెంటర్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గతేడాదిలో భారత ఏఐ ఎకోసిస్టమ్‌లో సుమారు 400 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించగా, వాటిలో అధిక భాగం డేటా సెంటర్లు, వాటికి అవసరమైన ఇంధన మౌలిక సదుపాయాలకే వెళ్లినట్లు సమాచారం.

7 గిగావాట్ల‌కు భార‌త మార్కెట్‌..

ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ నోముర‌ల్ జూన్ 2న విడుదల చేసిన నివేదికలో భారత డేటా సెంటర్ పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా మారుతోందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం 2030 నాటికి 7 గిగావాట్లకు చేరుకునే అవకాశముందని, ఇతర అభివృద్ధి చెందిన ఆసియా-పసిఫిక్, పాశ్చాత్య మార్కెట్లతో పోలిస్తే భారత్ తక్కువ వ్యయంతో సేవలు అందించే దేశంగా నిలుస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రభుత్వం, దేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి ప్రపంచ వినియోగదారులకు సేవలు అందించే హైపర్‌స్కేలర్ సంస్థలకు 20 సంవత్సరాల పన్ను మినహాయింపును ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీల ఆసక్తి మరింత పెరిగింది.

పున‌రుత్పాద‌క విద్యుత్‌తోనే..

కాగా మెటా, స్వచ్ఛ ఇంధన రంగంలోని క్లీన్ మ్యాక్స్‌, ఫోర్త్ పార్ట్‌న‌ర్ సంస్థలతో కలిసి దాదాపు 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను కూడా చేపడుతోంది. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులు దేశంలో మెటా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలకు స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించనున్నాయి. తమ కార్యకలాపాలన్నింటినీ 100 శాతం పునరుత్పాదక, స్వచ్ఛ ఇంధనంతో నడపాలనే గ్లోబల్ లక్ష్యానికి అనుగుణంగానే ఈ పెట్టుబడులు కొనసాగుతున్నాయని మెటా స్పష్టం చేసింది.

Advertisement
Advertisement