త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | ఫేస్‌బుక్ క్రియేటర్లకు మెటా ఏఐ గిఫ్ట్.. కొత్త క్రియేటర్ అసిస్టెంట్ తో సక్సెస్ రహస్యాలు మీ చేతిలో..

Meta | వీడియో కంటెంట్ ప్రపంచంలో క్రియేటర్లకు మరింత సహాయపడేందుకు మెటా కొత్తగా క్రియేటర్ అసిస్టెంట్ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ప్రకటించింది. ఫేస్‌బుక్‌లోని ప్రొఫెషనల్ డ్యాష్‌బోర్డ్ లో అందుబాటులోకి వస్తున్న ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్ పనితీరు, ఆడియన్స్ ప్రవర్తన, ఎంగేజ్‌మెంట్ ట్రెండ్స్, గ్రోత్ అవకాశాలపై లోతైన విశ్లేషణలను పొందవచ్చు.

S

Technology | Published On Jun 6, 2026, 1.06 pm IST

Meta | ఫేస్‌బుక్ క్రియేటర్లకు మెటా ఏఐ గిఫ్ట్.. కొత్త క్రియేటర్ అసిస్టెంట్ తో సక్సెస్ రహస్యాలు మీ చేతిలో..
Advertisement

Meta | వీడియో కంటెంట్ ప్రపంచంలో క్రియేటర్లకు మరింత సహాయపడేందుకు మెటా కొత్తగా క్రియేటర్ అసిస్టెంట్ అనే ఏఐ ఆధారిత టూల్‌ను ప్రకటించింది. ఫేస్‌బుక్‌లోని ప్రొఫెషనల్ డ్యాష్‌బోర్డ్ లో అందుబాటులోకి వస్తున్న ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్ పనితీరు, ఆడియన్స్ ప్రవర్తన, ఎంగేజ్‌మెంట్ ట్రెండ్స్, గ్రోత్ అవకాశాలపై లోతైన విశ్లేషణలను పొందవచ్చు. మెటా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏఐ టూల్ క్రియేటర్ ఫేస్‌బుక్ ప్రెజెన్స్‌ను విశ్లేషించి వ్యక్తిగతీకరించిన సూచనలు అందిస్తుంది. ఏ రీల్ ఎందుకు ఎక్కువగా వైరల్ అయింది, ప్రేక్షకుల ప్రవర్తన కాలక్రమేణా ఎలా మారింది, భవిష్యత్తులో ఏ తరహా కంటెంట్ మంచి ఫలితాలు ఇవ్వగలదనే అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. సాధారణ డేటా మాత్రమే కాకుండా కంటెంట్ విజయానికి కారణమైన అంశాలను కూడా వివరిస్తుంది. ఉదాహరణకు కంటెంట్ ఫార్మాట్, పోస్ట్ చేసిన సమయం, ప్రేక్షకుల వీక్షణ అలవాట్లు, ఎంగేజ్‌మెంట్ ప్యాటర్న్స్ వంటి అంశాలను విశ్లేషించి ఫలితాల వెనుక ఉన్న కారణాలను వివరిస్తుంది.

ట్రెండింగ్ అంశాల‌పై సూచ‌న‌లు..

అంతేకాదు, క్రియేటర్లకు కొత్త కంటెంట్ ఐడియాలు, క్రియేటివ్ యాంగిల్స్, ప్రత్యామ్నాయ ఫార్మాట్లు, ప్రేక్షకుల ఆసక్తులకు అనుగుణమైన టాపిక్ సూచనలు, ఫేస్‌బుక్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అంశాల ఆధారంగా ప్రేరణాత్మక సలహాలను కూడా అందిస్తుంది. క్రియేటర్లు తమ ప్రశ్నలతోపాటు నిర్దిష్ట పోస్ట్‌ల‌ను కూడా జతచేయవచ్చు. దీంతో ఆ పోస్టు పనితీరు ఆధారంగా కంటెంట్‌కు సంబంధించిన ప్రత్యేక సూచనలు, మెరుగుదల అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ టూల్ క్రియేటర్ లక్ష్యాలకు అనుగుణంగా తన సిఫార్సులను మార్చుకుంటుంది. ఆడియన్స్ గ్రోత్, ఎక్కువ ఎంగేజ్‌మెంట్, మెరుగైన కంటెంట్ పనితీరు లేదా మానిటైజేషన్ అవకాశాలు వంటి లక్ష్యాల ఆధారంగా సూచనలు ఇస్తుంది. క్రియేటర్ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి కాలక్రమేణా తన సలహాలను మరింత మెరుగుపరుచుకుంటుందని మెటా వెల్లడించింది.

రీల్స్ ట్రాన్స్‌లేష‌న్‌కు మ‌రిన్ని మెరుగులు..

కాగా మెటా తన ఏఐ ఆధారిత రీల్స్ ట్రాన్స్‌లేషన్ సాంకేతికతను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రతి వారం 50 కోట్లకు పైగా ఫేస్‌బుక్ వినియోగదారులు ఏఐ ద్వారా అనువదించిన‌ వీడియోలను చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది. క్రియేటర్ అసలు వాయిస్, మాట్లాడే శైలిని సాధ్యమైనంతవరకు అలాగే ఉంచుతూ మరో భాషలోకి అనువదిస్తుంది. అలాగే అనువదించిన మాటలకు అనుగుణంగా పెదవుల కదలికలను సరిపోల్చే ఏఐ లిప్-సింకింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే 9 భాషలకు మద్దతు ఉన్న ఈ వ్యవస్థలో త్వరలో మరో 5 భాషలు చేరనున్నాయి. అరబిక్, బహాసా ఇండోనేషియన్, ఫ్రెంచ్, థాయ్, వియత్నామీస్ భాష‌ల‌కు స‌పోర్ట్‌ను ఇవ్వ‌నున్నారు. ఈ విస్తరణతో క్రియేటర్లు వేర్వేరు భాషల్లో ప్రత్యేక వీడియోలు తయారు చేయాల్సిన అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ‌ ఆడియన్స్‌ను చేరుకునే అవకాశం పొందుతారు.

ఎవ‌రికి అందుబాటులో ఉంది..

క్రియేటర్ అసిస్టెంట్ ప్రస్తుతం భారత్‌, అమెరికా, కెనడాలో అర్హత కలిగిన క్రియేటర్లకు ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లోని ప్రొఫెషనల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. యాప్‌లో తమ డ్యాష్‌బోర్డ్‌ను ఓపెన్ చేసి ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో క్రియేటర్లు తనిఖీ చేసుకోవచ్చు. రాబోయే నెలల్లో మరిన్ని దేశాలు, మరిన్ని క్రియేటర్లకు ఈ సేవను విస్తరించనున్నట్లు మెటా తెలిపింది. భవిష్యత్తులో కేవలం సూచనలకే పరిమితం కాకుండా, ఏఐ ఇచ్చే సలహాల ఆధారంగా నేరుగా చర్యలు తీసుకునే కొత్త సామర్థ్యాలను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.

Advertisement
Advertisement