Lithium Ion Battery Apps | లిథియమ్-అయాన్ బ్యాటరీ యాప్‌ల దుర్వినియోగం.. చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం..
Lithium Ion Battery Apps | చైనాకు చెందిన మొబైల్ యాప్‌లను దుర్వినియోగం చేసి ఢిల్లీలో ఈ-రిక్షాలను రోడ్డు మధ్యలోనే నిలిపివేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Technology | Published On Jul 3, 2026, 2.04 pm IST
Lithium Ion Battery Apps | చైనాకు చెందిన మొబైల్ యాప్‌లను దుర్వినియోగం చేసి ఢిల్లీలో ఈ-రిక్షాలను రోడ్డు మధ్యలోనే నిలిపివేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బ్యాట్ బీఎంఎస్ (BAT BMS), ఎపోచ్ లి-అయాన్ (Epoch Li-ion) అనే రెండు మొబైల్ అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ రెండు యాప్‌లను లిథియమ్-అయాన్ బ్యాటరీల నిర్వహణ కోసం రూపొందించారు. ఇవి బ్యాటరీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌లు కాగా బ్లూటూత్ ద్వారా బ్యాటరీకి కనెక్ట్ అయి బ్యాటరీ పనితీరు, వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను పర్యవేక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే వీటిలో ఉన్న రిమోట్ కంట్రోల్ ఫీచర్‌ను కొందరు ఆకతాయిలు దుర్వినియోగం చేస్తూ ప్రయాణంలో ఉన్న ఈ-రిక్షాలను ఒక్కసారిగా నిలిపివేస్తున్నట్లు గుర్తించారు.
ఎలా చేస్తారు..
ఈ వ్యవహారంపై స్పందించిన భారత ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడుతూ ఈ రెండు యాప్‌లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే వాటిని యాప్ స్టోర్‌ల నుంచి తొలగించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు హాని కలిగించే అవకాశం ఉన్న ఇటువంటి అప్లికేషన్‌లు భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రాకుండా యాప్ స్టోర్‌లతో కలిసి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సీఐఐ సైబర్ సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ప్రాంక్ నిర్వహించే విధానం చాలా సులభంగా ఉండటంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా మొబైల్‌లో యాప్‌ను తెరిచి, సమీపంలోని లిథియమ్-అయాన్ బ్యాటరీకి బ్లూటూత్ ద్వారా దుండగులు కనెక్ట్ అవుతారు. అనంతరం డిశ్చార్జ్ స్విచ్‌ను ఆన్ చేస్తే వాహనం వెంటనే ఆగిపోతుంది. దీంతో డ్రైవర్‌కు ఏం జరిగిందో అర్థంకాక రోడ్డుపైనే నిలిచిపోవాల్సి వస్తుంది. అదే యాప్ ద్వారా మళ్లీ బ్యాటరీని ఆన్ చేసిన తర్వాతే ఈ-రిక్షా తిరిగి స్టార్ట్ అవుతుంది.
సెక్యూరిటీ ఉండాలి..
ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ఈ యాప్‌ల అసలు ఉద్దేశం బ్యాటరీ పనితీరును పర్యవేక్షించడమే అయినప్పటికీ, భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల వీటి నియంత్రణ ఫీచర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా బ్యాటరీని నియంత్రించే ఫంక్షన్‌కు ఎలాంటి పాస్‌వర్డ్ లేదా అదనపు ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో ఎవరైనా సులభంగా పవర్ అవుట్‌పుట్‌ను నిలిపివేసి వాహనాన్ని ఆపగలుగుతున్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలో బలమైన భద్రతా ప్రమాణాలు, పాస్‌వర్డ్ రక్షణ, వినియోగదారుల ధ్రువీకరణ వంటి ఫీచర్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు
- ●CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు
- ●Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..
- ●Arvind Dharmapuri | సీఎం తమ్ముడు చెప్పిండని.. నాపైన ఏసీపీతో నిఘా పెట్టించిండ్రు
- ●CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి

Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు

Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..






