త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Bus for Women | మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. ఏ రాష్ట్రంలో ఎలా అమ‌లు చేస్తున్నారంటే?

Free Bus for Women | ఇటీవ‌ల కాలంలో అత్యంత విజ‌య‌వంత‌మైన, ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో నిలుస్తున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో మ‌హిళ‌లకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం (Free Bus for Women) ఒక‌టి. ప్ర‌జా ర‌వాణాను బ‌లోపేతం చేయ‌డానికి, ప్ర‌జ‌ల‌ను ప్ర‌జా ర‌వాణావైపు మ‌ళ్లించ‌డానికి, మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంభ‌న‌కు, సాధికారతకు తోప్ప‌డ‌డానికి ప్ర‌భుత్వాలు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాయి.

G

National | Published On Jun 26, 2026, 7.27 am IST

Free Bus for Women | మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. ఏ రాష్ట్రంలో ఎలా అమ‌లు చేస్తున్నారంటే?
Advertisement

Free Bus for Women | త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల కాలంలో అత్యంత విజ‌య‌వంత‌మైన, ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో నిలుస్తున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో మ‌హిళ‌లకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం (Free Bus for Women) ఒక‌టి. ప్ర‌జా ర‌వాణాను బ‌లోపేతం చేయ‌డానికి, ప్ర‌జ‌ల‌ను ప్ర‌జా ర‌వాణావైపు మ‌ళ్లించ‌డానికి, మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంభ‌న‌కు, సాధికారతకు తోప్ప‌డ‌డానికి ప్ర‌భుత్వాలు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నాయి. తొలుత ఢిల్లీలో (Delhi) ప్ర‌వేశ పెట్టిన ఈ ప‌థ‌కం క్ర‌మంగా దేశ‌వ్యాప్తంగా ఆద‌రణ చూర‌గొన్న‌ది. ప్ర‌స్తుతం 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆర్టీసీ బ‌స్సుల్లో (RTC Bus) మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం విజ‌య‌వంతంగా అమ‌ల‌వుతున్న‌ది. ద‌క్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో మ‌హిళామ‌ణులు ఈ సౌక‌ర్యాన్ని పొందుతున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ దాదాపు ఒకే విధంగా అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికీ, చిన్న‌చిన్న తేడాలు మాత్ర‌మే ఉన్నాయి. అస‌లు ఏయే రాష్ట్రాల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అమ‌ల్లో ఉంది, ఎలాంటి తేడాలు ఉన్నాయో ఒక‌సారి చూద్దాం..

ఢిల్లీ..

కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న ఢిల్లీలో (Delhi) తొలుత ఈ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చింది. 2019, అక్టోబ‌ర్‌లో అప్ప‌టి సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్ర‌భుత్వం దేశంలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం సౌక‌ర్యం క‌ల్పించింది. బ‌స్సులో ఎక్క‌గానే మ‌హిళ‌ల‌కు పింక్ టికెట్ ఇస్తారు. అయితే మ‌హిళ‌ల‌కు ఆ రాష్ట్రానికి చెందిన‌వారై ఉండాలి. స్థానిక గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రిగా సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. ఈ ప‌థ‌కాన్ని మ‌రింత సౌక‌ర్యంగా మార్చ‌డానికి 2025 మార్చిలో `పింక్ స‌హేలి స్మార్ట్ కార్డ్‌`ను ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో ప్ర‌భుత్వ గుర్తింపు కార్డుతో ప‌నిలేకుండా బ‌స్సుల్లో ఈ కార్డును చూపిస్తే స‌రిపోతుంది. ఢిల్లీలో మ‌హిళ‌ల‌తో పాటు ట్రాన్స్ జెండ‌ర్ల‌కు కూడా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌ల్లో ఉంది.

పంజాబ్‌

ఢిల్లీ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కాన్ని పంజాబ్ (Punjab) కూడా ప్రారంభించింది. 2021 ఏప్రిల్ 2న నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో నివసించే మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. పంజాబ్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (PRTC), పంజాబ్ రోడ్‌వేస్ (PUNBUS), స్థానిక సంస్థలు నడిపే నగర బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

విడియ‌ల్ ప‌య‌ణం

ఢిల్లీ, పంజాబ్‌ త‌ర్వాత ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మూడో రాష్ట్రం త‌మిళ‌నాడు (Tamil Nadu). 2021, మే 7న‌ అప్ప‌టి డీఎంకే (DMK) ప్ర‌భుత్వం `విడియల్ పయణం` (Vidiyal Payanam) పేరుతో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్నిప్రారంభించింది. మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TNSTC), మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) పరిధిలోని ఆర్డినరీ (Ordinary) బస్సుల్లో డ‌బ్బులు చెల్లించ‌కుండానే కండక్టర్ వ‌ద్ద `జీరో వాల్యూ` (Zero-value) టికెట్ తీసుకొని ప్ర‌యాణించ‌వ‌చ్చు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌థ‌కం కింద 682.02 కోట్ల మంది ఉంచితంగా ప్ర‌యాణించార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇందులో ట్రాన్స్‌జండ‌ర్లు 36.89 ల‌క్ష‌ల సార్లు, దివ్యాంగులు 3.78 కోట్ల మంది ప్ర‌యాణించార‌ని తెలిపింది. దీనివ‌ల్ల మ‌హిళ‌లు ప్ర‌తినెల రూ.888 ఆదా చేసుకోగ‌లుగుతున్నార‌ని చెప్పింది. ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌ల సంఖ్య 40 నుంచి 70 శాతానికి పెరిగింద‌ని వెల్ల‌డించింది.

శ‌క్తి స్కీమ్‌..

మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్న రాష్ట్రాలో జాబితాలో క‌ర్ణాట‌క (Karnataka) కూడా చేరింది. 2023, జూన్ 11న శ‌క్తి స్కీమ్ (Shakti Scheme) పేరుతో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. KSRTC, BMTC, NWKRTC, KKRTC ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఆర్డిన‌రీ, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లో మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. అయితే క‌ర్ణాట‌క‌కు చెందిన గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రి.

మ‌హా ల‌క్ష్మి..

ఎన్నిక‌ల హామీల్లో భాగంగా `మ‌హాల‌క్ష్మి` (Maha Lakshmi) పేరుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణలో (Telangana) 2023, డిసెంబ‌ర్ నెల‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. తెలంగాణ‌కు చెందిన‌ మ‌హిళ‌లు, బాలిక‌లు, ట్రాన్స్‌జెండ‌ర్లు ఈ ప‌థ‌కానికి అర్హులు. టీజీఎస్ ఆర్టీసీ (TgSRTC) ఆర్డిన‌రీ, ఎక్స్‌ప్రెస్‌ బ‌స్సుల్లో స్థానిక గుర్తింపు కార్డు చూపించి కండ‌క్ట‌రు వ‌ద్ద జీరో టెకెట్ తీసుకోవ‌చ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు సగటున 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 40 లక్షల మంది మహిళలే ఉన్నార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. 2026, మార్చి నాటికి ఉచిత బస్సు పథకం కింద ఇప్పటి వరకు 290 కోట్లకుపైగా జీరో టికెట్లు (ఉచిత ప్రయాణంలో మహిళలకు ఇచ్చే టికెట్‌) ఇవ్వగా, రూ.10 వేల కోట్లకుపైగా ప్రయాణ చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని వెల్ల‌డించింది. అయితే ఈ ప‌థకాన్ని రాష్ట్రంలోని ఆటో కార్మికులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు వ‌ల్ల త‌మ‌కు గిరాకీ ఉండ‌టం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌కు ప్ర‌త్యామ్నాయం చూపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

జ‌మ్ముక‌శ్మీర్‌

కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన జ‌మ్ము క‌శ్మీర్‌లో (Jammu and Kashmir) 2025, ఏప్రిల్ 1 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌ను అనుస‌రిస్తూ జ‌మ్ములో కూడా మ‌హిళా ప్ర‌యాణికుల‌కు జీరో టికెట్ (zero-ticket) ఇస్తున్నారు. అయితే ఇక్క‌డ ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ఉచిత ప్ర‌యాణం అవ‌కాశం లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

మ‌హిళ‌ల‌కు వంద‌నం పేరుతో 2025, ఆగ‌స్టు 6న టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. మ‌హిళ‌ల‌తోపాటు విద్యార్థినులు, ట్రాన్స్‌జెండ‌ర్లు ఈ ప‌థకాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ప‌ల్లెవెలుగు, ఆల్ట్రా ప‌ల్లె వెలుగు, సీడీ ఆర్డిన‌రీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో స‌రైన‌ గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.

కేర‌ళ‌

ద‌శాబ్దం త‌ర్వాత కేర‌ళ‌లో (Kerala) అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2026, జూన్ 15న ప్రియ‌ద‌ర్శిని స్కీమ్ (Priyadarshini scheme)పేరుతో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తున్న‌ది. స్థానిక మ‌హిళ‌ల‌తోపాటు ట్రాన్స్‌జెండ‌ర్లు కూడా కేఎస్ఆర్టీసీ (KSRTC) బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు.

అన్న‌పూర్ణ భండార్‌..

అన్న‌పూర్ణ భండార్ (Annapurna Bhandar) పేరుతో ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ది. 2026, జూన్ 1న బీజేపీ ప్ర‌భుత్వం దీనిని ప్ర‌క‌టించింది. అర్హులైన మ‌హిళ‌ల‌కు స్మార్ట్ కార్డులు అందిస్తామ‌ని, అప్ప‌టివ‌ర‌కు స‌రైన గుర్తింపు కార్డులు చూపించి బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌లేదు.

 

Advertisement
Advertisement