త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lenovo | లెనోవో నుంచి కొత్త ట్యాబ్, గేమింగ్ మానిటర్లు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి..

Lenovo | టెక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ లెనోవో భార‌త్‌లో త‌న నూత‌న ట్యాబ్‌, మానిట‌ర్ సిరీస్‌ను విడుద‌ల చేసింది. లెనోవో ట్యాబ్ ప్ల‌స్ జెన్ 2, ఎల్‌వోక్యూ గేమింగ్ మానిట‌ర్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. గేమింగ్‌తోపాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ డివైస్‌ల‌ను లాంచ్ చేసిన‌ట్లు లెనోవో తెలిపింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Jul 1, 2026, 3.00 pm IST

Lenovo | లెనోవో నుంచి కొత్త ట్యాబ్, గేమింగ్ మానిటర్లు.. ఫీచ‌ర్లు అదిరిపోయాయి..
Advertisement

Lenovo | టెక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ లెనోవో భార‌త్‌లో త‌న నూత‌న ట్యాబ్‌, మానిట‌ర్ సిరీస్‌ను విడుద‌ల చేసింది. లెనోవో ట్యాబ్ ప్ల‌స్ జెన్ 2, ఎల్‌వోక్యూ గేమింగ్ మానిట‌ర్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. గేమింగ్‌తోపాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ డివైస్‌ల‌ను లాంచ్ చేసిన‌ట్లు లెనోవో తెలిపింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. లెనోవో ట్యాబ్ ప్ల‌స్ జెన్ 2ను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా హైబ్రిడ్ మోడ‌ల్‌గా రూపొందించారు. ఇందులో అధిక రిఫ్రెష్ రేట్ క‌లిగిన డిస్‌ప్లే ఉంది. దీని వ‌ల్ల నాణ్య‌మైన దృశ్యాల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఇమ‌ర్సివ్ ఆడియో ఫీచ‌ర్ వ‌ల్ల ఆడియో అవుట్‌పుట్ క్వాలిటీగా ఉంటుంది. అలాగే ప‌లు ఏఐ టూల్స్‌ను కూడా ఇచ్చారు.

మెరుగైన డిస్‌ప్లే, ఆడియో..

ఈ ట్యాబ్‌లో 12.1 ఇంచుల డిస్‌ప్లే ఉంది. దీనికి 2.5కె రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. డాల్డీ విజ‌న్‌, హెచ్‌డీఆర్‌10కు స‌పోర్ట్ ఉన్నాయి. దీని వ‌ల్ల వీడియో స్ట్రీమింగ్‌, బ్రౌజింగ్‌, ఎడ్యుకేష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవ‌స‌రాల‌కు మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తుంది. జేబీఎల్‌కు చెందిన 9 స్పీక‌ర్ల వ్య‌వ‌స్థ ఉండ‌డంతో అద్భుత‌మైన ఆడియో క్వాలిటీ ల‌భిస్తుంది. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ కూడా ఉంది. దీంతో సినిమాలు చూడ‌డం, సంగీతం విన‌డం, గేమింగ్‌, వ‌ర్చువ‌ల్ మీటింగ్‌ల‌కు మెరుగైన ఆడియో నాణ్య‌త‌ను పొంద‌వ‌చ్చు. ఈ ట్యాబ్‌లో బ్లూటూత్ స్పీకర్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా అనుకూలమైన స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నేరుగా ఆడియోను ట్యాబ్ స్పీకర్లపై ప్లే చేసుకోవచ్చు. ఏఐ ఆధారిత పలు ఫీచర్లను కూడా కంపెనీ ఇందులో అందించింది. వాటిలో రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, లెనోవో స్మార్టర్ రీడర్, ఏఐ నోట్స్ వంటి టూల్స్ ఉన్నాయి.

భారీ బ్యాట‌రీ..

ఈ ట్యాబ్ కు 360 డిగ్రీలు తిరిగే కిక్ స్టాండ్ ఇచ్చారు. దీని సహాయంతో హ్యాంగింగ్ మోడ్, స్టాండ్ మోడ్, థియేటర్ మోడ్, లీన్ మోడ్ వంటి పలు వ్యూయింగ్ మోడ్‌లలో ఈ ట్యాబ్‌ను ఉపయోగించుకోవచ్చు. పవర్ బ్యాకప్ కోసం 10,200ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక‌సారి ట్యాబ్‌ను ఫుల్ చార్జ్ చేస్తే 15 గంట‌ల వ‌ర‌కు నాన్‌స్టాప్ గా యూట్యూబ్‌లో వీడియోల‌ను స్ట్రీమ్ చేయ‌వ‌చ్చు. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది క‌నుక వేగంగా చార్జింగ్ చేయ‌వ‌చ్చు. అలాగే లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్, లెనోవో వైర్‌లెస్ కీబోర్డ్, లెనోవో 68 వాట్ యూఎస్‌బీ-సీ వాల్ ఛార్జర్ లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యాక్సెసరీలను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లేతో మానిట‌ర్‌..

ఇక లెనోవో ఎల్‌ఓక్యూ గేమింగ్ మానిటర్ సిరీస్ ను అధిక రిఫ్రెష్ రేట్లు, తక్కువ రెస్పాన్స్ టైమ్, ఆధునిక డిస్‌ప్లే టెక్నాలజీలతో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా రూపొందించారు. ఇందులో ప్రధాన మోడల్ ఎల్‌ఓక్యూ 27క్యూ-10లో 27 ఇంచుల క్యూహెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 180హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 0.5 మిల్లీసెకన్ల రెస్పాన్స్ టైమ్ అందించారు. ఈ మానిటర్‌లో హెచ్‌డీఆర్10, 99 శాతం ఎస్‌ఆర్‌జీబీ కలర్ కవరేజ్, ఏఎండీ ఫ్రీసింక్, వెసా అడాప్టివ్ సింక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ కన్సోల్‌లు, నింటెండో స్విచ్ వంటి ప్రస్తుత తరం గేమింగ్ కన్సోల్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం హెచ్‌డీఎంఐ 2.1, డిస్‌ప్లేపోర్ట్ 1.4 పోర్ట్‌లను అందించారు. అలాగే లెనోవో ఆర్టరీ సాఫ్ట్‌వేర్ ద్వారా డిస్‌ప్లే కస్టమైజేషన్, పనితీరు ఆప్టిమైజేషన్, మానిటర్ మేనేజ్‌మెంట్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అలాగే తక్కువ విద్యుత్ వినియోగం, మన్నికైన నిర్మాణం, మూడేళ్ల పరిమిత వారంటీల‌ను కూడా అందిస్తోంది.

ధ‌ర వివ‌రాలు..

లెనోవో ఎల్‌ఓక్యూ గేమింగ్ మానిటర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ప్రత్యేకంగా అమెజాన్ ఇండియాలో ల‌భ్యం కానుంది. ప్రారంభ ధరను రూ.9,799గా నిర్ణయించారు. ఈ సిరీస్‌లో ఎల్‌ఓక్యూ 24-10, ఎల్‌ఓక్యూ 27-10, ఎల్‌ఓక్యూ 27క్యూ-10 మోడళ్లు ఉన్నాయి. త్వరలో 32 ఇంచుల ఎల్‌ఓక్యూ మానిటర్‌ను కూడా కంపెనీ విడుదల చేయనుంది. ఇక లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 త్వరలో లెనోవో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభ ధరను రూ.35,999గా నిర్ణ‌యించారు.

Advertisement
Advertisement