త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | వెండితెరపై అలనాటి అందాల తార జీవిత కథ.. హీరోయిన్‌గా కియారా అద్వానీ..! దర్శకుడు ఏమన్నాడంటే..?

Kiara Advani | బాలీవుడ్‌కు చెందిన అలనాటి దిగ్గజ హీరోయిన్‌ మీనా కుమారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ పీ మల్హోత్రా తెరకెక్కించనున్న ఈ బయోపిక్‌కు ‘కమల్ ఔర్ మీనా’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ‘హిచ్‌కీ’, ‘మహారాజ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

P

Entertainment | Published On Jul 1, 2026, 3.00 pm IST

Kiara Advani | వెండితెరపై అలనాటి అందాల తార జీవిత కథ.. హీరోయిన్‌గా కియారా అద్వానీ..! దర్శకుడు ఏమన్నాడంటే..?
Advertisement

Kiara Advani | బాలీవుడ్‌కు చెందిన అలనాటి దిగ్గజ హీరోయిన్‌ మీనా కుమారి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ పీ మల్హోత్రా తెరకెక్కించనున్న ఈ బయోపిక్‌కు ‘కమల్ ఔర్ మీనా’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ‘హిచ్‌కీ’, ‘మహారాజ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు స్పందించారు. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఇప్పటి వరకు హీరోయిన్‌ను ఎంపిక చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, నటీనటుల ఎంపిక ప్రక్రియ మాత్రం కొనసాగుతోందని చెప్పారు.

ఎన్నో భావోద్వేగాలు.. కోణాలు..

మీనా కుమారి బయోపిక్‌కు సంబంధించిన కథ పూర్తిగా సిద్ధమైందని సిద్ధార్థ్ పీ మల్హోత్రా వెల్లడించారు. ఈ చిత్రానికి ప్రధాన ఆధారంగా మీనా కుమారి, ప్రముఖ సినీ దర్శకుడు కమల్ అమ్రోహి ఒకరికొకరు రాసుకున్న ప్రేమలేఖలు, వ్యక్తిగత డైరీలు ఉపయోగిస్తున్నామని చెప్పారు. వీరిద్దరి మధ్య వివాహానికి ముందు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో సుమారు 2వేల చేతిరాతతో కూడిన లేఖలు, వ్యక్తిగత నోట్స్ లభించాయని వెల్లడించారు. వారి బంధం, భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితంలోని ఎన్నో తెలియని కోణాలు ఈ లేఖల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రేమకథను వారు స్వయంగా ప్రపంచానికి అందించినట్లుగా ఆ లేఖలు ఉన్నాయన్నారు. అయితే, ఏ పాత్రను ఎవరు పోషిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని, కథకు తగిన నటీనటులతో పాటు కమర్షియల్‌ అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రమాదంతో మొదలై..

1951లో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో మీనా కుమారి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. పూణెలోని సస్సూన్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఈ కాలంలో దర్శకుడు కమల్ అమ్రోహి తరచూ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించేవాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, తర్వాత ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ ప్రమాదంలో మీనా కుమారి ఎడమ చేతి చిటికెన వేలు తెగిపోయింది. ఆ లోపం ప్రేక్షకులకు కనిపించకుండా సినిమాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆమె నటించేది. మరోవైపు, కమల్ అమ్రోహికి అప్పటికే వివాహమైంది. మొదటి భార్యకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయినా మీనా కుమారిని ఆయనను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వారి దాంపత్య జీవితంలో విభేదాలు మొదలైనట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వివాహం తర్వాత కూడా మీనా కుమారి సినిమాల్లో నటించడం కొనసాగించినా.. సాయంత్రం ఆరు గంటలలోపు ఇంటికి చేరుకోవాలనే నిబంధనను కమల్ అమ్రోహి విధించినట్లు ప్రచారం జరిగింది.

ముగిసిన వైవాహిక జీవిత ప్రయాణం..

మీనా కుమారిపై అమ్రోహి నిఘా వేసినట్లుగా ప్రచారం అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె ఎక్కడికి వెళ్తోంది.. ఎవరిని కలుస్తుందనే విషయాలు తెలుసుకునేందుకు కమల్ అమ్రోహి తన సహాయకుడు బకర్ అలీని నియమించినట్లు ప్రచారం జరిగింది. ఆమె మానసిక, శారీరక వేధింపులకు గురయ్యారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా బకర్ అలీతో మీనా కుమారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆమెపై దాడి జరిగినట్లు కూడా కథనాలున్నాయి. ఈ విషయాన్ని కమల్ అమ్రోహికి తెలిపినా స్పందన రాకపోవడంతో ఆమె ఆయనను విడిచి తన సోదరి ఇంటికి వెళ్లిపోయినట్లు చెబుతారు.

అదే ఆఖరి సినిమా..

మీనా కుమారి, కమల్ అమ్రోహి కాంబినేషన్‌లో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పాకీజా’ 1972లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం విషమించి కన్నుమూసింది. కేవలం 19 ఏళ్ల వయసులో కమల్ అమ్రోహిని వివాహం చేసుకున్న మీనా కుమారి, దాదాపు 12 సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఆమె తీవ్ర నిద్రలేమి సమస్యతో బాధపడినట్లు చెబుతారు. నిద్ర మాత్రలకు బదులుగా కొద్దిపాటి బ్రాందీ తీసుకోవాలని వైద్యులు సూచించారని, అదే క్రమంగా మద్యానికి అలవాటుగా మారిందని సమాచారం. కాలక్రమేణా అధిక మద్యపానం కారణంగా ఆమె కాలేయం తీవ్రంగా దెబ్బతింది. చివరకు లివర్‌ సంబంధిత సమస్యలతో కేవలం 38 ఏళ్ల వయసులో మీనా కుమారి కన్నుమూశారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన నటీమణుల్లో ఒకరిగా నిలిచిపోయారు.

మీనాకుమారి కెరీర్‌..

మీనాకుమారి 1939లో బాలనటిగా సినీరంగంలోకి ప్రవేశించి.. 1950లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మీనా కుమారి కెరీర్‌లో 90కిపైగా చిత్రాల్లో నటించారు. బైజు బావ్రా (1952), బైజు బావ్రా (1952), పరిణీత (1953), సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962), కాజల్ (1965), పాకీజా (1972) చిత్రాలు మీనాకుమారి కెరీర్‌లో గుర్తుండిపోయే బెస్ట్‌ సినిమాలు. మీనాకుమారికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన చిత్రం బైజు బావ్రా. ఈ సినిమాతో ఆమె తొలి ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. మీనా కుమారి కెరీర్‌కు మకుటాయమానమైన చిత్రం పాకీజా. ఎన్నో ఏళ్ల నిర్మాణం తర్వాత విడుదలైన ఈ సినిమా ఆమె మరణానికి కొద్దికాలం ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె పోషించిన సాహిబ్‌జాన్‌ పాత్ర సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

Advertisement
Advertisement