త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone Ultra | యాపిల్ ఫోల్డ‌బుల్ ఐఫోన్ ధ‌ర రూ.2.50 ల‌క్ష‌లు..? భారీ అంచ‌నాలు..

iPhone Ultra | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న తొలి ఫోల్డ‌బుల్ ఐఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ ఫోన్‌కు చెందిన అనేక ఊహాగానాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారంలో ఉన్నాయి. ఈ ఫోన్‌కు యాపిల్ సంస్థ ఐఫోన్ అల్ట్రాగా నామ‌క‌ర‌ణం చేసింద‌ని, అదే పేరుతో విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది.

S

Technology | Published On Sep 8, 2026, 3.08 pm IST

iPhone Ultra | యాపిల్ ఫోల్డ‌బుల్ ఐఫోన్ ధ‌ర రూ.2.50 ల‌క్ష‌లు..? భారీ అంచ‌నాలు..
Advertisement

iPhone Ultra | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న తొలి ఫోల్డ‌బుల్ ఐఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ ఫోన్‌కు చెందిన అనేక ఊహాగానాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారంలో ఉన్నాయి. ఈ ఫోన్‌కు యాపిల్ సంస్థ ఐఫోన్ అల్ట్రాగా నామ‌క‌ర‌ణం చేసింద‌ని, అదే పేరుతో విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు యాపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ల‌లో అత్యంత ఖ‌రీదైన మోడ‌ల్‌గా ఈ ఫోన్ నిలుస్తుంద‌ని అంటున్నారు. సెప్టెంబ‌ర్ 9న యాపిల్ నిర్వ‌హించ‌నున్న ఈవెంట్‌లో ఈ ఫోన్ గురించి పూర్తి స్ప‌ష్ట‌త రానుంది. అదే ఈవెంట్‌లో ఐఫోన్ అల్ట్రాతోపాటు ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల‌ను సైతం యాపిల్ విడుద‌ల చేయ‌నుంద‌ని స‌మాచారం. ఇక ఐఫోన్ అల్ట్రా ధ‌ర భార‌త్‌లో ఎంత ఉంటుందని టెక్ అభిమానులు ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చారు.

ప్రారంభ ధ‌ర రూ.2.50 ల‌క్ష‌లు..?

ఐఫోన్ అల్ట్రా ఫోన్‌ను పుస్త‌కంలా తెరుచుకునే డిజైన్‌తో విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. ది ఎక‌నామిక్ టైమ్స్‌, మాక్ రూమ‌ర్స్ క‌థ‌నాల ప్ర‌కారం.. ఇందులో 5.5 ఇంచుల ఔట‌ర్ డిస్‌ప్లే, 7.8 ఇంచుల ఇన్న‌ర్ డిస్‌ప్లే ఉంటాయ‌ని తెలిసింది. ఫోన్ చాలా స్లీక్‌గా ఉంటుంద‌ని, వెనుక వైపు రెండు కెమెరాలు, ఫేస్ ఐడీకి బ‌దులుగా ట‌చ్ ఐడీని అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక భార‌త్‌లో ఐఫోన్ అల్ట్రా ప్రారంభ ధ‌ర సుమారుగా 2వేల డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ప‌న్నులు, ఇత‌ర ఖ‌ర్చులు క‌లిపి ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర భార‌త క‌రెన్సీలో సుమారుగా రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. అదే జ‌రిగితే ఐఫోన్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన మోడ‌ల్‌గా ఇది నిలిచే అవ‌కాశం ఉంది. కాగా అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర 2099 డాల‌ర్ల నుంచి ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వేరియెంట్‌ను బ‌ట్టి 2299 వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. అత్యంత ఖ‌రీదైన వెర్ష‌న్ ధ‌ర 3వేల డాల‌ర్లు దాటుతుంద‌ని కూడా తెలుస్తోంది. ఇదే భార‌త కరెన్సీలో అయితే సుమారుగా రూ.2.80 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది.

ఈసారి అధికంగానే ధ‌ర‌లు..?

కాగా ఏఐ రంగంలో డేటా సెంట‌ర్ల‌కు గాను చిప్‌ల కొర‌త ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ‌లు త‌మ ఫోన్ల ధ‌ర‌లను పెంచాయి. ఈ ప్ర‌భావం యాపిల్‌పైనా ప‌డింది. దీంతో కొత్త ఐఫోన్ మోడ‌ల్స్ ధ‌ర‌లు భారీగా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఐఫోన్ అల్ట్రా ఫోల్డ‌బుల్ ఫోన్ కావడం, చిప్‌ల కొర‌త కార‌ణంగా పెరిగిన మెమొరీల ధ‌ర‌లు వంటి అంశాల వ‌ల్ల ఈసారి ఐఫోన్ల ధ‌ర‌లు గ‌తంలో ఎన్న‌డూ లేనంత భారీ స్థాయిలో ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే యాపిల్ ఈవెంట్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement