త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | ఐఫోన్ డ్యుయో వినియోగ‌దారుల‌కు షాక్‌.. డిస్‌ప్లేలో స‌మ‌స్య‌..

Apple | యాపిల్ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఐఫోన్ డ్యుయో విడుదలైన కొద్ది రోజులకే డిస్‌ప్లే సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది సంఖ్యలో ఫోన్లలో లోపాన్ని గుర్తించిన యాపిల్‌, సమస్య ఎదురైన వినియోగదారులు యాపిల్‌కేర్‌ను సంప్రదించి రీప్లేస్‌మెంట్‌ పొందాలని సూచించింది. అయితే ఈ సమస్యకు అసలు కారణం ఏమిటో కంపెనీ వెల్లడించలేదు.

S

Technology | Published On Oct 27, 2026, 4.45 pm IST

Apple | ఐఫోన్ డ్యుయో వినియోగ‌దారుల‌కు షాక్‌.. డిస్‌ప్లేలో స‌మ‌స్య‌..
Advertisement

Apple | యాపిల్ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఐఫోన్ డ్యుయో విడుదలైన కొద్ది రోజులకే డిస్‌ప్లే సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది సంఖ్యలో ఫోన్లలో లోపాన్ని గుర్తించిన యాపిల్‌, సమస్య ఎదురైన వినియోగదారులు యాపిల్‌కేర్‌ను సంప్రదించి రీప్లేస్‌మెంట్‌ పొందాలని సూచించింది. అయితే ఈ సమస్యకు అసలు కారణం ఏమిటో కంపెనీ వెల్లడించలేదు.

యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్ డ్యుయో వినియోగదారులకు ఊహించని సమస్య ఎదురైంది. ఫోన్‌ మధ్యలో మడిచే భాగం వద్ద స్క్రీన్‌పై పగుళ్లు, గీతలు కనిపిస్తున్నట్లు పలువురు వినియోగదారులు సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు. ఈ సమస్యపై స్పందించిన యాపిల్‌, కొద్ది సంఖ్యలో ఐఫోన్ డ్యుయో ఫోన్లలో అంతర్గత డిస్‌ప్లే సమస్య ఉన్నట్లు రాయిటర్స్‌కు వెల్లడించింది. డిస్‌ప్లేలో లోపాలు ఎదురైతే యాపిల్‌కేర్‌ను సంప్రదించి రీప్లేస్‌మెంట్‌ పొందాలని సూచించింది. అయితే ప్రభావితమైన ఫోన్ల సంఖ్యను, సమస్యకు కారణాన్ని కంపెనీ వెల్లడించలేదు. బ్లూమ్‌బర్గ్‌ జర్నలిస్ట్‌ మార్క్‌ గుర్మన్‌ కథనం ప్రకారం కొందరు వినియోగదారులకు ఫోన్‌ అందిన కొన్ని గంటల్లోనే లేదా రోజుల్లోనే ఈ సమస్య ఎదురైంది. ఫోన్‌ను తెరిచే సమయంలో పగుళ్లు వచ్చినట్లు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత స్క్రీన్‌ దెబ్బతిన్నట్లు వినియోగదారులు పేర్కొన్నారు. మధ్య మడత వద్ద పగుళ్లు, నిలువు లేదా అడ్డంగా ప్రకాశవంతమైన రంగుల గీతలు, తెల్లని మచ్చలు, స్క్రీన్‌ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదుర‌య్యాయి. కొన్నిసార్లు డిస్‌ప్లే కింద ఏదో ఇరుక్కున్నట్లు కీలు గట్టిగా ఉన్న అనుభూతి కలిగిందని కూడా నివేదికలు వెల్లడించాయి.

సమస్యకు కారణమేమిటి?:

ఈ లోపానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే మరమ్మత్తు ఎక్స్‌ప‌ర్ట్‌ సంస్థ ఐఫిక్సిట్‌ పరిశీలనలో కొన్ని యాంత్రిక లోపాలు కారణమై ఉంటాయ‌చ్చని గుర్తించింది. ఫోన్‌ విడదీసిన దృశ్యాలు, పేటెంట్లు, కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్ల ఆధారంగా ఐఫోన్ డ్యుయో కీలు వ్యవస్థకు సంబంధించిన త్రీడీ నమూనాను రూపొందించి, దెబ్బతిన్న ప్రాంతాలతో పోల్చినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ఇందులో మధ్యలోని సపోర్ట్‌ బార్‌ సరిగ్గా వెనక్కి వెళ్లకపోవడం, డిస్‌ప్లే కేబుల్‌పై ఒత్తిడి పడటం, కీలు అమరికలో లోపాలు, ఏదైనా వస్తువు అడ్డుపడడం లేదా తయారీ లోపాలు వంటి అవకాశాలను పరిశీలించారు. అమెరికాలో ఈ ఫోన్‌ ప్రారంభ ధర 1,999 డాలర్లు కాగా, భారత్‌లో రూ.2,99,900గా ఉంది. ఇంత భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రారంభ దశలోనే డిస్‌ప్లే సమస్యలు రావడం ఆందోళన కలిగిస్తోంది. వారంటీ గడువు ముగిసిన తర్వాత అంతర్గత స్క్రీన్‌ మార్చాలంటే సుమారు 999 డాలర్లు ఖర్చవుతుందని ఐఫిక్సిట్‌ పేర్కొంది.

డిమాండ్‌ మధ్య పెరిగిన ఆందోళన..

రాయిటర్స్‌ కథనం ప్రకారం యాపిల్‌ గత వారమే ఈ ఫోన్ల సరఫరా ప్రారంభించగా, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి స్టాక్‌ నిమిషాల్లోనే అమ్ముడైంది. డిస్‌ప్లే సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఫోన్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. తయారీలోని సంక్లిష్టత సరఫరాపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాన్సిస్కో జెరోనిమో మాట్లాడుతూ వినియోగదారులకు రీప్లేస్‌మెంట్‌ అందించాలన్న యాపిల్‌ నిర్ణయం సరైన తొలి చర్య అని రాయిటర్స్‌కు తెలిపారు. 2019లో శాంసంగ్‌ తొలి గెలాక్సీ ఫోల్డ్‌ ఎదుర్కొన్న సమస్యలను ఆయన గుర్తుచేశారు. వేగంగా, పారదర్శకంగా స్పందించడం వల్ల ఉత్పత్తి ప్రతిష్ఠకు కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సీసీఎస్‌ ఇన్‌సైట్‌ చీఫ్‌ అనలిస్ట్‌ బెన్‌ వుడ్‌ ఈ విషయంలో తొందరపడి నిర్ణయానికి రావద్దని సూచించారు. ప్రస్తుతానికి ఈ సమస్య విస్తృత స్థాయిలో ఉందని నిర్ధారించే ఆధారాలు లేవని ది గార్డియన్‌కు తెలిపారు.

Advertisement
Advertisement