త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భార‌త్‌లో భారీ క్రేజ్‌.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..

iPhone 18 Pro | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే త‌న నూత‌న ఐఫోన్ సిరీస్ ఫోన్లు ఐఫోన్ 18 ప్రొ, ప్రొ మ్యాక్స్‌ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫోన్ల‌కు గాను శుక్ర‌వారం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఫోన్ల‌ను ప్రీ ఆర్డ‌ర్ చేసిన వారికి ఇవాళ్టి నుంచి యాపిల్ డెలివ‌రీ చేయ‌నుంది.

S

Technology | Published On Sep 18, 2026, 2.34 pm IST

iPhone 18 Pro | ఐఫోన్ 18 ఫోన్ల కోసం భార‌త్‌లో భారీ క్రేజ్‌.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
Advertisement

iPhone 18 Pro | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే త‌న నూత‌న ఐఫోన్ సిరీస్ ఫోన్లు ఐఫోన్ 18 ప్రొ, ప్రొ మ్యాక్స్‌ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫోన్ల‌కు గాను శుక్ర‌వారం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఫోన్ల‌ను ప్రీ ఆర్డ‌ర్ చేసిన వారికి ఇవాళ్టి నుంచి యాపిల్ డెలివ‌రీ చేయ‌నుంది. ఇక రిటెయిల్ స్టోర్స్‌, ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌ల‌లోనూ ఇవాళ్టి నుంచే ఈ ఫోన్లు విక్ర‌యాల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. కాగా ఢిల్లీలోని యాపిల్ స్టోర్స్ ఎదుట గురువారం అర్ధ‌రాత్రి నుంచే యాపిల్ ప్రేమికులు ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఈ ఫోన్ల‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తుండడంతో యథా ప్ర‌కారం టెక్ ప్రియులు ఈ ఫోన్ల ప‌ట్ల క్రేజ్ పెంచుకున్నారు. యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల‌లో అత్యంత అధునాత‌న కెమెరా వ్య‌వ‌స్థ‌, ఫోన్ హీట్‌కు గురికాకుండా ప్ర‌త్యేక కూలింగ్ సిస్ట‌మ్‌, యాపిల్ ఇంటెలిజెన్స్‌, మెరుగైన బ్యాట‌రీ లైఫ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు.

ఆక‌ట్టుకుంటున్న ఫీచ‌ర్లు..

యాపిల్ వ‌రల్డ్ వైడ్ మార్కెటింగ్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ మాట్లాడుతూ వినియోగదారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో ఐఫోన్‌ 18 ప్రొ లో కీలకమైన మార్పులు వ‌చ్చాయ‌ని, ఈ విభాగాల్లో కేవలం స్వల్ప మెరుగుదలలకు పరిమితం కాకుండా, భారీ స్థాయిలో ముందడుగు వేసి ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ ప్రొ ఐఫోన్‌ను తీసుకొచ్చామ‌ని తెలిపారు. వేరియబుల్‌ అపెర్చర్‌ సాంకేతికతతో ఎవరైనా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను సులభంగా చిత్రీకరించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇది కంటెంట్‌ క్రియేటర్లకు మరింత వైవిధ్యాన్ని, ప్రొఫెషనల్‌ వినియోగదారులకు అధిక నియంత్రణను అందిస్తుందని చెప్పారు. ఫొటోగ్రాఫిక్‌ స్టైల్స్‌లో మార్పులు, శక్తివంతమైన వీడియో ఫీచర్లతో ఐఫోన్‌ 18 ప్రొ లో సరికొత్తగా తమను తాము వ్యక్తీకరించుకునే అవకాశాలు లభిస్తాయని వివరించారు. యాపిల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం భారత్‌లో ఐఫోన్‌ 18 ప్రొ ప్రారంభ ధర రూ.1,64,900గా ఉంది. ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ ధర రూ.1,79,900 నుంచి ప్రారంభమవుతోంది.

బారులు తీరిన టెక్ ప్రియులు..

ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల విక్ర‌యాలు ప్రారంభం కావ‌డంతో దేశవ్యాప్తంగా మొబైల్‌ రిటెయిల్ స్టోర్స్ ఎదుట వినియోగ‌దారులు భారీ ఎత్తున బారులు తీరారు. గురువారం అర్ధ‌రాత్రి నుంచే షాపుల ముందు క్యూ క‌ట్టారు. దీంతో ట్రాఫిక్ ర‌ద్దీ ఏర్ప‌డింది. అలాగే కొత్త ఐఫోన్ల ఆర్డ‌ర్ల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల చోటు చేసుకుంది. మొట్టమొదటిసారిగా భారత్‌లో తయారైన ఐఫోన్‌ 18 ప్రొ, ప్రొ మ్యాక్స్‌ మోడళ్లు విడుదల రోజునే దేశీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఫాక్స్‌కాన్‌, టాటా గ్రూప్‌ ద్వారా భారత్‌లో ఐఫోన్‌ తయారీ పెరుగుతున్న నేపథ్యంలో ఇది కీలక మార్పుగా నిలిచింది. ఈ కొత్త ఐఫోన్‌ మోడళ్లు యాపిల్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌, ప్రధాన యాపిల్‌ రిటైల్‌ స్టోర్లతోపాటు ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్లలో అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్‌ 18 ప్రొ, ఐఫోన్‌ 18 ప్రొ మ్యాక్స్‌ సాధారణ విక్రయాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రీ ఆర్డర్‌ చేసిన వారికి ఫోన్ల డెలివరీతోపాటు స్టోర్లలో నేరుగా కొనుగోలు చేసేందుకు కూడా అదే సమయం నుంచి అవకాశం కల్పించారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని యాపిల్‌ స్టోర్ల ఎదుట శుక్రవారం కొనుగోలుదారులు భారీగా క్యూ కట్టారు. సాకేత్‌ మాల్‌, నోయిడా, గురుగ్రామ్‌, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లో ఐఫోన్‌ 18 ప్రొ ను తొలుత సొంతం చేసుకోవాలని పలువురు గంటల తరబడి వేచి చూశారు. కొంతమంది కొనుగోలుదారులు ప్రత్యేకంగా ఈ ఫోన్‌ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు.

ధ‌ర‌లు ఎక్కువే..

ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ల ధ‌ర‌లు అధికంగానే ఉన్నాయి. ఐఫోన్ 18 ప్రొ ఫోన్‌కు చెందిన 256జీబీ వేరియెంట్ ధ‌ర రూ.1,64,900 ఉండ‌గా, 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,89,900గా ఉంది. 1టీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.2,39,900గా నిర్ణ‌యించారు. 2 టీబీ మోడ‌ల్ ధ‌ర రూ.3,14,900గా ఉంది. ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.1,79,900 ఉండ‌డ‌గా, 512జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.2,04,900గా ఉంది. అలాగే 1టీబీ, 2టీబీ వేరియెంట్ల ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.2,54,900, రూ.3,29,900గా ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర‌లు సుమారు రూ.20వేల నుంచి రూ.60వేల వ‌రకు ఎక్కువ‌గా ఉన్నాయి.

Advertisement
Advertisement