త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | ఐఫోన్‌ 17కు డిమాండ్‌ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్‌..

Apple | భారత్‌లో ఐఫోన్‌ 17కు డిమాండ్‌ తగ్గడంతో యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్‌ కోసం ప్రామాణిక ఐఫోన్‌ 17 ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. గత నెలలో ధరలను 20 నుంచి 29 శాతం వరకు పెంచిన నేపథ్యంలో వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

S

Business | Published On Oct 17, 2026, 12.21 pm IST

Apple | ఐఫోన్‌ 17కు డిమాండ్‌ దెబ్బ.. ఉత్పత్తిని తగ్గించిన యాపిల్‌..
Advertisement

Apple | భారత్‌లో ఐఫోన్‌ 17కు డిమాండ్‌ తగ్గడంతో యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్‌ కోసం ప్రామాణిక ఐఫోన్‌ 17 ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. గత నెలలో ధరలను 20 నుంచి 29 శాతం వరకు పెంచిన నేపథ్యంలో వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మోడల్‌కు ఎగుమతి డిమాండ్‌ బలంగా ఉండడంతో తగ్గించిన దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతుల దిశగా మళ్లించనుంది. దీంతో మొత్తం ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం ఉండద‌ని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఐఫోన్ 17 ప్రొ మోడళ్లతో పాటు ఇటీవల విడుదలైన ఐఫోన్‌ 18 మోడళ్లకు భారత్‌లో డిమాండ్‌ బలంగా ఉన్నట్లు మరో కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

డిమాండ్‌కు అనుగుణంగా ఉత్ప‌త్తి..

వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని యాపిల్‌ నిరంతరం సర్దుబాటు చేస్తోందని పేర్కొన్నారు. గతేడాది కూడా ఐఫోన్‌ ఎయిర్‌ ఉత్పత్తిని తగ్గించినట్లు గుర్తుచేశారు. తయారీ ప్రక్రియలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి తయారీ పరిమాణాన్ని పెంచడం లేదా తగ్గించడం సాధ్యమవుతుందని వివరించారు. ఈ విషయాలపై వ్యాఖ్యానించేందుకు యాపిల్‌ నిరాకరించింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఐఫోన్‌ 17 ప్రొ మోడళ్ల అసెంబ్లీ సామర్థ్యాన్ని దాదాపు డజను ఉత్పత్తి లైన్ల వరకు విస్తరించాలన్న యాపిల్‌ ప్రణాళికపై గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రామాణిక మోడల్‌ ఉత్పత్తి తగ్గింపు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలో ఐఫోన్‌ 18 ప్రొ మోడళ్లతోపాటు కొత్త ఫోల్డబుల్ డ్యుయో మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న తాజా ప్రామాణిక మోడల్‌గా ఐఫోన్‌ 17 కొనసాగుతోంది.

భార‌త్‌లో ఆస‌క్తి త‌గ్గిందా..

భారత్‌లో కొత్త ఐఫోన్‌ మోడళ్లు విడుదలైన తర్వాత పాత మోడళ్ల ధరలు తగ్గడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం సాధారణం. అయితే, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. మెమొరీ, ఇతర విడిభాగాల ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడడం వంటి కారణాలతో యాపిల్‌ భారత్‌లో పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలను కూడా 20 నుంచి 29 శాతం వరకు పెంచింది. దీంతో ధరల విషయంలో వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పాత ఐఫోన్‌ మోడళ్ల ధరలు పెరగడంతో ప్రీమియం ఫోన్లకు, ప్రాథమిక మోడళ్లకు మధ్య ఉన్న ధరల వ్యత్యాసం తగ్గుతోంది. ఐఫోన్‌ 17 ప్రొ మోడళ్లపై భారీ తగ్గింపులు లభించినప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు భారతీయ వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

ఐఫోన్ 18 ఎప్పుడు..?

మరోవైపు, ఐఫోన్‌ 18 విడుదల నేపథ్యంలో కొందరు వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఐఫోన్‌ 18 విడుదలకు సంబంధించిన తదుపరి పరిణామాలపై ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఐఫోన్ 17 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మోడళ్లకు భారత్‌లో డిమాండ్‌ కొనసాగుతుండగా, ప్రామాణిక ఐఫోన్‌ 17 అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని తగ్గిస్తూ, విదేశీ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు యాపిల్‌ ప్రయత్నిస్తోంది.

Advertisement
Advertisement