త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iOS 27 | భారీ ఏఐ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న ఐఓఎస్ 27.. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 కి యాపిల్ రెడీ..

iOS 27 | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తన వార్షిక డెవలపర్ ఈవెంట్ WWDC 2026 కీలక తేదీని అధికారికంగా ప్రకటించింది. జూన్ 8న ఉదయం 10 గంటలకు పీడీటీ సమయానికి, భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కీనోట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈవెంట్‌లో ప్రధాన ఫోకస్ మొత్తం ఏఐ ఫీచర్లపైనే ఉండనుందని సమాచారం.

S

Technology | Published On May 19, 2026, 12.51 pm IST

iOS 27 | భారీ ఏఐ ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న ఐఓఎస్ 27.. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 కి యాపిల్ రెడీ..
Advertisement

iOS 27 | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ తన వార్షిక డెవలపర్ ఈవెంట్ WWDC 2026 కీలక తేదీని అధికారికంగా ప్రకటించింది. జూన్ 8న ఉదయం 10 గంటలకు పీడీటీ సమయానికి, భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కీనోట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈవెంట్‌లో ప్రధాన ఫోకస్ మొత్తం ఏఐ ఫీచర్లపైనే ఉండనుందని సమాచారం. ప్రఖ్యాత బ్లూమ్‌బర్గ్ విశ్లేషకుడు మార్క్ గుర్మ‌న్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఐఓఎస్ 27, ఐప్యాడ్ ఓఎస్ 27లో యాపిల్ భారీ స్థాయిలో ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో ప్రత్యేక సిరి యాప్, ఏఐ ఆధారిత రైటింగ్ టూల్స్, నేచురల్ లాంగ్వేజ్ ద్వారా షార్ట్‌కట్స్ సృష్టించే సామర్థ్యం, ఏఐ వాల్‌పేపర్ జనరేషన్ వంటి ఫీచర్లు ఉండనున్న‌ట్లు తెలిసింది.

కీబోర్డ్‌లోనే రైట్ విత్ సిరి..

ప్రస్తుతం గూగుల్‌, శాంసంగ్‌, ఒప్పో వంటి కంపెనీలు ఏఐ రైటింగ్ ఫీచర్లను అందిస్తున్న నేపథ్యంలో, యాపిల్ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్తగా రైట్ విత్ సిరి అనే టాగుల్‌ను కీబోర్డ్ పైభాగంలో అందించనుందని సమాచారం. అలాగే టెక్స్ట్ ఫీల్డ్‌లో పని చేస్తున్న సమయంలో సిరిని యాక్టివేట్ చేస్తే హెల్ప్ మీ రైట్ అనే ఆప్షన్ కనిపించనుంది. టైపింగ్ సమయంలో ఏఐ పదాలు, వాక్యాలను విశ్లేషించి ఆటోమేటిక్‌గా సవరణలు సూచిస్తుంది. వినియోగదారులు ఒక్కో సూచనను అంగీకరించవచ్చు, అన్ని మార్పులను ఒకేసారి అప్రూవ్ చేయవచ్చు లేదా పూర్తిగా విడిచిపెట్ట‌వచ్చు. అదనంగా గ్రామర్ చెకింగ్‌ను తాత్కాలికంగా ఆపడం, తప్పులు గుర్తించిన సెక్షన్ల మధ్య నావిగేట్ చేయడం వంటి కంట్రోల్స్ కూడా ఉండనున్నాయి. యాపిల్ సిరి రీడిజైన్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. దీనికి ప్రధాన కారణం యూజర్ల డేటా ప్రైవసీపై యాపిల్ అనుసరిస్తున్న కఠిన విధానమని తెలుస్తోంది. భారీ ఏఐ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక సర్వర్ల ద్వారా డేటాను హ్యాండిల్ చేయాల్సి రావడంతో అభివృద్ధి ఆలస్యమైందని నివేదికలు చెబుతున్నాయి.

ప్రైవ‌సీపైనే ఫోక‌స్‌..

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026లో ప్రైవసీనే ప్రధాన అంశంగా యాపిల్ ప్రెజెంటేషన్ ఉండబోతుందని సమాచారం. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ద్వారా ఏఐ డేటా ప్రాసెస్ అవుతుందని చెబుతున్నారు. అంటే క్లిష్టమైన ఏఐ రిక్వెస్టులు యాపిల్ సొంత సర్వర్ చిప్స్ ఆధారిత క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా నడుస్తాయి. అయితే ప్రస్తుతం యాపిల్ తీవ్రమైన ఏఐ టాస్కుల కోసం గూగుల్‌కు చెందిన జెమినిపై ఆధారపడుతున్న నేపథ్యంలో, సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గూగుల్ పాత్ర కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త స్టాండలోన్ సిరి యాప్, ఓపెన్ఏఐకి చెందిన చాట్ జీపీటీ, అలాగే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్‌లకు పోటీగా నిలవనుంది. ఈ యాప్‌లో చాట్స్ ఆటో డిలీట్ ఫీచర్ కూడా ఉండనుంది. యూజర్లు సంభాషణలను 30 రోజులు, ఒక సంవత్సరం లేదా శాశ్వతంగా సేవ్ చేసుకునే ఆప్షన్ పొందుతారు. అదనంగా యాడ్-ఫ్రీ అనుభవం కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.

మ‌ల్టిపుల్ ఏఐ టూల్స్‌..

యాపిల్ తీసుకురాబోతున్న మరో కీలక ఏఐ ఫీచర్ కెమెరా యాప్ ద్వారా విజువల్ డేటాను విశ్లేషించే కొత్త సిరి మోడ్. అలాగే ఫొటోస్ యాప్‌లో మల్టిపుల్ ఏఐ ఎడిటింగ్ టూల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. నేచురల్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందే జెన్‌మోజీ ఫీచర్‌కూ అప్‌గ్రేడ్ రానుంది. వినియోగదారుల ఫొటోలు, తరచుగా టైప్ చేసే పదబంధాల ఆధారంగా సజెస్టెడ్ జెన్‌మోజీలను ఆటోమేటిక్‌గా సృష్టించే అవకాశం ఉంటుంది. యాపిల్ షార్ట్‌కట్స్ యాప్‌కు కూడా పెద్ద అప్‌గ్రేడ్ ఇవ్వనుంది. ప్రస్తుతం క్యాలెండర్ షేరింగ్, పీడీఎఫ్ సమ్మరీ, గ్యారేజ్ డోర్ ఓపెన్ చేయడం, ఇంటికి చేరుకున్నప్పుడు లైట్లు ఆన్ చేయడం వంటి ఆటోమేషన్ల కోసం యూజర్లు మాన్యువల్‌గా షార్ట్‌కట్స్ సృష్టించాల్సి ఉంటుంది. కానీ కొత్త వెర్షన్‌లో యూజర్లు తమకు కావాల్సిన పనిని కేవలం వర్ణిస్తే సరిపోతుంది. ఏఐ ఆటోమేటిక్‌గా షార్ట్‌కట్ రూపొందిస్తుంది. ఇక చివరిగా ఏఐ ద్వారా వాల్‌పేపర్లు సృష్టించే కొత్త ఫీచర్‌ను కూడా యాపిల్ సిద్ధం చేస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్స్ రూపొందించే అవకాశం ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2026 ఈవెంట్‌లో ఈ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement
Advertisement