త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

iOS 27 | ఐఫోన్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచే ఈ ఫోన్ల‌కు ఐఓఎస్ 27 అప్‌డేట్‌..

iOS 27 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న పాత ఐఫోన్ మోడ‌ల్స్‌కు గాను కొత్త ఐఓఎస్ 27 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను లాంచ్ చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన యాపిల్ ఈవెంట్‌లో సంస్థ ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌పై ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఓఎస్‌ను నేటి అర్థ‌రాత్రి నుంచే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలిపింది.

S

Technology | Published On Sep 14, 2026, 5.41 pm IST

iOS 27 | ఐఫోన్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచే ఈ ఫోన్ల‌కు ఐఓఎస్ 27 అప్‌డేట్‌..
Advertisement

iOS 27 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న పాత ఐఫోన్ మోడ‌ల్స్‌కు గాను కొత్త ఐఓఎస్ 27 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను లాంచ్ చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన యాపిల్ ఈవెంట్‌లో సంస్థ ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌పై ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఓఎస్‌ను నేటి అర్థ‌రాత్రి నుంచే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలిపింది. కొత్త‌గా విడుద‌లైన ఐఫోన్ డ్యుయోతోపాటు ఐఫోన్ 18 ప్రొ, ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌లో డిఫాల్ట్‌గా ఐఓఎస్ 27ను అందించ‌నున్నారు. ఇక ఈ ఫోన్ల‌కు ముందు వ‌చ్చిన గ‌త ఐఫోన్ మోడ‌ల్స్‌లో కొన్నింటికి యాపిల్ ఓటీఏ రూపంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందిస్తోంది. అర్హ‌త క‌లిగిన డివైస్‌ల‌కు చెందిన వినియోగ‌దారులు ఈ ఓఎస్ అప్‌డేట్‌ను నేటి అర్థ‌రాత్రి త‌రువాత త‌మ ఐఫోన్‌ల‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. ఐఓఎస్ 27కు అర్హ‌త క‌లిగిన ప‌లు ఐఫోన్ మోడ‌ల్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఏయే ఐఫోన్లు ఎలిజిబుల్‌..

ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్‌12, 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ 14, 14 ప్ల‌స్‌, 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ 15, 15 ప్ల‌స్, 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ 16, 16ఇ, 16 ప్ల‌స్‌, 16 ప్రొ, 16 ప్రొ మ్యాక్స్‌, ఐఫోణ్ 17, 17ఇ, 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ ఎయిర్ ఫోన్ల‌కు ఐఓఎస్ 27ను అందించ‌నున్నారు. ఈ ఫోన్లు క‌లిగిన యూజ‌ర్లు త‌మ ఫోన్ ఓఎస్‌ను కొత్త ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.

స‌రికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్‌..

ఐఓఎస్ 27లో ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో కొత్త‌గా యాపిల్ ఇంటెలిజెన్స్‌ను సంస్థ అందించ‌నుంది. ఇందుకు గాను ఇప్ప‌టికే ఉన్న డిజిట‌ల్ అసిస్టెంట్ సిరికి ఏఐ హంగులు జోడించారు. గూగుల్ జెమిని ఏఐ మోడ‌ల్స్ భాగ‌స్వామ్యంతో యాపిల్ ఏఐ సేవ‌ల‌ను సిరి ద్వారా యూజ‌ర్ల‌కు అందిస్తుంది. అలాగే లిక్విడ్ గ్లాస్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌లో మార్పులు, బ్యాట‌రీ వినియోగంలో మెరుగుద‌ల వంటి కీల‌క ఫీచ‌ర్ల‌ను ఈ కొత్త ఓఎస్‌లో అందిస్తున్నారు. కొత్త‌గా తీర్చిదిద్దిన సిరి ఏఐ ద్వారా గతంలో సాధ్యం కాని అనేక ప‌నుల‌ను చేయించుకోవ‌చ్చు. సుదీర్ఘ‌మైన సంభాష‌ణ‌ల్లోని నిర్దిష్ట ప‌దాల‌ను లేదా వాక్యాల‌ను సిరి అన్వేషించి చూపిస్తుంది. అవ‌స‌ర‌మైన అంశంపై ప‌రిశోధ‌న చేస్తుంది. ప్రయాణ ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తుంది. స‌మావేశాల్లో ముఖ్య‌మైన విష‌యాల‌ను నోట్ చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

లిక్విడ్ గ్లాస్ డిజైన్‌కు మ‌రిన్ని మార్పులు..

ఐఓఎస్ 27లో లిక్విడ్ గ్లాస్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌కు ప‌లు మార్పులు చేశారు. ఆపరేటింగ్ సిస్ట‌మ్ అంత‌టా లిక్విడ్ గ్లాస్ డిజైన్‌ను మ‌రింత విస్తృతంగా ఉప‌యోగించారు. ఇప్ప‌టికే ఇందులో ఉన్న ప‌లు బ‌గ్‌ల‌ను సైతం యాపిల్ ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపింది. కొన్ని ఐఫోన్ మోడ‌ల్స్‌కు ప్ర‌త్యేక‌మైన యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ ల‌భిస్తుంది. ఐఫోన్ డ్యుయో కోసం అప్లికేష‌న్ల‌లో మ‌రింత వెడ‌ల్పైన యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌ను ఇవ్వ‌నున్నారు. ఐఓఎస్ 27లో బ్యాట‌రీ వినియోగానికి సంబంధించి కూడా ప‌లు కీల‌క‌మార్పులు చేశారు. ప‌వ‌ర్ వినియోగం మ‌రింత మెరుగు ప‌డేలా, బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా ల‌భించేలా తీర్చిదిద్దిన‌ట్లు యాపిల్ తెలిపింది.

ఎలా అప్‌డేట్ చేయాలి..

అర్హ‌త క‌లిగిన ఐఫోన్లు ఉన్న‌వారు ఐఓఎస్ 27ను నేటి అర్థ‌రాత్రి నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అందుకు గాను ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌లో ఉన్న జ‌న‌ర‌ల్ విభాగంలోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనే ఆప్ష‌న్‌పై ట్యాప్ చేయాలి. అప్‌డేట్ అందుబాటులోకి వ‌చ్చి ఉంటే అక్క‌డ ఐఓఎస్ 27 వివ‌రాల‌ను చూపిస్తుంది. వెంట‌నే అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసి స్క్రీన్‌పై క‌నిపించే సూచ‌న‌ల ఆధారంగా ఫోన్‌ను కొత్త ఓఎస్‌కు అప్‌డేట్ చేయ‌వ‌చ్చు. అయితే ఫోన్‌లో ఓఎస్ అప్‌డేట్ చేయాలంటే బ్యాట‌రీ క‌నీసం 50 శాతానికి పైగా ఉండాలి. లేదంటే సాఫ్ట్ వేర్ అప్‌డేట్ స‌మ‌యంలో బ్యాట‌రీ వేగంగా ఖర్చయి అప్‌డేట్ స‌రిగ్గా అవ్వ‌క ఫోన్ డెడ్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది.

Advertisement
Advertisement