త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instants App | స్నాప్ చాట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త‌గా ఇన్‌స్టంట్స్ యాప్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Instants App | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ మ‌రో నూత‌న ఇమేజ్ షేరింగ్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇన్‌స్టంట్స్ పేరిట ఆ యాప్‌ను ఇప్ప‌టికే ప‌లు ఎంపిక చేసిన దేశాల్లోని యూజ‌ర్ల‌తో టెస్ట్ చేస్తోంది. అలాగే యాప్‌కు సంబంధించిన ప‌లు వెర్ష‌న్‌ల‌ను కూడా అంత‌ర్గతంగా ప‌రీక్షిస్తోంది.

S

Technology | Published On Apr 26, 2026, 10.08 am IST

Instants App | స్నాప్ చాట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త‌గా ఇన్‌స్టంట్స్ యాప్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..
Advertisement

Instants App | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ మ‌రో నూత‌న ఇమేజ్ షేరింగ్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇన్‌స్టంట్స్ పేరిట ఆ యాప్‌ను ఇప్ప‌టికే ప‌లు ఎంపిక చేసిన దేశాల్లోని యూజ‌ర్ల‌తో టెస్ట్ చేస్తోంది. అలాగే యాప్‌కు సంబంధించిన ప‌లు వెర్ష‌న్‌ల‌ను కూడా అంత‌ర్గతంగా ప‌రీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఈ యాప్‌ను ప్ర‌స్తుతం ఇట‌లీ, స్పెయిన్ వంటి దేశాల యూజ‌ర్ల‌తో టెస్ట్ చేస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తేనున్న ఇన్‌స్టంట్స్ యాప్ ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న స్నాప్ చాట్‌ను పోలి ఉంటుంద‌ని స‌మాచారం. ఇన్‌స్టంట్స్ యాప్‌లో యూజ‌ర్లు షేర్ చేసే ఫొటోలు, వీడియోలు 24 గంట‌ల త‌రువాత ఆటోమేటిగ్గా మాయ‌మ‌వుతాయి. డిసప్పియ‌రింగ్ ఫొటోస్‌, వీడియోస్ పేరిట ఈ ఫీచ‌ర్ ఆ యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే ఎడిట్ చేయ‌ని ఫొటోలు, వీడియోల‌ను మాత్ర‌మే ఇందులో షేర్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఎంపిక చేసిన యూజ‌ర్ల‌తో టెస్టింగ్‌..

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టంట్స్ యాప్‌ను కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే యూజ‌ర్ల‌తో టెస్ట్ చేస్తున్నారు. ఈ యాప్ ప్ర‌స్తుతం కొన్ని దేశాల‌కు చెందిన యూజ‌ర్ల‌కు గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో సైతం ద‌ర్శ‌న‌మిస్తోంది. అయితే ఇన్విటేష‌న్ ప్రాతిపదిక‌న అందుబాటులో ఉంది. అంటే ఆయా దేశాల్లో ఈ యాప్ ల‌భ్య‌మ‌వుతున్న‌ప్ప‌టికీ కేవ‌లం ఇన్విటేష‌న్ ఉన్న‌వారు మాత్ర‌మే ఈ యాప్‌ను వాడ‌గ‌ల‌రు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోని అల్గారిథ‌మ్ ఆధారిత ఫీడ్‌, క్యురేటెడ్ కంటెంట్‌కు భిన్నంగా ఇన్‌స్టంట్స్ యాప్ ప‌నిచేస్తుంది. యూజ‌ర్ల‌కు చెందిన నిజ‌మైన‌, స‌హ‌జ‌సిద్ధ‌మైన క్ష‌ణాల‌ను పంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది లాకెట్‌, బిరియ‌ల్ అనే ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా ప‌నిచేస్తుంద‌ని స‌మాచారం.

24 గంట‌ల్లో మాయ‌మ‌య్యే మీడియా ఫైల్స్‌..

ఇన్‌స్టంట్స్ యాప్ లో యూజ‌ర్లు షేర్ చేసే ఫొటోల‌ను ఇత‌ర యూజ‌ర్లు కేవ‌లం ఒక‌సారి మాత్ర‌మే చూడ‌గ‌లుగుతారు. ఫొటోలు లేదా వీడియోల వంటి మీడియా ఫైల్స్ ఇత‌ర యూజ‌ర్ల‌కు గ‌రిష్టంగా 24 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే చూసేందుకు అందుబాటులో ఉంటాయి. త‌రువాత పూర్తిగా మాయ‌మ‌వుతాయి. యూజ‌ర్లు ఈ యాప్ లో షేర్ చేసే ఫొటోల‌కు కేవ‌లం టెక్ట్స్‌ను మాత్ర‌మే ఓవ‌ర్‌లే మాదిరిగా యాడ్ చేసుకోగ‌లుగుతారు. ఫిల్ట‌ర్లు లేదా ఇత‌ర ఎడిటింగ్ ఆప్ష‌న్లు ఉండ‌వు. ఇదే విష‌య‌మై ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన ఓ ఉద్యోగి టెక్ క్రంచ్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ స్నేహితుల‌తో నిజ‌మైన, సహ‌జ‌సిద్ధ‌మైన క్ష‌ణాల‌ను పంచుకునేందుకు ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. రియ‌ల్‌టైమ్‌లో ఫొటోలు, వీడియోల‌ను పంపించుకోవ‌చ్చ‌ని, యూజ‌ర్ల అభిరుచిని బ‌ట్టి దీనికి మ‌రిన్ని మెరుగులు దిద్ది త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపారు.

ఫొటోల ఎడిట్ కుద‌ర‌దు..

ఇక ఈ యాప్‌లో అప్ లోడ్ చేసే ఫొటోల‌ను ఎడిట్ చేయ‌లేరు. ఈ యాప్‌లోని కెమెరాతో తీసిన ఫొటోల‌ను మాత్ర‌మే అప్‌లోడ్ చేయ‌గ‌ల‌రు. కానీ వాటిని కూడా ఎడిట్ చేయ‌లేరు. కేవ‌లం టెక్ట్స్‌ను మాత్ర‌మే జ‌త చేయ‌వ‌చ్చు. అలాగే ఫోన్ గ్యాల‌రీలోని ఫొటోల‌ను యాప్‌లో అప్ లోడ్ చేయ‌డం కుద‌రదు. యూజ‌ర్లు త‌మ స‌హ‌జ క్ష‌ణాల‌కు చెందిన ఫొటోలు లేదా వీడియోల‌ను ఎలాంటి ఫిల్ట‌ర్లు లేదా ఎడిట్లు లేకుండా నాచుర‌ల్‌గా షేర్ చేసుకునేందుకే ఈ బ్లాకింగ్‌ను అమ‌లు చేస్తున్నారు. ఇక ఇన్‌స్టంట్స్ యాప్‌లో ఫొటోల‌ను మ్యుచువ‌ల్‌ ఫాలోవ‌ర్లు, ఫ్రెండ్స్‌తో మాత్ర‌మే షేర్ చేసుకోవ‌చ్చు. ఇత‌రులు వీక్షించ‌డం కుద‌ర‌దు. అలాగే ఇన్‌సంట్స్ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో అనుసంధానం చేయ‌వ‌చ్చు. దీంతో ఆ యాప్‌లోని లిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో సింక్ అవుతుంది. ఇక క్లుప్తంగా చెప్పాలంటే ఇన్‌స్టంట్స్ యాప్‌లో ఎవ‌రైనా మిమ్మ‌ల్ని ఫాలో అయితే మీరు కూడా వారిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఇద్ద‌రూ షేర్ చేసుకునే మీడియా ఫైల్స్ ఇరువురికీ క‌నిపిస్తాయి. ఇలా ఈ యాప్ ప‌నిచేస్తుంది.

స్టాండ‌లోన్ యాప్‌గానే..?

ఇన్‌స్టాగ్రామ్ టెస్ట్ చేస్తున్న ఇన్‌స్టంట్స్ యాప్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల‌పై అందుబాటులో ఉంది. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోనే దీన్ని ఇన్విటేష‌న్ ప్రాతిప‌దిక‌న టెస్ట్ చేస్తున్నారు. అయితే ఇన్‌స్టంట్స్ యాప్ ప్ర‌స్తుతం స్టాండ‌లోన్ యాప్‌గా అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ దీన్ని మ‌రో యూనిక్ యాప్ గా లాంచ్ చేయాలా, లేక ఇన్‌స్టాగ్రామ్‌లోనే ప్ర‌త్యేక ఫీచ‌ర్‌లా అందించాలా అన్న విష‌యంపై చ‌ర్చిస్తున్నారు. ఆయా వెర్ష‌న్ల‌ను ప‌రీక్షించిన త‌రువాత పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్ప‌టికే అనేక ఫీచ‌ర్లు అందుబాటులో ఉండ‌గా, ఇన్‌సంట్స్ యాప్‌ను ఒక స్టాండ‌లోన్ అప్లికేష‌న్‌గా అందుబాటులోకి తెచ్చే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ప్రైవ‌సీకి భంగం క‌ల‌గ‌కుండా, యూజ‌ర్ల డేటాకు ర‌క్ష‌ణ ఉండేలా, అత్యంత స‌హ‌జ‌మైన రీతిలో సంభాష‌ణ‌లు సాగేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇది ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న స్నాప్ చాట్‌కు గ‌ట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement