త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌ తన ఎడిట్స్‌ యాప్‌లో కొత్త ఏఐ వీడియో ఎడిటింగ్‌ టూల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. క్యాప్‌కట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన ఎడిట్స్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. సాధారణంగా అందరికీ ఒకే రకమైన సూచనలు ఇచ్చే ఏఐ టూల్స్‌కు భిన్నంగా, ఈ సంభాషణాత్మక ఏఐ అసిస్టెంట్‌ ప్రతి ఒక్క క్రియేటర్‌కు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా సూచనలు, విశ్లేషణ అందించనుంది.

S

Technology | Published On Oct 1, 2026, 12.43 pm IST

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..
Advertisement

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌ తన ఎడిట్స్‌ యాప్‌లో కొత్త ఏఐ వీడియో ఎడిటింగ్‌ టూల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. క్యాప్‌కట్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన ఎడిట్స్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. సాధారణంగా అందరికీ ఒకే రకమైన సూచనలు ఇచ్చే ఏఐ టూల్స్‌కు భిన్నంగా, ఈ సంభాషణాత్మక ఏఐ అసిస్టెంట్‌ ప్రతి ఒక్క క్రియేటర్‌కు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా సూచనలు, విశ్లేషణ అందించనుంది. ఎడిట్స్‌ యాప్‌కు నాయకత్వం వహిస్తున్న బ్రెట్‌ వెస్టర్‌వెల్ట్‌ బ్లాగ్‌ పోస్టులో ఈ ఏఐ అసిస్టెంట్‌ ఎలా పనిచేస్తుందో వివరించారు. క్రియేటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు సంబంధించిన ఫాలోస్‌, వ్యూస్‌, వీడియో రిటెన్షన్‌, లైక్స్‌, షేర్స్‌ వంటి మెట్రిక్స్‌ను ఈ అసిస్టెంట్‌ తెలుసుకుంటుందని ఆయన తెలిపారు. వీటితోపాటు క్రియేటర్‌ పోస్టులకు వచ్చిన కామెంట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న అంశాలు, సంబంధిత ఆడియన్స్‌ ఆసక్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.

డేటాను విశ్లేషించి సూచ‌న‌లు..

క్రియేటర్‌ పనితీరులో కాలక్రమేణా ఏర్పడుతున్న నమూనాలను ఈ టూల్ గుర్తిస్తుంద‌ని వెస్టర్‌వెల్ట్‌ తెలిపారు. కేవలం మెట్రిక్స్‌ను చూడడం ద్వారా గుర్తించడం కష్టమైన అంశాలను కూడా విశ్లేషించి, వాటి ఆధారంగా ఉపయోగకరమైన సూచనలను అందించనుంది. అంటే ఒక క్రియేటర్ సొంత పనితీరు డేటాను ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లోని ట్రెండ్స్‌, ఆడియన్స్‌ ప్రవర్తనతో కలిపి విశ్లేషించి అవసరమైన సూచనలు ఇవ్వనుంది. ఈ టూల్‌ను రూపొందించే సమయంలో ఎడిట్స్‌ టీమ్‌ కొంతమంది క్రియేటర్లతో కలిసి పనిచేసిందని వెస్టర్‌వెల్ట్‌ తెలిపారు. ఈ ప్రక్రియలో క్రియేటర్లు పదేపదే ఒక విషయాన్ని చెప్పారని ఆయన వెల్లడించారు. తమ సృజనాత్మక నిర్ణయాలను ఏఐ తీసుకోవడం కంటే, డేటా విశ్లేషణకు సంబంధించిన భారాన్ని ఏఐ చూసుకోవాలని వారు కోరుకున్నారని చెప్పారు. క్రియేటర్ల కోసం ఎడిట్స్‌ అసిస్టెంట్‌ అవసరమైన విశ్లేషణను స్వయంగా చేస్తుందని, అయితే సృజనాత్మక నిర్ణయాలు మాత్రం క్రియేటర్ల చేతుల్లోనే ఉంటాయని వెస్టర్‌వెల్ట్‌ పేర్కొన్నారు. అంటే ఏ వీడియో చేయాలి, ఏ విధంగా రూపొందించాలి అనే తుది నిర్ణయాన్ని ఏఐ తీసుకోదు. దానికి బదులుగా క్రియేటర్‌ కంటెంట్‌ ఎలా పనిచేస్తోంది, ఆడియన్స్‌ ఏ అంశాలకు స్పందిస్తోంది వంటి విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో అధిక వినియోగం..

మెటా తొలిసారిగా ఎడిట్స్‌ ఏఐ అసిస్టెంట్‌ను జూన్‌లో క్రియేటర్ల కోసం నిర్వహించిన ఆహ్వానిత కార్యక్రమంలో ప్రదర్శించింది. అదే సమయంలో ఎడిట్స్‌ యాప్‌కు డెస్క్‌టాప్‌ వెర్షన్‌పై కూడా పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇలాంటి టూల్స్‌పై పనిచేస్తున్న మరో సంస్థ యూట్యూబ్‌. యూట్యూబ్‌ గత వారం తన సొంత సంభాషణాత్మక వీడియో ఎడిటింగ్‌ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకు వెల్లడైన వివరాలను పరిశీలిస్తే, మెటా రూపొందిస్తున్న ఏఐ అసిస్టెంట్‌ ప్రధానంగా విశ్లేషణపై దృష్టి పెడుతోంది. క్రియేటర్లు తమ పనితీరు డేటాను అర్థం చేసుకునేందుకు ఇది సహాయపడుతుంది. మరోవైపు, యూట్యూబ్‌ రూపొందిస్తున్న ఏఐ టూల్‌ నేరుగా వీడియో ఎడిటింగ్‌ ప్రక్రియలో సహాయం చేసే దిశగా ఉండనుంది. దీంతో ఒకే తరహా లక్ష్యంతో కనిపిస్తున్నప్పటికీ, రెండు సంస్థలు ఈ టూల్స్‌ను భిన్నమైన విధానాల్లో అభివృద్ధి చేస్తున్నాయి. క్రియేటర్లు ఈ ఏఐ అసిస్టెంట్‌ను అపరిమితంగా ఉపయోగించలేరు. దీనిపై వినియోగ పరిమితి ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. అయితే మెటా వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం ద్వారా ఈ వినియోగ పరిమితిని పెంచుకునే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement