త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Instagram | సెల‌బ్రిటీల‌కు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. భారీగా ఫేక్ ఫాలోవ‌ర్ల తొల‌గింపు..

Instagram | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప‌లువురు సెల‌బ్రిటీల‌కు షాకిచ్చింది. భారీ స్థాయిలో ఉన్న ఫేక్ ఫాలోవ‌ర్ల అకౌంట్ల‌ను తొల‌గించింది. దీంతో చాలా మంది సెల‌బ్రిటీలు భారీ ఎత్తున ఫాలోవ‌ర్ల‌ను కోల్పోయారు. ఈ మేర‌కు పాప్‌బేస్ తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

S

Technology | Published On May 7, 2026, 2.09 pm IST

Instagram | సెల‌బ్రిటీల‌కు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. భారీగా ఫేక్ ఫాలోవ‌ర్ల తొల‌గింపు..
Advertisement

Instagram | ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప‌లువురు సెల‌బ్రిటీల‌కు షాకిచ్చింది. భారీ స్థాయిలో ఉన్న ఫేక్ ఫాలోవ‌ర్ల అకౌంట్ల‌ను తొల‌గించింది. దీంతో చాలా మంది సెల‌బ్రిటీలు భారీ ఎత్తున ఫాలోవ‌ర్ల‌ను కోల్పోయారు. ఈ మేర‌కు పాప్‌బేస్ తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ ప్ర‌క్రియ‌ను ఈ ఏడాది ఆరంభంలోనే మెటా చేప‌ట్టింద‌ని, ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ సంఖ్య‌లో ఉన్న బాట్ (ఫేక్‌) అకౌంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంద‌ని వెల్ల‌డించింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ భారీ క్లీన‌ప్ చ‌ర్య‌గా అభివర్ణిస్తున్నారు. ఇందులో భాగంగా ల‌క్ష‌లాది ఫేక్, ఇనాక్టివ్ అకౌంట్ల‌ను తొల‌గించారు. దీంతో ప‌లువురు సెల‌బ్రిటీల‌తోపాటు ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌కు చెందిన ఫాలోవ‌ర్ల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గింది.

కైలీ జెన్న‌ర్ టాప్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్ర‌మే కాకుండా అనేక సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోవ‌ర్లు, స‌బ్‌స్క్రైబ‌ర్లు, లైకులు, షేర్లు వంటి సంఖ్య‌ను పెంచుకునేలా కొంద‌రు హ్యాక‌ర్లు ఆన్‌లైన్ లో నిర్దిష్ట రుసుముకు డిజిట‌ల్ సేవ‌ల‌ను అందిస్తున్నారు. అయితే అలాంటి సేవ‌లను చాలా మంది ఉప‌యోగించుకుని ఫేక్ లేదా బాట్ ఫాలోవ‌ర్ల ద్వారా ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచుకుంటున్నారు. ఇది వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఫేక్ ఫాలోవ‌ర్ల‌కు స్థానం లేద‌ని, నిజ‌మైన యూజ‌ర్ల సంఖ్య‌ను పెంచ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. యూజ‌ర్ల‌కు ప్లాట్‌ఫామ్‌పై మ‌రింత విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ క్లీన‌ప్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలియ‌జేసింది. అయితే ఇది త‌ర‌చూ జరిగే ప్ర‌క్రియే అయిన‌ప్ప‌టికీ ఈసారి మాత్రం భారీ ఎత్తున ఫేక్ అకౌంట్ల‌ను తొల‌గించ‌డంతో సెల‌బ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల అకౌంట్ల‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ముఖ్యంగా అమెరిక‌న్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌, బిలియ‌నీర్ కైలీ జెన్న‌ర్ ఈ క్లీన‌ప్‌లో భాగంగా భారీ ఎత్తున ఫాలోవ‌ర్ల‌ను కోల్పోయారు. ఆమెకు ప్ర‌స్తుతం ఏకంగా 1.40 కోట్ల మేర ఫాలోవ‌ర్లు త‌గ్గిన‌ట్లు పాప్ బేస్ వెల్ల‌డించింది.

యాక్టివ్ ఫాలోవ‌ర్ల‌పై ప్ర‌భావం ఉండ‌దు..

ఇక ఇన్‌స్టా క్లీన‌ప్ డ్రైవ్‌లో ఇత‌ర సెల‌బ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల ఫాలోవ‌ర్ల సంఖ్య‌ల్లో కూడా అక‌స్మాత్తుగా భారీ త‌గ్గుద‌ల క‌నిపించింది. ఈ చ‌ర్య‌పై ఓ మెటా ప్ర‌తినిధి స్పందిస్తూ ఇనాక్టివ్ అకౌంట్ల‌ను తొల‌గించే త‌మ సాధార‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగానే ఈ క్లీన‌ప్‌ను చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. కొన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య‌లు మారుతాయ‌ని, కానీ యాక్టివ్ ఫాలోవ‌ర్ల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని తెలిపారు. స‌స్పెండ్ అయిన అకౌంట్ తిరిగి ధ్రువీక‌ర‌ణ పొందితే మ‌ళ్లీ ఫాలోవ‌ర్ల కౌంట్ పెరుగుతుంద‌ని తెలిపారు.

బాట్ అంటే..

సాధారణంగా బాట్ అనేది ఆన్‌లైన్‌లో సోష‌ల్ మీడియా లేదా వెబ్‌సైట్ల‌లో ఆటోమేటిక్‌గా ప‌నిచేసే ఓ ప్రోగ్రామ్. ఇవి అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంటాయి. వెబ్‌సైట్ ర‌కాన్ని బ‌ట్టి డెవ‌ల‌ప‌ర్లు బాట్స్‌ను క్రియేట్ చేస్తారు. అవి ఆన్‌లైన్‌లో స‌మాచారాన్ని సేక‌రించ‌డంతోపాటు వెబ్‌సైట్ల‌ను ఇండెక్స్ చేయ‌డం, ప‌లు ఇత‌ర ప‌నులు నిర్వ‌ర్తిస్తాయి. అయితే కొంద‌రు హ్యాక‌ర్లు అస‌లు వ్య‌క్తుల‌తో కాకుండా బాట్‌ల పేరిట న‌కిలీ అకౌంట్ల‌ను సృష్టిస్తున్నారు. వాటి ద్వారా ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను పెంచే మోస‌పూరిత చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీని వ‌ల్ల ఫేక్ ఫాలోవ‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. అలాగే యూజ‌ర్ అస‌లు ఫాలోవ‌రా లేక న‌కిలీనా అన్న విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అందుక‌నే మెటా ఈ క్లీనప్ చేప‌ట్టింది.

ప్ర‌ముఖుల‌కూ త‌ప్ప‌ని పాట్లు..

కాగా అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం క్రిస్టియానో రొనాల్డో, ద‌క్షిణ కొరియా పాప్ బ్యాండ్ బీటీఎస్ వంటి ప్ర‌ముఖుల ఫాలోవ‌ర్ల సంఖ్య కూడా కోట్ల‌లో త‌గ్గిన‌ట్లు తెలిసింది. మెటా చేప‌ట్టిన ఈ క్లీన‌ప్ నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లోనూ యూజ‌ర్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దీన్ని గ్రేట్ ప‌ర్జ్ ఆఫ్ 2026గా అభివ‌ర్ణిస్తున్నారు. ఉద‌యం నిద్ర లేచి చూసే స‌రికి త‌మ ఫాలోవ‌ర్ల సంఖ్య భారీగా త‌గ్గ‌డంతో అనేక మంది విస్మ‌యానికి గుర‌య్యారు. ఈ క్లీన‌ప్ కార‌ణంగా అనేక అకౌంట్ల ఎంగేజ్‌మెంట్ నంబ‌ర్లు, విజిబిలిటీపై కూడా ప్ర‌భావం ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ యూజ‌ర్ చేసిన కామెంట్ కూడా ఈ సంద‌ర్భంగా వైర‌ల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ అధికారిక అకౌంట్‌కే దాదాపు 90 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు త‌గ్గార‌ని అత‌ను తెలిపాడు. అందువ‌ల్ల యూజ‌ర్లు దీని గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని అన్నాడు.

Advertisement
Advertisement