త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Phones | స్మార్ట్ ఫోన్‌ల‌లో దృఢ‌మైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగ‌దారులు.. స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డి..

Smart Phones | స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే భారత‌ వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ వంటి ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చిన వినియోగదారులు ఇప్పుడు డివైస్ మన్నిక, దీర్ఘకాలిక విశ్వసనీయతపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని కార్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్ విడుదల చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది.

S

Technology | Published On Jul 13, 2026, 12.10 pm IST

Smart Phones | స్మార్ట్ ఫోన్‌ల‌లో దృఢ‌మైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగ‌దారులు.. స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డి..
Advertisement

Smart Phones | స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే భారత‌ వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ వంటి ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చిన వినియోగదారులు ఇప్పుడు డివైస్ మన్నిక, దీర్ఘకాలిక విశ్వసనీయతపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని కార్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్ విడుదల చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం దేశంలోని 53 శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు స్క్రీన్ పగిలిపోవడం వల్ల అనుకున్న సమయం కంటే ముందుగానే కొత్త ఫోన్ కొనాల్సి వచ్చిందని తెలిపారు. రోజువారీ జీవితంలో జరిగే ప్రమాదాలు కొనుగోలు నిర్ణయాలతోపాటు బ్రాండ్‌పై విశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని సర్వే పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లు ప్రమాదవశాత్తూ పడిపోవడం సాధారణ విషయంగా మారిందని అధ్యయనం వెల్లడించింది. గతేడాదిలో 87 శాతం మంది తమ ఫోన్‌ను కనీసం ఒక్కసారైనా కింద పడేశామని తెలిపారు. దీంతో 56 శాతం మంది స్క్రీన్ కవర్ గ్లాస్ మన్నికపై ఆందోళన వ్యక్తం చేశారు.

స్క్రీన్ ప‌గిలితే ఆర్థిక‌, మాన‌సిక ఒత్తిడి..

స్క్రీన్ పగిలిపోవడం కేవలం రూపాన్ని మాత్రమే కాదు, వినియోగదారుల ఆర్థిక, మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతోందని నివేదిక వెల్లడించింది. ప్రతి ఐదు సార్లలో ఒకసారి ఫోన్ పడిపోయి కవర్ గ్లాస్ పగిలినప్పుడు ప్రొఫెషనల్ రిపేర్ చేయించాల్సి రావడం లేదా పూర్తిగా కొత్త డివైస్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ రిపేర్ల కోసం సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా స్క్రీన్ పగిలిపోవడం వల్ల రోజువారీ పనుల్లో అంతరాయం కలగడంతోపాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది. అందుకే 61 శాతం మంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలో కంపెనీలు చెప్పే మన్నికకు సంబంధించిన వివరాలు తమ నిర్ణయాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. డివైస్ రక్షణలో వినియోగదారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అంశాల్లో 52 శాతం మంది డ్రాప్ ప్రొటెక్షన్‌ను ఎంపిక చేశారు. మరో 52 శాతం మంది ఫోన్ ముందు, వెనుక భాగాలకు సమాన రక్షణ ఉండాలని కోరుకున్నారు. అలాగే 48 శాతం మంది స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను ముఖ్యమైన ఫీచర్‌గా పేర్కొన్నారు.

గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్ల‌కు ప్ర‌యారిటీ..

కవర్ గ్లాస్ బ్రాండ్ల విషయంలో కూడా వినియోగదారుల్లో మంచి అవగాహన ఉందని సర్వే వెల్లడించింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ గురించి 66 శాతం మంది గుర్తింపు కలిగి ఉండగా, ఇది అధ్యయనంలో పేర్కొన్న అన్ని కవర్ గ్లాస్ బ్రాండ్లలో అత్యధిక గుర్తింపు రేటు కావ‌డం విశేషం. అలాగే తమ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ ఉందని తెలిస్తే అలాంటి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని 64 శాతం మంది తెలిపారు. ఇప్పుడు వినియోగదారుల అంచనాలు కేవలం మన్నికతో మాత్రమే పరిమితం కావడం లేదు. డిస్‌ప్లే నాణ్యత, కెమెరా పనితీరుపై కూడా సమాన దృష్టి పెడుతున్నారు. 58 శాతం మంది డిస్‌ప్లే క్లారిటీని అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా పేర్కొనగా, 53 శాతం మంది కెమెరా లెన్స్ మన్నికకు ప్రాధాన్యం ఇచ్చారు. స్మార్ట్‌ఫోన్ కెమెరాలు మరింత అధునాతనంగా మారుతున్న నేపథ్యంలో లెన్స్ దెబ్బతింటే మొత్తం డివైస్ ఉపయోగం తగ్గిపోతుందని వినియోగదారులు భావిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.

అద‌న‌పు ధ‌ర చెల్లించేందుకు సిద్ధం..

మెరుగైన మన్నిక కోసం అదనపు ధర చెల్లించేందుకు కూడా భారత‌ వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని సర్వే తెలిపింది. మొత్తం 74 శాతం మంది మెరుగైన కవర్ మెటీరియల్, అధిక మన్నిక, ఉత్తమ ఆప్టికల్ పనితీరు వంటి ఫీచర్ల కోసం ప్రీమియం ధర చెల్లించేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ ఆండ్రూ బెక్ మాట్లాడుతూ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు పని, కమ్యూనికేషన్, వినోదం వంటి ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అందువల్ల మన్నిక అంటే ఇకపై ద్వితీయ ప్రాధాన్య ఫీచర్ కాదని, మొత్తం డివైస్ అనుభవంలో ప్రధాన అంశంగా మారిందని చెప్పారు. నిజ జీవిత వినియోగాన్ని తట్టుకునేలా, పనితీరు, డిజైన్, డిస్‌ప్లే స్పష్టతలో రాజీ పడకుండా ఉండే ఫోన్‌లను వినియోగదారులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా అభివృద్ధి చేసిన మెటీరియల్స్‌తో వినియోగదారులకు మరింత విశ్వాసాన్ని అందించేందుకు గొరిల్లా గ్లాస్ ను రూపొందించామ‌ని తెలిపారు.

ఎక్కువ కాలం మ‌న్నికే ల‌క్ష్యంగా..

వినియోగదారులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువ కాలం, మరింత విస్తృతంగా, క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ప్రీమియం డిజైన్‌తోపాటు మన్నిక కూడా సమానంగా అవసరమని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. రూపం, అనుభూతి, పనితీరులో ఎలాంటి రాజీ పడకుండా ఎక్కువకాలం ఉపయోగించగలిగే డివైస్‌లను వినియోగదారులు ఆశిస్తున్నారని వివరించారు. ఈ అధ్యయనం కోసం 2025 నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1,509 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఇందులో భాగస్వామ్యం చేశారు. మహిళలు, పురుషులు సమానంగా పాల్గొనడంతోపాటు వివిధ వయసు వర్గాలు, ప్రాంతాలు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, ధర విభాగాలు, గేమర్లు, ప్రొఫెషనల్స్, పవర్ యూజర్లను కూడా ఈ సర్వేలో చేర్చారు.

Advertisement
Advertisement