త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart TV | స్మార్ట్ టీవీని కొంటున్నారా..? ఈ 4 అంశాలు చాలా ముఖ్యం..!

Smart TV | ప్ర‌స్తుతం హోమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే ప‌దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఒక‌ప్పుడు టీవీల‌కు కేబుల్ క‌నెక్ష‌న్ ఉంటే ఎక్కువ‌. కానీ ఇప్పుడు వ‌స్తున్న టీవీల‌కు అంత‌కు మించి అన్న‌ట్లుగా స‌దుపాయాల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Feb 22, 2026, 7.39 am IST

Smart TV | స్మార్ట్ టీవీని కొంటున్నారా..? ఈ 4 అంశాలు చాలా ముఖ్యం..!
Advertisement

Smart TV | ప్ర‌స్తుతం హోమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే ప‌దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఒక‌ప్పుడు టీవీల‌కు కేబుల్ క‌నెక్ష‌న్ ఉంటే ఎక్కువ‌. కానీ ఇప్పుడు వ‌స్తున్న టీవీల‌కు అంత‌కు మించి అన్న‌ట్లుగా స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఏ యాప్‌ను అయినా స‌రే ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు క‌ల‌గ‌డంతోపాటు వినియోగ‌దారుల‌కు పూర్తి స్థాయిలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ల‌భించేలా ప్ర‌స్తుతం స్మార్ట్ టీవీల‌ను కంపెనీలు త‌యారు చేసి అందిస్తున్నాయి. దీంతో స్మార్ట్ టీవీలు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తున్నాయి. మార్కెట్లో ఇప్ప‌టికే అనేక బ్రాండ్ల‌కు చెందిన స్మార్ట్ టీవీలు ఆధునిక ఫీచ‌ర్ల‌తో అందుబాటులో ఉన్నాయి. వాట‌న్నింటిలోనూ అస‌లు ఏ స్మార్ట్ టీవీని కొనాల‌ని స‌హజంగానే చాలా మందికి సందేహాలు వ‌చ్చి గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు. కానీ స్మార్ట్ టీవీని కొనే ముందు 4 ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని, లేదంటే టీవీని కొన్నాక అది వినియోగ‌దారుల వీక్ష‌ణ అనుభ‌వాన్ని దెబ్బ తీసే అవ‌కాశం ఉంటుంద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు.

డిస్‌ప్లే ప్యానల్ టెక్నాలజీ

పెద్ద స్క్రీన్ ఉన్నా ప్యానల్ నాణ్యత బాగోలేకపోతే చూసే ఆనందమే ఉండదు. అందుకే టీవీలో ఉపయోగించిన ప్యానల్ రకం చాలా ముఖ్యం. సాదార‌ణంగా ఎల్‌సీడీ టీవీల‌ను మార్కెట్‌లో చాలా త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తారు. ఇవి త‌క్కువ నాణ్య‌త‌ను కలిగి ఉంటాయి. బ‌దులుగా ఎల్ఈడీ, ఓఎల్ఈడీ (ఓలెడ్‌), క్యూఎల్ఈడీ (క్యూలెడ్‌) ర‌కాల‌కు చెందిన ప్యానల్స్ అయితే మంచిది. ఇవి తెర‌పై అద్భుత‌మైన రంగుల‌ను ప్ర‌ద‌ర్శిస్తాయి. ఏ కోణంలో చూసినా, కాంతి మీద ప‌డినా దృశ్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. బ్రైట్‌నెస్ అధికంగా ఉంటుంది. ఎల్‌సీడీ క‌న్నా ఈ ప్యాన‌ల్స్ ధ‌ర ఎక్కువే. కానీ టీవీని మ‌ళ్లీ మ‌ళ్లీ కొన‌రు క‌దా. ముందే నాణ్య‌మైన టీవీని కొంటే త‌రువాత మ‌ళ్లీ దాని కోసం డ‌బ్బులు వెచ్చించాల్సిన ప‌ని ఉండ‌దు. తీసుకునే టీవీ నాణ్యంగా ఉంటే వీక్ష‌ణ అనుభ‌వం కూడా సంతృప్తిగా అనిపిస్తుంది. వినియోగ‌దారులు త‌మ బ‌డ్జెట్‌ను బ‌ట్టి ఎల్ఈడీ ప్యాన‌ల్స్‌లో ర‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు.

స్మార్ట్ ఫీచర్లు

స్మార్ట్ టీవీ అంటేనే ఫీచర్ల విషయం. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చాలా వ‌ర‌కు టీవీల్లో ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఇస్తున్నారు. కొన్ని స్మార్ట్ టీవీల్లో వెబ్ ఓఎస్‌, టైజెన్ వంటి ప్లాట్‌ఫామ్‌ల‌ను ఇస్తున్నారు. ప్లాట్ ఫామ్ ఏదైనా స‌రే యాప్‌లను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ యాప్ ల‌ను ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా స‌పోర్ట్ ల‌భించాలి. వాయిస్ అసిస్టెంట్ ఫీచ‌ర్ అందుబాటులో ఉందా అన్న విష‌యాన్ని గ‌మ‌నించాలి. ఈ ఫీచర్లు వినియోగ‌దారుల రోజువారి వినియోగాన్ని మరింత సులభతరం చేస్తాయి.

సౌండ్ క్వాలిటీ

చిత్రం ఎంత బాగున్నా శబ్దం బాగోలేకపోతే అనుభవం పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి సౌండ్ అవుట్‌పుట్‌ను తప్పకుండా చెక్ చేయాలి. టీవీల‌కు క‌నీసం 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఉండేలా చూసుకోవాలి. కొన్ని స్మార్ట్ టీవీల‌కు డాల్బీ ఆడియో స‌పోర్ట్‌ను ఇస్తున్నారు. అలాంటి టీవీలు అయితే ఇంకా మంచిది. మ‌రింత మెరుగైన శ‌బ్ద నాణ్య‌త‌ను ఆస్వాదించ‌వ‌చ్చు.

ర్యామ్‌, స్టోరేజ్

స్మార్ట్ టీవీలు కూడా స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ర్యామ్, స్టోరేజ్‌తో వస్తాయి. ఎక్కువ ర్యామ్ ఉంటే యాప్‌లు వేగంగా పనిచేస్తాయనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ర్యామ్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల వినియోగ‌దారులు ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కు మారే వేగం త‌గ్గుతుంది. టీవీ ఓఎస్ ప్లాట్‌ఫామ్ హ్యాంగ్ అవ‌కుండా ఉంటుంది. స్మూత్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇక స్టోరేజ్ అధికంగా ఉంటే ఎక్కువ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

వినియోగ‌దారులు ఈ 4 అంశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ టీవీని కొంటే అద్భుత‌మైన వీక్ష‌ణ అనుభ‌వాన్ని పొంద‌గలుగుతారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని టీవీని కొనుగోలు చేస్తే ఎక్కువ సంవ‌త్సరాల పాటు టీవీని మార్చాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. స్మార్ట్ టీవీ అంటే కేవ‌లం స్క్రీన్ సైజ్ మాత్ర‌మే కాదు.. ప్యాన‌ల్ ర‌కం, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, యాప్స్‌కు స‌పోర్ట్‌, సౌండ్ క్వాలిటీ, ర్యామ్‌, స్టోరేజ్ వంటి అన్ని అంశాల‌కు ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంది. స‌రైన నిర్ణ‌యంతో స్మార్ట్ టీవీని ఎంపిక చేస్తే కొన్నేళ్ల త‌ర‌బ‌డి నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చు.

Advertisement
Advertisement