త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | 17.5 ల‌క్ష‌ల యాప్‌ల‌ను బ్లాక్ చేశాం.. ఆండ్రాయిడ్ సెక్యూరిటీపై గూగుల్ కీల‌క విష‌యాలు వెల్ల‌డి..

Google | ఆండ్రాయిడ్‌, గూగుల్‌ ప్లే ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా టెక్ దిగ్గ‌జ సంస్థ‌ గూగుల్‌ 2025 సంవత్సరంలో చేప‌ట్టిన భద్రతా చర్యలను వెల్లడించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

S

Technology | Published On Feb 20, 2026, 12.28 pm IST

Google | 17.5 ల‌క్ష‌ల యాప్‌ల‌ను బ్లాక్ చేశాం.. ఆండ్రాయిడ్ సెక్యూరిటీపై గూగుల్ కీల‌క విష‌యాలు వెల్ల‌డి..
Advertisement

Google | ఆండ్రాయిడ్‌, గూగుల్‌ ప్లే ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా టెక్ దిగ్గ‌జ సంస్థ‌ గూగుల్‌ 2025 సంవత్సరంలో చేప‌ట్టిన భద్రతా చర్యలను వెల్లడించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. మాల్ వేర్‌, ఆర్థిక మోసాలు, ప్రైవ‌సీ డేటా దుర్వినియోగం, స్పామ్‌ యాప్‌లు, హిడెన్‌ సబ్‌స్క్రిప్షన్‌లను అడ్డుకునేందుకు ఏఐ ఆధారిత రివ్యూలు, రియల్‌టైమ్‌ ప్రొటెక్షన్లు, కఠిన డెవలపర్‌ వెరిఫికేషన్‌ విధానాల‌ను అమలు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ చర్యలు గూగుల్‌ ప్లే, ప్లే ప్రొటెక్ట్‌, అలాగే ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌ స్థాయిలో అమలులోకి వచ్చాయని స్పష్టం చేసింది.

17.5 ల‌క్ష‌ల యాప్‌లు బ్లాక్‌..

గూగుల్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 17.5 లక్షలకుపైగా పాలసీ ఉల్లంఘనల‌కు పాల్ప‌డిన యాప్‌లను ప్లే స్టోర్‌లోకి రాకముందే నిలిపివేశారు. 80 వేలకుపైగా హానికర యాప్‌ల‌ను ప్లే స్టోర్‌లో ప‌బ్లిష్ చేసేందుకు ప్రయత్నించిన డెవలపర్ల‌ ఖాతాలను బ్యాన్‌ చేశారు. అలాగే ప్రతి యాప్ ప్లే స్టోర్‌లోకి వ‌చ్చే ముందు 10వేల‌కుపైగా సెక్యూరిటీ తనిఖీలు జరుగుతాయని, లైవ్‌లోకి వచ్చిన తర్వాత కూడా యాప్‌లపై నిరంతర సమీక్ష కొనసాగుతుందని గూగుల్‌ తెలిపింది. డెవలపర్‌ వెరిఫికేషన్‌, ప్రీ-రివ్యూ చెక్స్‌, టెస్టింగ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేశామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఏఐ మోడ‌ళ్ల ద్వారా మాల్ వేర్ గుర్తింపు..

ప్లే స్టోర్ రివ్యూల‌లో జ‌నరేటివ్ ఏఐ మోడళ్లను ఉపయోగించడం ద్వారా క్లిష్టమైన మాల్ వేర్‌ ప్యాటర్న్‌లను వేగంగా గుర్తించగలుగుతున్నామని గూగుల్‌ వెల్లడించింది. 2025లో 2.55 లక్షలకుపైగా యాప్‌లకు అధికంగా సెన్సిటివ్‌ డేటా యాక్సెస్‌ను నిరోధించామ‌ని, ప్రైవసీ పాలసీలను మరింత బలోపేతం చేశామ‌ని తెలిపింది. అలాగే యాప్‌ల రేటింగ్స్‌ మానిప్యులేషన్‌ను అడ్డుకునేందుకు 16 కోట్ల స్పామ్‌ రివ్యూలు, రేటింగ్స్‌ను బ్లాక్‌ చేశామ‌ని, రివ్యూ బాంబింగ్‌ వల్ల యాప్‌లకు వచ్చే సగటు 0.5 స్టార్‌ రేటింగ్‌ నష్టాన్ని నివారించామ‌ని తెలియ‌జేసింది. గాంబ్లింగ్‌, డేటింగ్‌ వంటి యాప్‌లను చిన్నారులు గుర్తించ‌కుండా ఉండేందుకు అదనపు కంట్రోల్స్‌ను అమ‌లు చేశామ‌ని, ఇవి ఇప్పటికే ఉన్న పేరెంటల్‌ కంట్రోల్ సిస్ట‌మ్‌లను మరింత బలోపేతం చేశాయ‌ని తెలిపింది.

రోజుకు 350 బిలియ‌న్ల యాప్‌ల స్కానింగ్‌..

ఆండ్రాయిడ్‌లోని ఇన్‌బిల్ట్ మాల్‌వేర్‌ డిఫెన్స్‌ అయిన గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ రోజుకు 350 బిలియన్ల యాప్‌లను స్కాన్‌ చేస్తోంద‌ని, గ‌తేడాదిలో ప్లే స్టోర్‌ వెలుపల నుంచి వచ్చిన 2.7 కోట్ల హానికర యాప్‌లను గుర్తించామ‌ని, యూజర్లకు రియల్‌టైమ్‌ హెచ్చరికలు ఇచ్చామ‌ని గూగుల్ వెల్ల‌డించింది. 185 దేశాల్లో అమలులో ఉన్న ఫ్రాడ్‌ ప్రొటెక్షన్‌ ద్వారా 266 మిలియన్ల‌ రిస్కీ ఇన్‌స్టాలేషన్‌ ప్రయత్నాలను అడ్డుకున్నామ‌ని, 8.72 లక్షల హై-రిస్క్‌ యాప్‌ల నుంచి యూజర్లను రక్షించామ‌ని తెలిపింది. ఫోన్‌ కాల్‌లో ఉండగానే ప్లే ప్రొటెక్ట్‌ను ఆఫ్‌ చేయకుండా అడ్డుకునే ఇన్-కాల్‌ స్కామ్‌ ప్రొటెక్షన్ ను కూడా తీసుకొచ్చిన‌ట్లు తెలిపింది.

ఆండ్రాయిడ్‌ 16లో బ్యాంకింగ్‌ వివరాల వంటి సున్నిత సమాచారానికి అదనపు రక్షణ లభిస్తుందని, ట్యాప్‌జాకింగ్‌ దాడుల్ని కూడా అడ్డుకునే ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని గూగుల్‌ స్పష్టం చేసింది. భ‌విష్యత్తులో కూడా ఏఐ ఆధారిత డిటెక్షన్‌, డెవలపర్‌ వెరిఫికేషన్‌, పాలసీ చెక్స్‌ను మరింత విస్తరిస్తామని గూగుల్‌ తెలిపింది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు సురక్షితమైన, నమ్మదగిన డిజిటల్‌ అనుభవాన్ని అందిస్తామ‌ని తెలియ‌జేసింది.

Advertisement
Advertisement