త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Attack | యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌పై సైబ‌ర్ దాడి!

Cyber Attack | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ సైబర్ దాడి బారిన‌ప‌డింది. ఆ దళానికి చెందిన కీలక డిజిటల్ వేదిక ‘క్లౌడ్ వన్‌’లోకి హ్యాకర్లు చొరబడినట్లు వెల్లడైంది. ఈ పరిణామం అమెరికా సైనిక వ్యవస్థల సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది.

P

International | Published On Nov 27, 2026, 6.26 pm IST

Cyber Attack | యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌పై సైబ‌ర్ దాడి!
Advertisement
  • కీలక క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ ‘క్లౌడ్ వన్‌’లోకి చొరబాటు
  • సిబ్బంది వివరాలు, చెల్లింపులు, ఆయుధ వ్యవస్థలకు స‌మాచారంపై క‌న్ను
  • కొత్త యాప్స్‌, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ నిలిపివేత

Cyber Attack | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ సైబర్ దాడి బారిన‌ప‌డింది. ఆ దళానికి చెందిన కీలక డిజిటల్ వేదిక ‘క్లౌడ్ వన్‌’లోకి హ్యాకర్లు చొరబడినట్లు వెల్లడైంది. ఈ పరిణామం అమెరికా సైనిక వ్యవస్థల సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. సిబ్బంది వివరాలు, చెల్లింపులు, ఆయుధ వ్యవస్థలు, సైనిక పరికరాలకు సంబంధించిన పలు వ్యవస్థలు ఈ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లోనే ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాడిని గుర్తించిన వెంటనే వేదికపై పలు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

అప్‌గ్రేడ్‌ సమయంలో వెలుగులోకి..

గత నెల రోజులుగా కొనసాగుతున్న క్లౌడ్ వన్‌ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రేడ్ ప్రక్రియలో ఈ సైబర్ చొరబాటు బయటపడినట్లు సమాచారం. దీంతో కొత్త అప్లికేషన్లను జోడించే ప్రక్రియను అమెరికా వైమానిక దళం నిలిపివేసింది. ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌ల అప్‌డేట్స్‌నూ తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా కొంతమంది వినియోగదారులకు ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అధికారాలను కూడా రద్దు చేసింది. వ్యవస్థలోకి మరింతగా చొరబడకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఎవరున్నారు? హ్యాకర్లు వ్యవస్థలోకి ఎంతవరకు చొరబడ్డారు? ఏమైనా కీలక సమాచారాన్ని దొంగిలించారా? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. సున్నితమైన సైనిక సమాచారం బయటకు వెళ్లిందా లేదా? అన్న విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు.

కంట్రోల్ ప్లేన్‌లో లోపమే కారణమా?

క్లౌడ్ వన్‌ వ్యవస్థలోని సాఫ్ట్‌వేర్ భద్రతా లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు చొరబడినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ఈ దాడికి క్లౌడ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించే ‘కంట్రోల్ ప్లేన్‌’లోని లోపం కారణమైనట్లు తెలుస్తోంది. క్లౌడ్ వ్యవస్థలోని వివిధ భాగాలు ఎలా పనిచేయాలి? వాటిని ఎలా నియంత్రించాలి? అనే అంశాలను పర్యవేక్షించే కీలక విభాగమే కంట్రోల్ ప్లేన్‌. దీనికి వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించే రిమోట్‌లాంటిద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్థాయిలోకి హ్యాకర్లు ప్రవేశించగలిగితే సైనిక విమానాల స్థానాలు, వాటికి సంబంధించిన పరికరాల కదలికలు వంటి అత్యంత కీలకమైన సమాచారానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దాడికి పాల్పడినవారు నిజంగానే ఈ వివరాలను చూశారా? వాటిని సేకరించారా? అన్నది తెలియాల్సి ఉంది.

సైనిక భద్రతపై ఆందోళనలు

అమెరికా వైమానిక దళం కార్యకలాపాలకు సంబంధించిన కీలక వ్యవస్థలు ఒకే క్లౌడ్ వేదికపై ఉండడం, అందులో భద్రతా లోపం బయటపడటం ప్ర‌స్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సైనిక పరికరాలు, ఆయుధ వ్యవస్థలు, సిబ్బంది సమాచారానికి సంబంధించిన వివరాలు సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకర్లు ఎంతవరకు నష్టం కలిగించారు? ఏమైనా రహస్య సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిందా? అన్న దానిపై స్పష్టత వస్తేనే ఈ దాడి తీవ్రతపై పూర్తి అంచనా వేసే అవ‌కాశం ఉన్న‌ది.

Advertisement
Advertisement