త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Google | గూగుల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్.. మాట్లాడే స‌మ‌యంలో వెంట‌ వెంటనే అనువాదం..

Google | గూగుల్ తన కొత్త ఆడియో ఆధారిత ఏఐ మోడల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ను లాంచ్‌ చేసింది. దీన్ని రియల్-టైమ్ స్పీచ్-టు-స్పీచ్ ట్రాన్స్‌లేషన్ కోసం రూపొందించారు. భాషలను కేవలం అనువదించడం మాత్రమే కాకుండా, మాట్లాడే వ్యక్తి స్వరం, టోన్, వేగం, పిచ్ వంటి లక్షణాలను కూడా సాధ్యమైనంత వరకు అలాగే ఉంచుతూ సహజమైన సంభాషణ అనుభవాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం.

S

Technology | Published On Jun 10, 2026, 3.06 pm IST

Google | గూగుల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్.. మాట్లాడే స‌మ‌యంలో వెంట‌ వెంటనే అనువాదం..
Advertisement

Google | గూగుల్ తన కొత్త ఆడియో ఆధారిత ఏఐ మోడల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ను లాంచ్‌ చేసింది. దీన్ని రియల్-టైమ్ స్పీచ్-టు-స్పీచ్ ట్రాన్స్‌లేషన్ కోసం రూపొందించారు. భాషలను కేవలం అనువదించడం మాత్రమే కాకుండా, మాట్లాడే వ్యక్తి స్వరం, టోన్, వేగం, పిచ్ వంటి లక్షణాలను కూడా సాధ్యమైనంత వరకు అలాగే ఉంచుతూ సహజమైన సంభాషణ అనుభవాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. అనువాద రంగంలో రెండు దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన మెషిన్ లెర్నింగ్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యవస్థను నిర్మించినట్లు గూగుల్ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ ఉత్పత్తుల ద్వారా ప్రతి నెల ట్రిలియన్‌కు పైగా పదాల‌ను అనువదిస్తున్నార‌ని, బహుభాషా కమ్యూనికేషన్‌ను మరింత సహజంగా మార్చడంలో ఇది తదుపరి కీలక అడుగ‌ని పేర్కొంది. సాంప్రదాయ ట్రాన్స్‌లేషన్ వ్యవస్థల్లో ఒక వ్యక్తి మాట్లాడటం పూర్తయ్యాక మాత్రమే అనువాదం ప్రారంభమవుతుంది. అయితే జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్‌లో మాట్లాడుతున్న సమయంలోనే అనువాదం కొనసాగుతుంది. స్పీకర్ మాటలకు కేవలం కొన్ని సెకన్ల వెనుకబడి అనువాదం కొన‌సాగుతుండడంతో సంభాషణ మరింత సహజంగా సాగుతుంది.

70 కంటే ఎక్కువ భాష‌ల‌కు స‌పోర్ట్‌..

జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్‌లో ప‌లు ముఖ్య సామర్థ్యాలు అందుబాటులో ఉన్నాయి. 70 కంటే ఎక్కువ భాషలను ఆటోమేటిక్‌గా గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే వాక్యం పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా నిరంతర స్పీచ్-టు-స్పీచ్ అనువాదం అందిస్తుంది. మాట్లాడే వ్యక్తి టోన్, పిచ్, వేగాన్ని సాధ్యమైనంత వరకు కొనసాగించడంతోపాటు వేగం, నాణ్యత మధ్య సమతుల్యత కోసం అవసరమైన సందర్భాన్ని అర్థం చేసుకునే వ్యవస్థ ఇందులో ఉంది. అలాగే తక్కువ లేటెన్సీతో సాఫీగా ఆడియో అవుట్‌పుట్ ను అందిస్తుంది. శబ్దభరితమైన పరిసరాల్లో కూడా మెరుగైన పనితీరు ఇస్తుంది. మాన్యువల్‌గా భాషలను ఎంపిక చేయాల్సిన అవసరం ఉండ‌దు. ఈ సాంకేతికతను ముఖ్యంగా రియల్-టైమ్ కమ్యూనికేషన్ అవసరాల కోసం రూపొందించారు. మీటింగ్స్, ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ క్లాసులు, లైవ్ ప్రసారాలు వంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. స్పీచ్‌ను లైవ్‌గా ప్రాసెస్ చేయడం ద్వారా వివిధ భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య సంభాషణను సులభతరం చేస్తుంది. అలాగే ఒకేసారి బహుభాషా అనువాదం, రియల్-టైమ్ డబ్బింగ్ వంటి వినియోగాలకు కూడా ఇది స‌పోర్ట్‌ ఇస్తుంది.

డెవ‌ల‌ప‌ర్లు సొంతంగా..

జెమినీ లైవ్ ఏపీఐ, గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా డెవలపర్లు తమ సొంత రియల్-టైమ్ వాయిస్ ట్రాన్స్‌లేషన్ అప్లికేషన్లను అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే పలు ప్లాట్‌ఫాంలు ఈ మోడల్‌ను తమ సేవల్లో అనుసంధానిస్తున్నాయి. వాటిలో అగోరా, ఫిష్ జామ్‌, లైవ్ కిట్‌, పైప్‌క్యాట్‌, విజ‌న్ ఏజెంట్స్ ఉన్నాయి. ఈ ఇంటిగ్రేషన్లు ప‌లు సేవలకు ఉపయోగపడనున్నాయి. వాయిస్ ట్రాన్స్‌లేషన్ అప్లికేషన్లు, లైవ్ ఇంటర్‌ప్రిటేషన్ సిస్టమ్స్, రియల్-టైమ్ డబ్బింగ్ టూల్స్, బహుభాషా కమ్యూనికేషన్ సేవలకు ఇవి ప‌నిచేస్తాయి. అదేవిధంగా గ్రాబ్‌ సంస్థ డ్రైవర్లు, ప్రయాణికుల మధ్య దాదాపు రియల్-టైమ్ కమ్యూనికేషన్ కోసం ఈ మోడల్‌ను పరీక్షిస్తోంది. ఆ సంస్థ ప్రతి నెల 10 మిలియన్లకు పైగా వాయిస్ కాల్స్‌ను నిర్వహిస్తోంది. జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ సాయంతో గూగుల్ మీట్ లో బహుభాషా సమావేశాలు మరింత సులభత‌రం కానున్నాయి.

యాప్‌ల‌లో అంద‌రికీ..

కొత్త అప్‌డేట్‌లో ఐదు భాషల నుంచి 70 కంటే ఎక్కువ భాషలకు మద్దతు ఇచ్చారు. ఒకే మీటింగ్‌లో 2వేల కంటే ఎక్కువ భాషా కలయికలకు మద్దతు ఇవ్వ‌డంతోపాటు స్పీచ్ ట్రాన్స్‌లేషన్ టూల్స్‌కు వేగవంతమైన యాక్సెస్ అందించారు. మెరుగైన రియల్-టైమ్ ఇంటర్‌ప్రిటేషన్ అనుభవం ఇచ్చారు. ఈ ఫీచర్ ఈ నెల నుంచి ఎంపిక చేసిన గూగుల్ వర్క్‌స్పేస్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు ప్రైవేట్ ప్రివ్యూలో అందుబాటులోకి వస్తోంది. ఈ ఏడాది చివర్లో మరింత విస్తృతంగా విడుదల చేయనున్నారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో కూడా ఈ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. ఇందులో హెడ్‌ఫోన్లతో లైవ్ ట్రాన్స్‌లేషన్, 70 కంటే ఎక్కువ భాషల్లో రియల్-టైమ్ సంభాషణ, మాట్లాడే వ్యక్తి టోన్‌ను ప్రతిబింబించే సహజ ఆడియో అవుట్‌పుట్ ను అందిస్తారు.

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ఇది ప్ర‌త్యేకం..

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త లిసనింగ్ మోడ్ ను కూడా గూగుల్ అందిస్తోంది. ఈ ఫీచర్‌లో ఫోన్‌ను కాల్ మాట్లాడినట్లుగా చెవికి పెట్టుకోవచ్చు. అనువదించిన ఆడియో నేరుగా ఇయర్‌పీస్ ద్వారా వినిపిస్తుంది. హెడ్‌ఫోన్లు లేని సందర్భాల్లో లేదా ప్రైవేట్‌గా వినాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ద్వారా రూపొందించే ప్రతి ఆడియోలో సింథ్‌ఐడీ వాటర్ మార్కింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది ఆడియోలో కనిపించని డిజిటల్ సంకేతాన్ని చేర్చి, ఆడియో ఏఐ ద్వారా క్రియేట్ అయిందో లేదో గుర్తించేందుకు సహాయపడుతుంది. దీంతో పారదర్శకత పెరగడంతోపాటు దుర్వినియోగ అవకాశాలు కూడా తగ్గుతాయని గూగుల్ చెబుతోంది. జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతోంది. జెమినీ లైవ్ ఏపీఐ, గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా పబ్లిక్ ప్రివ్యూను డెవ‌ల‌ప‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చారు. ఇక గూగుల్ మీట్‌ను ఎంపిక చేసిన వర్క్‌స్పేస్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు ఈ నెల నుంచి ప్రైవేట్ ప్రివ్యూలా అందిస్తారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో గ్లోబల్ రోలౌట్ వ‌స్తోంది. అందువ‌ల్ల యూజ‌ర్లు యాప్‌ల‌లో ఈ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ప్ర‌త్యేకంగా ఇయర్‌పీస్ ఆధారిత లిసనింగ్ మోడ్ ను అందించ‌నున్నారు.

Advertisement
Advertisement